Ugadi 2024: ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ పండుగ ప్రాశస్త్యం ఏంటి?-coronation of dharmaraja on ugadi day what is the significance of this festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2024: ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ పండుగ ప్రాశస్త్యం ఏంటి?

Ugadi 2024: ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ పండుగ ప్రాశస్త్యం ఏంటి?

HT Telugu Desk HT Telugu
Apr 06, 2024 02:49 PM IST

Ugadi 2024: ఉగాది ప్రాశస్త్యం గురించి, ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఉగాది ప్రాశస్త్యం
ఉగాది ప్రాశస్త్యం

Ugadi 2024: యుగాది అనే సంస్కృత పదానికి తెలుగు రూపం ఉగాది. తెలుగు, కన్నడ, మరాఠి మొదలగు ప్రాంతాలలో నూతన సంవత్సరం అంటే చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాదితో ప్రారంభమవుతుందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కాలమానాన్ని గణించడానికి ఇది తొలిరోజు. శిశిర రుతువు ఆకురాలు కాలం. ప్రకృతి చలితో గడ్డకట్టుకొనిపోతుంది. మోడువారిపోతుంది. సంకోచం పొంది ఉంటుంది. శిశిరం తరువాత వసంతం వస్తుంది. వసంతాగమనంతో ప్రకృతి ఒక్కసారి పులకిస్తుంది. క్రొత్తదనాన్ని సంతరించుకుంటుంది. చెట్లు చిగుర్చి నూతన సృష్టి అంకురిస్తుంది. సర్వత్రా ఒక చైతన్యం అంతరంగములను కదలిస్తుంది. కోకిలలు ఈ నూతన సంవత్సరానికి చక్కని గీతాలతో స్వాగతం పలుకుతాయి.

ఇది సృష్టి క్రమం. ప్రకృతిని నియమించే ఈ విధానమే వ్యక్తులు, జాతుల స్వభావాన్ని కూడా నియమిస్తుంది. సృష్టిలో కష్టసుఖాలు ఒకదానివెంట ఒకటి వస్తూనే ఉంటాయి. చైతన్యం నశించినప్పుడల్లా ఎవరో ఒక మహావ్యక్తి లేక మహోద్యమం జన్మించి వైతన్యం నింపి వికాసవంతమైన నూతన జీవితాన్ని నిర్మించడం సహజంగా జరుగుతోంది. ఆ మహావ్యక్తి లేక మహోద్యమం జన్మించిన రోజు ఒక నూతన శకానికి, ఒక యుగానికి ప్రారంభదినమవుతుంది. అది ఉగాది. ఆ దినం ఆ జాతికి పర్వదినం.

పూర్వపు కష్టాలను, భవిష్యత్తును గురించిన స్వప్నాలను ఒకటిగా కలిపి కదిలించి ప్రజలను సంఘటితంగా నడిపించే శుభదినం. దీనికి సూచనగానేమో కరృత్వపు అలుపు పులుపును, కొంత సత్ఫలితాల మాధుర్యాన్ని చూపే తీపి, వేపపువ్వు, పులుపు కలిపిన పచ్చడి సేవించే ఆచారం వచ్చిందని చిలకమర్తి తెలిపారు.

శ్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు నవమినాడు జన్మించాడు. రాక్షస సంహారం చేసి రుషుల నుంచి వానరుల దాకా అందరినీ సంఘటితం చేసి ధర్మస్థాపన చేశాడు. ఆయన ఇప్పటికీ ఆదర్శప్రభువే. తరువాత ద్వాపరంలో కౌరవులు అధర్మమార్గాన్ని అవలంభించినప్పుడు ధర్మక్షేతమైన కురుక్షేత్రంలో కౌరవులను ఓడించి ధర్మరాజు పట్టాభిషిక్తుడైన రోజు ఇది. ధర్మానికి విజయం లభించిన రోజు ఇదే. ధర్మపక్షపాతిగా పేరు గాంచిన శ్రీకృష్ణభగవానుడు రథాన్ని నడిపి, ధర్మమెక్కడో తానక్కడ అనే సత్యాన్ని ప్రపంచానికి చాటాడని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner