Diaper Rashes in Babies: డైపర్ వాడినా ర్యాషెస్ రావొద్దంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
23 August 2024, 10:21 IST
Diaper Rashes in Babies: డైపర్ల వాడకం వల్ల చిన్న పిల్లల్లో ర్యాషెస్ వస్తాయి. ఒక్కోసారి ఈ నొప్పి భరించలేక పిల్లలు ఏడ్చేస్తారు. చికాకుగా ఉంటారు. ర్యాషెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని తల్లిదండ్రులకు అవగాహన ఉండాల్సిందే. అవేంటో చూడండి. వీటిని పాటిస్తే ర్యాషెస్ రాకుండా కాపాడొచ్చు.
డైపర్ ర్యాషెస్
చిన్న పిల్లలకు డైపర్ల వాడకం తప్పనిసరి అయిపోయింది. రోజంతా వాటిని వాడకుండా ఉండటానికి ప్రయత్నించినా.. రాత్రి పూట మాత్రం వాడేస్తాం. అయితే వీటివల్ల డైపర్ ర్యాషెస్ రావడం సాధారణమే. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డైపర్ ర్యాషెస్ రాకుండా ఉంటాయి.
డైపర్ ర్యాషెస్ ఎందుకొస్తాయి?
డైపర్ మూత్రాన్ని, తేమను పీల్చుకుంటుంది. ఈ తేమ ఎక్కువసేపు అలాగే ఉండిపోతుంది. దాంతో బ్యాక్టీరియా పెరిగి ర్యాషెస్ రావచ్చు. లేదంటే డైపర్ తాకడం వల్ల చర్మం రాపిడికి గురయినా ర్యాషెస్ వస్తాయి. వీటితో పాటే బట్టలకు వాడే డిటర్జెంట్, ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్ పడకపోయినా ర్యాషెస్ వస్తాయి. వైప్స్ వాడకమూ ఈ సమస్యకు కారణం కావచ్చు. కొన్ని రకాల మందుల వల్ల వచ్చే రియాక్షన్లు, కొత్తగా ఏవైనా ఆహారాలు తినిపించడం మొదలుపెట్టినా వాటివల్ల ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది.
ఇలా జాగ్రత్త పడండి
1. పొడిగా ఉండాలి:
డైపర్ వేసే ముందు, ఒక డైపర్ తీసి మరో డైపర్ మార్చేటప్పుడు సరిగ్గా శుభ్రం చేయాలి. ఒకసారి తడి గుడ్డతో తుడవాలి. లేదంటే వెట్ వైప్స్ వాడినా పరవాలేదు. వాటిలో ఆల్కహాల్ లేకుండా చూసుకోండి చాలు. చర్మం పూర్తిగా ఆరిపోయాక డైపర్ వేయండి. ఒకవేళ డైపర్ ర్యాష్ ఇదివరకే వచ్చి ఉంటే గాలి ఆడేలా డైపర్ వేయకుండా మధ్యమధ్యలో అలా వదిలేయడం మంచిది. దీంతో ర్యాష్ తగ్గడం సులువవుతుంది.
2. డైపర్లు మార్చడం:
ప్రతి డైపర్ మీద దాన్ని ఎంతసేపు, ఎన్ని గంటలసేపు వాడొచ్చో రాసి ఉంటుంది. ఆ నియమం తప్పకుండా పాటించాలి. ఎక్స్‌ట్రా అబ్జర్ప్షన్ డైపర్లకు పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. వాటిని కాసేపు ఎక్కువే ఉంచొచ్చు. సాధారణ డైపర్లు కాస్త తొందరగానే మార్చేయాలి. లేదంటే అవి పిల్లలకు తడిగా అనిపించి అసౌకర్యం కలిగించడంతో పాటూ ర్యాషెస్‌కు కారణం అవుతాయి.
3. డిస్పోజబుల్ డైపర్లు:
కొంత మంది పిల్లలకు అసలు డైపర్లే పడవు. అదే గనక సమస్య అయితే సింగిల్ యూజ్ డైపర్లకు బదులుగా క్లాత్ డైపర్లు, రీయూజబుల్ రకాలు వాడి చూడండి. అవి ఎక్కువసేపు ఉంచలేం. తడిగా అయిన వెంటనే మారుస్తూ ఉంటాం కాబట్టి ర్యాషెస్ రావు. అయితే ఇదివరకే డైపర్ల వల్ల ర్యాషెస్ అయి ఉంటే వీటిని వాడకండి. ఎందుకంటే ఇవి తడిని అంతగా పీల్చుకోలేవు. కాబట్టి ర్యాషెస్ ఇంకా ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంటుంది. అవి తగ్గాక వీటి వాడటం మొదలుపెట్టి చూడండి.
4. డైైపర్ సైజ్:
ఒక్కోసారి డైపర్ మీద బరువు ప్రకారం చూయించే సైజ్.. మీ పిల్లలకు పెద్దగానో చిన్నగానో అవ్వొచ్చు. ఒక్కో బ్రాండ్ సైజ్ పిల్లలకు నప్పకపోవచ్చు కూడా. డైపర్ మరీ బిగుతుగా ఉంటే తడిగా అనిపిస్తుంది. ర్యాషెస్ వస్తాయి. అలాగే మరీ వదులుగా ఉంటే చర్మానికి రాసుకుని ర్యాషెస్ మరింత ఎక్కువ కావచ్చు. మీరు వాడుతున్న డైపర్ బ్రాండ్ మీ బిడ్డకు నప్పకపోతే ఈ సమస్య వస్తుంది. ఒకసారి బ్రాండ్ మార్చి చూస్తే ఫలితం ఉండొచ్చు.
5. ర్యాషెస్ క్రీమ్:
డైపర్ ర్యాషెస్ రాకుండా కొన్ని క్రీములు ముందే వైద్యులు సూచిస్తారు. వాటిని డైపర్ వేసే ముందు డైపర్ అంచులు చర్మానికి తగిలే చోట రాస్తే.. డైపర్‌కు చర్మానికి మధ్య అడ్డు పొరలాగా పనిచేస్తాయి. అలాగే ర్యాషెస్ వచ్చాక వాటిని తగ్గించే క్రీములు కూడా దొరుకుతున్నాయి. వాటిని రాస్తే వెంటనే చల్లదనం అనిపిస్తుంది. నొప్పి తగ్గుతుంది. సమస్యా తగ్గుముఖం పడుతుంది.