Cleansing With Baking Soda: క్లెన్సర్‌గా వంట సోడా? చర్మానికి మంచిదేనా?
Cleansing With Baking Soda: వంటగదిలో ఉండే బేకింగ్ సోడాను చర్మం సౌందర్యం కోసం, ఇతర ప్రయోజనాల కోసం వాడుతుంటాం. అలా వాడితే మంచిదా కాదా అనే విషయం మీద స్పష్టత తెచ్చుకోండి.
ఈ మధ్య కాలంలో స్కిన్‌కేర్‌కి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో ఒక వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. ఒక అమ్మాయి తెల్లగా ఉన్న తన ముఖం, చర్మ సౌందర్య రహస్యం వంట సోడా అంటూ పోస్ట్ చేసింది. చాలా తక్కువ ధరలో దొరికే వంట సోడాతో తాను ముఖాన్ని క్లెన్స్ చేసుకుంటానని చెప్పింది. అదే తాను ఇంతలా మెరిసిపోతూ ఉండేందుకు కారణమంటూ చెప్పుకొచ్చింది. ఇది వైరల్ కావడంతో అంతా దీనిపై కామెంట్లలో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ ఒకరు స్పందించారు. వంట సోడాని క్లెన్సర్‌గా వాడొచ్చు. కొంత వరకు ఇది పని చేస్తుంది గానీ దీని వల్ల దుష్ప్రభావాలూ లేకపోలేదని చెప్పుకొచ్చారు. మరసలు బేకింగ్ సోడాని ముఖానికి వాడొచ్చా? వాడితే వచ్చే లాభాలేంటి? నష్టాంలేంటి? చూసేద్దాం రండి.
బేకింగ్ సోడా ఉపయోగాలు :
- బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఇందులో యాంటాసిడ్ అనే ఆమ్లం ఉంటుంది. దీనికి సహజంగా మలినాల్ని శుభ్రం చేసే లక్షణం ఉంటుంది. ఇది ముఖంపై ఉండే పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, మొటిమలు లాంటి వాటిని నివారించడంలో పనికి వస్తుంది. చర్మాన్ని తెల్లగా చేస్తుంది.
- పెడిక్యూర్, మేనిక్యూర్ చేసుకోవడానికీ ఇది పనికి వస్తుంది. కాళ్లు, చేతుల గోళ్ల నుంచి మృత కణాలు అన్నీ పోయి చక్కగా మెరవాలంటే నీటిలో కాస్త సోడాని వేసి చిన్న బ్రష్‌తో గోళ్లపై రుద్దాలి. చర్మాన్ని స్క్రబ్ చేసుకోవడానికీ, క్లెన్సర్‌లాగానూ ఇది ఉపయోగపడతుంది.
- కొందరికి తల నూనె పెట్టకపోయినా జిడ్డు కారిపోతూ ఉంటుంది. ఇలాంటి జిడ్డు మాడుతత్వం ఉన్న వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. రోజూ తల స్నానానికి వాడుకునే షాంపూ డబ్బాలో దీన్ని కొంత మోతాదులో వేసుకుని తల స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
- పాదాలకు పగుళ్లు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి పది నిమిషాల పాటు పాదాల్ని ఆ నీటిలో ఉంచాలి. పగిలిన చోట వచ్చే నొప్పి, దురద, మంటల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాళ్లు సున్నితంగా, మృదువుగా మారతాయి.
- స్నానం చేసే నీళ్ళలో బేకింగ్ సోడా వేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. బేకింగ్ సోడాను మొక్కజొన్న పిండితో సమంగా తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి శరీరానికి పట్టించాలి. తర్వాత స్నానం చేయాలి. ఇది బాడీ స్క్రబ్ లా పని చేస్తుంది. చర్మం మీద దురదల్లాంటివి పోయి మృదువుగా ఉంటుంది.
- పళ్లు పసుపు రంగులోకి మారినప్పుడు నిమ్మరసంలో బేకింగ్‌సోడా, ఉప్పులను చేర్చి పళ్లు తోముకుంటే తెల్లగా మెరుస్తాయి.
జాగ్రత్త అవసరం :
వంటసోడాను చర్మంపై ఎక్కువగా ఉపయోగించకూడదని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు. కొందరికి చర్మం పొడిబారి పగుళ్లు వచ్చినట్లు అవుతుంది. అలాంటి వారు దీని జోలికి అస్సలు వెళ్లవద్దు. అలాగే దీన్ని ఎక్కువ కాలం పాటు వాడుతూ ఉన్నట్లయితే అది మన చర్మానికి ఉండే పీహెచ్ స్థాయిల్ని దెబ్బతీస్తుంది. ముఖంపై ఎక్కువ రోజుల పాటు వాడితే తర్వాత ఏక్నెతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి దీన్ని ఉపయోగించొచ్చుగానీ అదే పనిగా వద్దు.