Ugadi 2024: ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి?-why we celebrate ugadi festival what are the rituals to follow on that day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2024: ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి?

Ugadi 2024: ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి?

HT Telugu Desk HT Telugu
Published Apr 06, 2024 08:00 AM IST

Ugadi 2024: ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి? పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

ఉగాది ఎందుకు జరుపుకుంటారు?
ఉగాది ఎందుకు జరుపుకుంటారు? (freepik)

Ugadi 2024: కల్ప ఆరంభము యుగ ఆరంభము అయిన రోజు యుగాదిగా చెప్పబడింది. యుగాది రోజునే బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభించినట్లుగా శాస్త్రాలు తెలియచేసినట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చగ్రవర్తి శర్మ తెలిపారు.

ఈ సృష్టి యావత్తు బ్రహ్మదేవుడు తన భూత సృష్టిని ప్రారంభించిన సృష్ట్వాది నుంచి లేక కలియుగం ప్రారంభం మొదలు నుండి గాని పంచాంగాలలో లెక్కించటం వాడుకగా వస్తున్న ఆచారం. ఈ బ్రహ్మ సృష్టిలో ప్రళభయం అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే ఆధ్యాయాన్ని బ్రహ్మ కల్పం అని అంటారు. ఈ ప్రారంభకాలాన్ని కల్పాది అని వ్యవహరిస్తారు. ప్రతీ కల్పంలోను మొదట వచ్చే ఆది సమయమే ఉగాది పండుగ. దీని గురించి సూర్య సిద్ధాంతము అనే జ్యోతిష్య గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతీ తెలుగు సంవత్సర ఆరంభదినం నాడు మనం ఉగాది పర్వదినం జరుపుకునే ఆచారం ఏర్పడిందని చిలకమర్తి తెలిపారు.

యుగాది అనేది సంస్కృత పదం. ఉచ్చారణ బేధం వలన ఉగాది అనే తెలుగు మాట ఏర్పడినది.

చైత్రేమాసి జగద్రృహ్మ ససర్జ ప్రథమే అహని । వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ ॥॥

తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు రుతువులుగా విభజించారు. సంవత్సరం పొడవునా అనేక ఒడిదుడుకులు అనుభవించిన ప్రకృతిలో చెట్లు శిశిర రుతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి. చైత్ర మాసంలో కొత్త చిగురు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి. ఈ విధంగా ప్రకృతిలో సంభవించే నూతన వత్సరం చైత్ర మాసం. అందుకే ఈ మాసారంభానికి ఉగాది అని పేరు వచ్చినదని చిలకమర్తి తెలిపారు.

ఉగాది రోజు ఆచరించాల్సిన నియమాలు

ఉగాది పర్వదినాన అభ్యంగనము, పుణ్యకాల సంకల్పం, ఉగాది పచ్చడి సేవనం, ధర్మకుంభం, సృష్టి క్రమవర్ణన, కల్పాది వైవస్వత మన్వంతర వివరములతో కూడిన పంచాంగ శ్రవణం అనే ముఖ్యమైన విధులను అనుసరించవలసి ఉంటుంది. సూర్యోదయానికి పూర్వమే నువ్వుల నూనె తలకి పట్టించి ఉసిరి కాయ, పెసరపిండి, పసుపు, భావపంచాలు, కచ్చూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం చేయాలి. ఈ దినం వేడినీటి స్నానం శ్రేష్టం. అనంతరం తిలకం దిద్దుకుని, నూతన వస్త్రములు ధరించి సంకల్పం చెప్పుకొనవలెనని ధర్మసింథువు తెలియచేస్తోంది.

సూర్యోదయానికి ఒక ముహూర్తకాలం (20 నిమిషాలు) మాత్రమే పాడ్యమి ఉన్నా సరే ఆ రోజునే పండుగ సందర్భ సంకల్పం చెప్పుకొని ప్రారంభించాలి. సూర్యునికి అర్ఘ్యం, దీపం, ధూపం, పుష్పాంజలి సమర్పించాలని చిలకమర్తి తెలియచేసారు. ఈ సంకల్పములో ముఖ్యమైన దేశము, కాలము ధ్యానించి, బ్రహ్మ సృష్టి సంకల్పం యొక్క సంకల్ప సిద్ధిని ధ్యానించి, మనము తలపెట్టిన కార్యక్రమాలకు శుభఫలితాలు ఇవ్వాలని కోరుకుంటారు. హైందవ సంకల్ప మంత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.

ఉగాది పచ్చడి విశిష్టత

ఈ సాంప్రదాయ కృత్యములో ముందుగా స్మరించే శ్వేత వరాహ కల్పం అనబడే ఈ బ్రహ్మకల్పము యొక్క సంకల్పము. ఇది పంచాంగ గణితమంతటికీ ఆధారభూతమైనది. అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఉగాది పచ్చడి స్వీకరణ. దీనిని పరగడుపునే స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి షడ్రుచులు కలసిన ఉగాది పచ్చడి మనం సొంతం. ఈ పచ్చడి తయారుచేసుకోవటానికి చెరకు, మామిడికాయలు, వేప పువ్వు, అరటి పళ్ళు, లవణం, చింతపండు, బెల్లం, పచ్చిమిరప మొదలైనవి వాడతారు. చూత కుసుమము, అశోక చిగురులు కలిపి సేవించే సాంప్రదాయము మనకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుందని చిలకమర్తి తెలిపారు.

ఉగాది రోజు ఏం చేయాలి?

రానున్న రోజులలో పూర్ణ మనోరథ సిద్ధి, సకల సౌభాగ్యాలు కలుగుతాయనే సంకల్ప బలంతో పంచలోహాల పాత్రగాని, మట్టికుండగాని కలశముగా తీసుకోవాలి. సుగంధ జలము, చందనం, పుష్పాక్షతలు వేసి అవాహనచేసి పుణ్యాహ మంత్రములతో బియ్యము పోసిన ఒక పళ్ళెములో కలశము ఉంచి నూతన వస్త్రము చుట్టి ఉపరి భాగమున నారికేళము ఉంచి, కుంకుమ, పసుపు చందనములు సమర్పించాలి. దీన్ని పురోహితునకు గాని, గురువునకు గాని లేక గుడిలోని ఇష్టదైవమునకు గాని దానమిచ్చి వారి ఆశీర్వాదములు పొందాలి. దీనినే ధర్మఘట దానం లేక ప్రపాదానం అంటారు. ఈ విధి నేటికీ పల్లెలలో ఆచరిస్తున్నారని చిలకమర్తి తెలిపారు.

పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?

మహాపర్వదినాలైన కల్పాది తిథులు, మన్వంతర తిథులు, దశావతార పుణ్య తిథులు మొదలైనవి ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ మొదలైన 5 అంగముల కలయికను పంచాంగం అంటారు. ఈ విధమైన పంచ అంగముల శ్రవణము వలన భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు, పండుగలు, గ్రహణాలు, వర్ష వివరాలు, కాల నిర్ణయాలు, ఆ సంవత్సరంలో సాగే ధరవరలు, వర్షపాతములు మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner