తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi 2024: ఉగాది పండుగ నాడు ఈ పనులు చేస్తే మీకు ఏడాదంతా శుభమే, చేయకూడని పనులు కూడా ఇదిగో

Ugadi 2024: ఉగాది పండుగ నాడు ఈ పనులు చేస్తే మీకు ఏడాదంతా శుభమే, చేయకూడని పనులు కూడా ఇదిగో

Haritha Chappa HT Telugu

08 April 2024, 10:00 IST

    • Ugadi 2024: ఉగాది వచ్చిందంటే తెలుగిళ్లు పచ్చని తోరణాలతో పండుగలా ఉంటాయి. ఉగాది పండుగ రోజు కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. అలాగే కచ్చితంగా చేయాల్సిన క్రతువులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి
ఉగాది పండుగ
ఉగాది పండుగ

ఉగాది పండుగ

Ugadi 2024: తెలుగు సంవత్సరానికి ఆది ఉగాది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగను నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. బ్రహ్మ ఈ సృష్టిని ఉగాది రోజే ప్రారంభించాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఉగాది వచ్చిందంటే ప్రకృతి అందంగా పచ్చదనంతో మెరిసిపోతుంది. చెట్లు చిగుళ్ళు పెడతాయి. పువ్వులు విరబూస్తాయి. వసంత కాలంలో చేసుకునే ఈ పండగ కోసం మానవాళి ఎదురుచూస్తూ ఉంటుంది. ఉగాదినాడు క్రోధినామ సంవత్సరం మొదలు కాబోతోంది. ఉగాది పండుగ రోజు చాలామంది తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ పండుగ రోజు కచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చేయడం వల్ల ఏడాదంతా శుభ్రంగానే సాగుతుంది. అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకొని ముందుగానే జాగ్రత్తపడితే మంచిది.

ఉగాది పండుగ రోజు చేయాల్సిన పనులు

ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు కచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే తెలుగు సంవత్సరం ప్రకారం ఈరోజే కొత్త ఏడాది మొదలవుతుంది. కొత్త ఏడాది మొదటి రోజు ఎంత ఆనందంగా ఉంటామో సంవత్సరమంతా అలానే ఉంటామని అంటారు. కాబట్టి ఉగాది రోజు కచ్చితంగా అందరూ కొత్త బట్టలు వేసుకుంటే మంచిది. అలాగే ఉగాదినాడు ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని రుచి చూడాలి. ఈ పచ్చడిని నవగ్రహాలతో పోలుస్తూ ఉంటారు. నవగ్రహాలలోని కొన్ని గ్రహాలకు ఈ పచ్చడిలోని రుచులకు సంబంధం ఉందని చెబుతారు.

ఉగాది పచ్చడిలోని తీపి గురుగ్రహానికి చిహ్నమని, ఉప్పు రుచి చంద్రుడని, మిరియాల పొడి రుచి సూర్యుడికి చిహ్నమని, పులుపుకి శుక్రుడు, కారానికి కుజుడు... ఇలా ఒక్కో రుచికి ఒక్కో గ్రహాన్ని సూచిస్తూ ఉంటారు. ఉగాది పండుగ రోజు అందరూ పంచాంగ శ్రవణం చేయాలి. అయితే పంచాంగ శ్రవణాన్ని ఎలా పడితే అలా కూర్చుని వినకూడదు. దక్షిణ ముఖంగా కూర్చుని పంచాంగ శ్రవణం చేస్తే ఆ ఏడాదంతా వారికి మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడితోపాటు, తీపి నైవేద్యాలతో లక్ష్మీదేవిని, మీ కులదైవాలను పూజించడం చాలా మంచిది. వారి అనుగ్రహం మీకు తప్పకుండా దొరుకుతుంది.

ఏం చేయకూడదు?

ఉగాది పండుగ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఎంతోమంది అర్ధరాత్రిదాకా మేల్కొని పొద్దెక్కదాకా నిద్రపోతారు. ఉగాది రోజు మాత్రం ఉదయాన్నే లేవాలి. సూర్యోదయానికి ముందే లేస్తే ఇంకా మంచిది. ఈ పండగ రోజు మద్యం, సిగరెట్, మాంసాహారం వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఇతరులతో గొడవలు పడకూడదు. చిరిగిపోయిన లేక మాసిపోయిన బట్టలను వేసుకోకూడదు. కచ్చితంగా కులదైవాన్ని పూజించుకోవాలి. ఉగాది పండుగ రోజు ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆరోజు మీరు ఎంత ఆనందంగా ఉంటే ఏడాదంతా అలానే సాగుతుంది.

ఉగాది పండుగ రోజు కొంతమందికి కొత్త గొడుగును కొనుక్కునే అలవాటు ఉంటుంది. అలా చేయడం చాలా మంచిదని, ఉగాది పండుగ రోజు కొత్త గొడుగులు కొంటే ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పూర్వం పెద్దలు విసనకర్రను ఉగాది రోజే కొనుక్కునేవారు. అలాగే కొత్త బట్టలు, కొత్త ఆభరణాలను ఉగాది రోజు కొనడానికి ఇష్టపడేవారు. ఇలా చేయడం వల్ల వారింట్లో ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయని నమ్మేవారు.

తెలుగు సంవత్సరంలో తొలిగా వచ్చే పండుగ ఉగాది. ఈ మొదటి పండగను వీలైనంతవరకు ఆనందంగా నిర్వహించుకోవడం చాలా మంచిది. శ్రీరాముడు ఇదే రోజు అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడని కూడా చెప్పుకుంటారు. అంతేకాదు విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించిన రోజు ఉగాది రోజే అని ప్రతీతి.

టాపిక్

తదుపరి వ్యాసం