Fridge Electricity Bill : ఫ్రిజ్‍కి గోడకు మధ్య ఎంత దూరం ఉండాలి? కరెంట్ బిల్లు తగ్గించడం ఎలా?
28 October 2023, 12:30 IST
- Fridge Power Bill Reduce Tips : ఫ్రిజ్‍కి గోడకు మధ్య ఎంత దూరం ఉండాలనే విషయంపై చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ విషయం కూడా మీ కరెంట్ బిల్లు మీద ప్రభావం చూపిస్తుంది. ఇంతకీ వీటి మధ్య ఎంత దూరం ఉండాలి?
ఫ్రిజ్
ఈ రోజుల్లో మనం ఫ్రిజ్ లేని ఇల్లు చూడలేం. ఫ్రిజ్ వినియోగం ప్రజల్లో అధికంగా పెరిగింది. కానీ దానిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇంటి గోడకు, ఫ్రిజ్‍కి మధ్య దూరం ఎంత ఉండాలని చాలామందికి తెలియదు. ఈ చిన్న పొరపాటు కారణంగా కూడా కరెంటు బిల్లు భారీగా పెరిగిపోతుంది. కరెంటు బిల్లును అదుపులోకి తీసుకురావాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ చిన్న చిన్న తప్పులు చేసి.. సమస్యలు ఎదుర్కొంటారు.
కొందరు ఫ్రిజ్‌ని హాల్‌లో ఉంచితే, మరికొందరు వంటగదిలో ఉంచుతారు. ఫ్రిజ్‌ని ఉంచడానికి స్థిరమైన స్థలం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమకు కావలసిన చోట, అవసరానికి తగ్గట్టుగా పెడతారు. ఇది అంత పెద్ద విషయం కాదు. కానీ ఫ్రిజ్, గోడ మధ్య దూరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఒక్క తేడా మీ జేబు నుంచి డబ్బులు పోయేలా చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్రిజ్, గోడ మధ్య 6 నుండి 10 అంగుళాల ఖాళీ ఉండాలి. మీ ఫ్రిజ్ గోడకు చాలా దగ్గరగా ఉంటే అది వేడెక్కుతుంది, పనిచేయదు. వేడి సరిగా బయటకు వెళ్లలేక ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది. ఈ కారణంగా సమస్యలను నివారించడానికి గోడ నుండి సరైన దూరంలో మీ ఫ్రిజ్‌ను పెట్టాలి.
మీ ఫ్రిజ్‌ను చల్లబరచడానికి గాలి ప్రసరణ అవసరం. గాలి ప్రవాహానికి తగినంత స్థలం లేనట్లయితే కంప్రెసర్ వేడెక్కుతుంది. చివరికి పని చేయడం ఆగిపోతుంది. ఫ్రిజ్ లోపల కూడా సరైన సర్క్యులేషన్ లేకపోవడం మీ ఆహారం చెడిపోవడాన్ని వేగవంతం చేస్తుంది. ఫ్రిజ్ అనేది ఇంటిలో ఎక్కువగా విద్యుత్ ఉపయోగించే వస్తువులలో ఒకటి. ఇది సాధ్యమైనంత సమర్థవంతంగా నడుస్తుందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
ఫ్రిజ్‌ను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఫ్రిజ్‌ని ఎక్కువగా నింపవద్దు. ముఖ్యంగా మీకు అవసరం లేనప్పుడు ఎక్కువ ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దు. ఫ్రిజ్‌లో గట్టి ప్లాస్టిక్ ర్యాప్‌ను ఉంచవద్దు. దీంతో ఫ్రిజ్‌లో వేడి పెరుగుతుంది. తెరిచి ఉంచవద్దు. ఇది కూడా అధిక విద్యుత్ బిల్లుకు కారణం అవుతుంది.
చాలా మంది ఇంటికి దగ్గరలోనే షాపులు ఉన్నా.. సామాను ఎక్కువగా తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఎక్కువ ఐటమ్స్ ఫ్రిజ్‍లో ఉంటే కరెంట్ బిల్లు పెరుగుతుంది. అందుకే ప్రతిదాన్ని ఒకేసారి షాపింగ్ చేయడానికి బదులుగా.. తక్కువ పరిమాణంలో కొనాలి. దీంతో ఫ్రిజ్‍లో అనవసరమైన వస్తువులను నింపకుండా ఉండొచ్చు.