Bad Smell From Fridge: ఫ్రిజ్‌ నుంచి చెడు వాసన వస్తోందా? ఈ చిట్కాలతో చెక్‌..-tips and tricks to reduce bad smell from fridge ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bad Smell From Fridge: ఫ్రిజ్‌ నుంచి చెడు వాసన వస్తోందా? ఈ చిట్కాలతో చెక్‌..

Bad Smell From Fridge: ఫ్రిజ్‌ నుంచి చెడు వాసన వస్తోందా? ఈ చిట్కాలతో చెక్‌..

Koutik Pranaya Sree HT Telugu
Oct 08, 2023 04:15 PM IST

Bad Smell From Fridge: ఫ్రిజ్ తలుపు తీయగానే ఏదో చెడు వాసన వస్తోందా? అయితే వెంటనే కొన్ని సర్దుబాట్లు, చిట్కాలు పాటించండి. మార్పు కనిపిస్తుంది.

ఫ్రిజ్ దుర్వాసన తగ్గే చిట్కాలు
ఫ్రిజ్ దుర్వాసన తగ్గే చిట్కాలు (freepik)

ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లోనూ ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. కూరగాయలు, మాంసాహారాలు, వండిన పదార్థాలు తదితరాలను వాటిలో ఉంచుకుంటాం. ఇలాంటప్పుడు జరిగే కొన్ని పొరపాట్ల వల్ల ఫ్రిజ్‌ నుంచి కొన్నిసార్లు దారుణమైన వాసన వస్తుంటుంది. దానిలో ఉంచిన ఇతర పదార్థాలూ ఆ వాసనను పీల్చుకుని తినడానికి ఇబ్బందికరంగా తయారవుతాయి. మరి ఫ్రిజ్‌ అసలు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఏం చేయకూడదు తెలుసుకుందాం.

వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయకూడదు?

ఏ పదార్థాన్నైనా రెండు మూడు రోజులకు మించి ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటు వాసన ఉండే పదార్థాలను కట్‌ చేసిగాని, నేరుగా కాని దీని లోపల పెట్టకూడదు. మాంసాహారాల్ని గిన్నెల్లో ఉంచి ఓపెన్‌గా పెట్టకూడదు. వేటినీ మూతలు లేకుండా పెట్టకూడదు. పాల లాంటి పదార్థాలు ఒలికినట్లయితే వాటిని అలానే వదిలేయకూడదు.

దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వండిన పదార్థాలన్ని ఎయిర్‌ టైట్‌ బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పాల పదార్థాలు, వండిన పదార్థాలు, పొడులు ఇలా సరుకుల్ని బట్టి వేరు వేరుగా అరలను అమర్చుకోవాలి. అప్పుడు ఏది కావాలంటే అది తేలికగా దొరుకుతుంది. ఏ అర కావాలనుకుంటే ఆ అర శుభ్రం చేసుకోవడానికీ వీలుగా ఉంటుంది. దీంతో కొంత వరకు వాసనలు తగ్గుముఖం పడతాయి. అయినా సరే వాసనలు ఉంటున్నాయనుకుంటే కిందున్న చిట్కాలను ప్రయత్నించవచ్చు.

వాసనలను పోగొట్టే చిట్కాలు :

  • ఓ నిమ్మకాయ చెక్కను కోసి ఫ్రిజ్‌లో ఓ మూలన ఉంచండి. దానికి వాసనల్ని పీల్చుకునే లక్షణం ఉంటుంది. అందువల్ల ఫ్రిజ్‌ తాజాగా మారుతుంది. ఈ నిమ్మ చెక్కను వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. నిమ్మ చెక్కకు బదులుగా నారింజ, కమలాఫలం లాంటి నిమ్మజాతి పండ్లనూ ఉపయోగించుకోవచ్చు.
  • అలాగే ఓ గిన్నెలో కొన్ని నీరు పోయండి. అందులో ఓ స్పూను బేకింగ్‌ సోడా వేయండి. దాన్ని ఫ్రిజ్‌లో ఓ మూల ఉంచండి. లేకపోతే నిమ్మ చెక్క మీద ఓ అర చెంచా బేకింగ్‌ సోడా వేసి ఫ్రిజ్‌లో పక్కన ఉంచండి. దీని వల్లా వాసనలు తగ్గుముఖం పడతాయి.
  • వాడేసిన కాఫీ పొడిని ఎండబెట్టండి. దాన్ని తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఓ మూలన ఉంచండి. వాసనలను లాక్కునే శక్తి దీనికీ ఉంటుంది.
  • వాడేసిన గ్రీన్‌ టీ బ్యాగుల్లాంటి వాటిని ఎండకు ఆరనివ్వండి. వాటిని ఓ గిన్నెలో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని మార్చుకుంటూ ఉండండి.
  • బంగాళా దుంపను చెక్కుతీసి చిన్న ముక్కలుగా కోయండి. గిన్నెలో వేసి ఫ్రిజ్‌లో పక్కగా ఉంచండి. మూడు, నాలుగు రోజుల తర్వాత దీన్ని తీసివేయండి. వాసనలు తగ్గుతాయి.

Whats_app_banner