Gond Katira Ladoo: బాలింతలకు ఇచ్చే బంక లడ్డూలు.. మధురమైన రుచిని ఎవరైనా ఆస్వాదించొచ్చు..
09 July 2024, 15:30 IST
Gond Katira Ladoo: బాలింతలు తినే గోంద్ కతీరా లడ్డూలు రుచిలో ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని పిల్లలు, పెద్దవాళ్లు కూడా తినొచ్చు. గోంద్ కతీరా లేదా బంక లడ్డూలు ఎలా తయారు చేయాలో వివరంగా తెల్సుకోండి.
బంక లడ్డూలు
బాలింతలు తినే బంక లడ్డూలంటే రుచి బాగుంటుందో లేదో అనుకునేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు. ఈ లడ్డూల్లో వాడే బంక లేదా గోంద్ కతీరా వల్ల ఈ లడ్డూలకు ప్రత్యేక రుచి వస్తుంది. డెలివరీ తర్వాత బాలింతలకు ఈ బంక లడ్డూలను చాలా ప్రాంతాల్లో చేసి ప్రతిరోజూ ఉదయాన్నే తినడానికి ఇస్తారు. ఇది బాలింతలకు బలాన్నిస్తుందని చెబుతారు. దీంట్లో ఉండే పోషకాల వల్ల ప్రత్యేక ఆహారంగా మారిపోయిందిది.
అయితే పిల్లలు, పెద్దవాళ్లు కూడా ఈ లడ్డూలను ఇష్టంగా తినేస్తారు. వీటికుండే రుచి అలాంటిది. దీని తయారీ డ్రై ఫ్రూట్ లడ్డూలను పోలి ఉన్నా.. కొన్ని మార్పులతో రుచి మరింత పెరుగుతుంది. దాని తయారీ ఎలాగో చూసేయండి.
గోంద్ కతీరా లడ్డూల తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు నెయ్యి
సగం కప్పు బంక లేదా గోంద్ కతీరా
పావు కప్పు బాదాం
2 చెంచాల కిస్‌మిస్
2 చెంచాల జీడిపప్పు
2 చెంచాల గసగసాలు
పావు కప్పు ఎండు ఖర్జూరం
పావు టీస్పూన్ యాలకుల పొడి
పావు టీస్పూన్ జాజికాయ పొడి
1 కప్పు పంచదార పొడి లేదా బెల్లం పొడి
గోంద్ కతీరా లడ్డూల తయారీ విధానం:
1. ముందు ఒక కడాయిలో పావు కప్పు నెయ్యి వేసుకుని వేడెక్కాక అందులో గోంద్ కతీరా లేదా బంక వేసుకోవాలి. ఒక నిమిషం పాటూ వేయించగానే బంక బాగా పొంగిపోతుంది.
2. వెంటనే బంకను ఒక పళ్లెంలోకి తీసుకోవాలి.
3. ఇప్పుడు అదే నెయ్యిలో బాదాం, జీడిపప్పు, గసగసాలు కూడా ఒక నిమిషం వేయించి తీసుకోవాలి.
4. ఇప్పుడు మిక్సీజార్‌లో ముందుగా బాదాం, జీడిపప్పు, గోంద్ కతీరా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎండు ఖర్జూరం ముక్కలు, పంచదార కూడా వేసుకుని మరోసారి మిక్సీ పట్టాలి.
5. మిక్సీ పట్టుకున్న పొడి అంతా ఒక వెడల్పాటి బౌల్ లోకి తీసుకోవాలి. అందులో వేడి చేసుకున్న నెయ్యిని పోసుకోవాలి.
6. నెయ్యి వల్ల మిశ్రమం అంతా బాగా కలిసిపోతుంది. చివరగా గసగసాలు కూడా వేసుకుని కలుపుకోవాలి.
7. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఉండల్లాగా కట్టుకోవాలి. అంతే గోంద్ కతీరా లడ్డు రెడీ అయినట్లే. వీటిని గాజు చొరవని డబ్బాలో వేసుకుని భద్రపర్చుకుంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి.
ఈ లడ్డూల తయారీ కోసం డ్రై ఫ్రూట్స్ వాడటం వల్ల ఒక్క లడ్డు తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తక్షణ శక్తి వస్తుంది. అలాగే గోంద్ కతీరాను వేసుకోవడం వల్ల లడ్డూ నములున్నప్పుడు మధ్యలో ఆ పలుకులు తగిలి కాస్త నమిలేదాకా లడ్డూ లోపలికి వెళ్లదు. దాంతో నోట్లో మంచి రుచి అనిపిస్తుంది. మీకు ఇష్టం లేకపోతే దీంట్లో పంచదారను వాడద్దు అనుకుంటే.. ఎండు ఖర్జూరాలే ఎక్కువగా వేసుకుంటే దానివల్ల అవసరమైన తీపి వస్తుంది. లేదంటే బెల్లం కూడా వాడుకోవచ్చు. వీటిని బాలింతలే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యకరమే.