Electricity Bill Scam : కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్, లింక్ పై క్లిక్ చేసినందుకు బ్యాంక్ ఖాతా ఖాళీ
Electricity Bill Scam : సైబర్ కేటుగాళ్లు విద్యుత్ వినియోగదారులను టార్గెట్ చేశారు. కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ లు పంపిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
Electricity Bill Scam : 'డియర్ కన్స్యూమర్, మీరు గత నెల విద్యుత్ బిల్లు చెల్లంచలేదు, అందువల్ల ఈ రోజు రాత్రి నుంచి మీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం' అని సైబర్ కేటుగాళ్లు మెసేజ్ లు పంపిస్తున్నారు. సైబర్ మోసాలపై అవగాహన లేకపోవడంలో కొందరు ఈ మెసేజ్ లోని ఫోన్ నెంబర్లకు కాల్ చేసి కేటుగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. కరెంట్ బిల్లు పేరుతో సైబర్ మాయగాళ్లు రూ.1.85 లక్షలు కొట్టేశారు. మార్చి నెలలో పెదపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి పెదరామకృష్ణంరాజుకు గుర్తుతెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీరు గత నెల విద్యుత్ బిల్లు కట్టలేదు. అందువల్ల మీ ఇంటి కరెంట్ కట్ చేస్తున్నామని అందులో ఉంది. ఇతర సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించడని ఓ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు రామకృష్ణంరాజు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తితో తాను కరెంట్ బిల్లు కట్టేశానని చెప్పారు. అతడు ఓ లింక్ పంపి దీనిపై క్లిక్ చేస్తే బిల్లు కట్టారో లేదో తెలుస్తోందన్నాడు.
బ్యాంకు ఖాతా ఖాళీ
ఆ సైబర్ మోసగాడి మాటలు నమ్మి రామకృష్ణంరాజు లింక్ క్లిక్ చేశారు. ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఏదో వెబ్‌సైట్ లో వెళ్లింది. అందులో విద్యుత్ బిల్లు వివరాలు లేవు. దీంతో మరోసారి రామకృష్టంరాజు ఆ వ్యక్తికి ఫోన్ చేసి, ఆ లింక్ లో కరెంట్ బిల్లు వివరాలు లేవన్నారు. అవతలి వ్యక్తి ఓ నెంబర్ పంపించి దానికి రూ.5 ఫోన్ పే చేస్తే తెలుస్తుందన్నాడు. అతడి మాటలు నమ్మిన కృష్ణంరాజు ఆ ఫోన్ నంబర్‌కు రూ.5 ఫోన్ పే చేశాడు. తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఫోన్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో రామకృష్ణంరాజు ఈ వ్యవహారాన్ని వదిలేశారు. అయితే ఆగస్టు నెలలో తనకు డబ్బు అవసరమై తన ఖాతా నుంచి తీసుకుందామని కృష్టంరాజు బ్యాంక్‌కి వెళ్లారు. తన ఖాతాలో మార్చి 28న రూ.1.85 లక్షలు మాయమైనట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన కృష్టంరాజు పోలీసులను ఆశ్రయించారు. మార్చి 28న కరెంట్ బిల్లు కట్టలేదన్న నెపంతో సైబర్ నేరగాళ్లు ఈ డబ్బు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లు ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచించారు.
ఆ లింక్ లపై క్లిక్ చేయొద్దు
‘డియర్ కన్స్యూమర్, మీరు గత నెల బిల్లు చెల్లించలేనందున ఈ రాత్రికి మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి’ అంటూ వస్తున్న వాట్సాప్, ఫోన్ మెసేజీలపై అప్రమత్తంగా ఉంటాలని విద్యుత్ ఆధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లించలేదని సైబర్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సైబర్ మోసగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి ఇలాంటి మెసేజ్ పంపుతారన్నారు. వినియోగదారులు ఇలాంటి మెసేజ్, లింక్‌పై క్లిక్ చేయొద్దని అధికారులు సూచించారు. పొరపాటున సైబర్ నేరగాళ్లు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ అవుతున్నాయన్నారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్ అధికారులకు, సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.