తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mealmaker Paratha: మీల్ మేకర్ మిక్సీ పట్టి పరాటా చేసేయండి..హై ప్రొటీన్ అల్పాహారం

Mealmaker paratha: మీల్ మేకర్ మిక్సీ పట్టి పరాటా చేసేయండి..హై ప్రొటీన్ అల్పాహారం

24 September 2024, 6:30 IST

google News
  • Mealmaker paratha: మీల్ మేకర్‌తో ఎక్కువగా స్నాక్స్, కర్రీలు చేస్తుంటాం. ఒకసారి ఇలా మీల్ మేకర్ పరాటా ట్రై చేయండి. ప్రొటీన్ ఎక్కువుండే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ.

మీల్ మేకర్ పరాటా
మీల్ మేకర్ పరాటా

మీల్ మేకర్ పరాటా

మీల్ మేకర్‌లో అధిక స్థాయిలో ప్రొటీన్ ఉంటుంది. ఉదయాన్నే దీన్ని అల్పాహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరం. అలాగనీ కర్రీలు, బిర్యానీలు చేసుకుని ఉదయం పూట తినడం కాస్త కష్టమే. అందుకే మీల్ మేకర్ స్టఫ్ఫింగ్ తో పరాటా ఎలా చేసుకోవాలో చూసేయండి.

మీల్ మేకర్ పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు మీల్ మేకర్

ఒకటిన్నర కప్పుల గోదుమపిండి

పావు చెంచా వాము

1 ఉల్లిపాయ సన్నటి తరుగు

1 చెంచా అల్లం తరుగు

1 చెంచా వెల్లుల్లి తరుగు

సగం చెంచా జీలకర్ర పొడి

సగం చెంచా ధనియాల పొడి

సగం చెంచా గరం మసాలా

తగినంత ఉప్పు

గుప్పెడు కొత్తిమీర తరుగు

తగినంత ఉప్పు

పావు చెంచా పసుపు

సగం చెంచా కారం

4 చెంచాల నూనె

మీల్ మేకర్ పరాటా తయారీ విధానం:

1. ముందుగా కొన్ని నీళ్లు తీసుకుని వేడి చేసి ఉప్పు వేసుకుని అందులో మీల్ మేకర్ వేసుకోవాలి. అయిదు నిమిషాలయ్యకా నీళ్లంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి.

2. ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసుకోవాలి. నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.తర్వాత అరగంట పాటూ తడిగుడ్డ కప్పేసి పక్కన పెట్టుకోవాలి.

3. మీల్ మేకర్ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.

4. ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కాస్త రంగు మారాక ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. ముక్కలు మగ్గిపోవాలి.

5. ఇప్పుడు పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి.

6. అందులోనే బరకగా మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకుని రెండు నిమిషాల పాటూ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి.

7. చివరగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే పరాటా స్టఫ్ఫింగ్ రెడీ అయినట్లే. దీన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

8. ముందుగా కలుపుకున్న గోధుపిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగా ఒత్తుకుని మధ్యలో మీల్ మేకర్ స్టఫ్ఫింగ్ పెట్టుకోవాలి.

9. కాస్త మందంగా ఒత్తుకోవడం మర్చిపోవద్దు.

10. ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని వేడెక్కాక పరాటా వేసుకుని కాల్చుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకోవాలి. రెండు వైపులా రంగు మారి కాస్త క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకుంటే చాలు. మీల్ మేకర్ పరాటా రెడీ అయినట్లే.

11. దీన్ని నేరుగా తినేయొచ్చు లేదా కెచప్, చట్నీతో సర్వ్ చేయొచ్చు.

తదుపరి వ్యాసం