Voters Day: ఓటరు చైతన్యం కోసం స్పెషల్ కాంపిటీషన్..
Voters Day: జనవరి 25 ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Voters Day: 18 ఏళ్ల వయసు దాటినా ఎంతో మంది ఓటు హక్కు నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యంగా చేస్తుండగా.. యువత, ఓటర్లలో చైతన్యం నింపేందుకు అధికారులు ప్రణాళిక రచించారు. ఈ మేరకు ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఓటరు నమోదుకు ముందుకు వచ్చేందుకు ‘భారతదేశంలో ఎన్నికలు.. ఓటరు అవగాహన’ అనే కాన్సెప్ట్ తో కార్యక్రమాన్ని చేపట్టి, డిగ్రీ విద్యార్థులకు వాల్ పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు.
పోటీల్లో పాల్గొనడానికి వరంగల్ నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరాగా.. ఉత్తమ పెయింటింగ్లకు ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుమతులు అందించి మరింత ప్రోత్సహించనున్నారు.
300 మందికి పైగా పోటీలో..
జనవరి 25వ తేదీన జరగనున్న 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ‘సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్(స్వీప్)’ కార్యక్రమంలో భాగంగా ఓటరు అవగాహన కార్యక్రమానికి హనుమకొండ జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఓటర్ అవేర్నెస్ అండ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అనే ఇతివృత్తంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కాంపౌండ్ పై అంబేడ్కర్ జంక్షన్ వద్ద వాల్ పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. అంతేగాకుండా నక్కలగుట్ట, హనుమకొండ చౌరస్తా ప్రాంతాల్లో కూడా పోటీలు పెట్టారు.
18 ఏళ్లు నిండిన దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొని, తమ తమ టాలెంట్ ను వాల్ పెయింటింగ్ రూపంలో ప్రదర్శించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడంతో ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపేలా వాటిని తీర్చి దిద్దారు.
ఓటు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు వేసే విధానం, భారత ఎన్నికల విధానం, తదితర వివరాలను తెలిపే విధంగా విద్యార్థులు గోడలపై అందమైన చిత్రాలను చిత్రీకరించారు. విద్యార్థులు వేసిన చిత్రాలను హనుమకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, స్వీప్ నోడల్ అధికారి హరి ప్రసాద్, ఇతర అధికారులు పరిశీలించారు.
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేయనున్నారు. కాగా విద్యార్థులు గీసిన చిత్రాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు వేసిన చిత్రాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు బుధవారం సాయంత్రం నిర్ణేతల బృంద సభ్యులు డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్, మైనారిటీ వెల్ఫేర్ డీడీ మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత తదితరులను వాటిని పరిశీలించారు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి బహుమతులను అందజేయనున్నారు.
ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి
వాల్ పెయింటింగ్ పోటీలను పరిశీలించిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అంబేడ్కర్ జంక్షన్ వద్ద మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు. చేర్పుల కోసం ఫారం –8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఓటును మార్చుకోవాలన్నా, ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే ఫారం–8 ద్వారా సవరించుకోవచ్చని అడిషనల్ కలెక్టర్ సూచించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)