Yoga for Urine control: మూత్రం ఆపుకోలేకపోతున్నారా? ఈ యోగాసనాలతో ఉపశమనం
29 September 2024, 12:30 IST
Yoga for Urine control: మూత్రం మీద నియంత్రణ తగ్గింది అనిపిస్తే ఈ యోగాసనాలు మీ దినచర్యలో భాగం చేసుకోండి. వయసు పైబడిన వాళ్ల నుంచి మహిళలు, యవ్వన వయస్కుల్లోనూ సమస్య నుంచి ఈ యోగాసనాల వల్ల ఉపశమనం దొరుకుతుంది.
మూత్రం మీద నియంత్రణ పెంచే ఆసనాలు
1. బాత్రూంలోకి వెళ్లేంతలోనే ప్యాంట్ తడిపేసుకోవడం
2. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు మీ నియంత్రణలో లేకుండా మూత్రం పోసేయడం
3. మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయినట్లు అనిపించదు. దాంతో తరచూ మూత్రానికి వెళ్లాలి అనిపించడం
4. బాత్రూం వెళ్లడం ఆలస్యం అయితే మూత్రం పోసేయడం..
ఇవన్నీ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ (UI) అంటే మూత్రం ఆపుకోవడం మీద కోల్పోయిన నియంత్రణను సూచించే సంకేతాలు. ఈ సమస్య సాధారణంగా వయసు పైబడిన వాళ్లలో కనిపిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల యవ్వన వయస్కుల్లోనూ ఈ సమస్య వస్తుంది. అలాగే ప్రసవం తర్వాత మహిళల్లోనూ ఈ సమస్య కనిపించొచ్చు. మెనోపాజ్‌లో కూడా మూత్రం మీద నియంత్రణ తగ్గుతుంది. దీన్నుంచి బయటపడటానికి ఉత్తమమైన మార్గం యోగా. రోజూ ఈ యోగాసనాలు మీ దినచర్యలో భాగం చేసుకుంటే సులువుగా బయటపడొచ్చు.
మూత్రం నియంత్రణ పెంచే యోగాసనాలు:
1. చక్రాసనం:
దీనికోసం నిటారుగా నిలబడండి. చేతులను పక్కలకు ఆనించండి. పాదాల మధ్య కాస్త ఎడం ఉంచండి. చేతులు మీ చెవులను తాకేలా పైకి నిటారుగా ఎత్తండి. నెమ్మదిగా చేతులతో పాటూ వెనక్కి వంగండి. మీ ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్లను కలిపి పట్టుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మీరుండగలిగినంత సేపు ఈ స్థితిలో ఉండి మామూలు స్థితికి రండి. ఇది కటి ప్రాంత కండరాలను బలపరిచి మూత్రం మీద నియంత్రణను పెంచుతుంది.
2. భద్రాసనం లేదా బటర్ ఫ్లై పోజ్:
నేల మీద కూర్చోండి. మీ రెండు కాళ్లను ముందుకు చాపండి. మెల్లిగా రెండు కాళ్లను కటి ప్రాంతం వైపుకు తీసుకురండి. రెండు పాదాలు ఒకదాన్ని ఒకటి చూస్తున్నట్లు తాకాలి. పాదాలను మీ వైపుకు వీలైనంతగా జరపండి. ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు ఉండాలి. ఈ యోగాసనం ప్రెగ్నెన్సీలో కూడా ఉపయోగకరం. ఇది కూడా మూత్రం మీద నియంత్రణను పెంచుతుంది.
3. పశ్చిమోత్తాసనం:
ప్రశాంతంగా నేల మీద కూర్చోండి. రెండు కాళ్లను ముందుకు చాపండి. నిటారుగా కూర్చోండి. శ్వాస తీసుకుని వీలైనంత ముందుకు వంగండి. మీ చేతులతో పాదాల బొటన వేలును పట్టుకుని వెనక్కు లాగే ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ మళ్లీ ముందు స్థితికి వచ్చేయండి. ఇది నడుము ప్రాంతాన్ని, కటి ప్రాంతాన్ని బలంగా మారుస్తుంది.
4. కోణాసనం:
పాదాల మధ్య కాస్త ఎడం ఉంచి నిలబడండి. కుడి చేతి వేళ్లతో ఎడమ కాలును పట్టుకోడానికి వంగండి. ఎడమచేతిని పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో ఉండి శ్వాస తీసుకోండి. ఇలా చేతు మార్చి మరోసారి చేయాలి. ఇది నడుము, వెన్ను కండరాలను బలపరుస్తుంది. మూత్రాశయ నియంత్రణనూ పెంచుతుంది.
టాపిక్