Healthy heart exercise: గుండె ఆరోగ్యానికి ఏ వ్యాయామాలు, ఎంతసేపు చేయాలి?
08 June 2023, 17:50 IST
Healthy heart exercise: గుండె ఆరోగ్యం కోసం ఎటువంటి వ్యాయామాలు చేయాలో, ఎలాంటి శారీరక శ్రమ అవసరమో నిపుణులు ఇచ్చిన సూచనలు తెలుసుకోండి.
గుండె ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలు
గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేసేది హృదయమే. క్రమం తప్పకుండా కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఎంత వరకూ ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిదో అనే సందేహం మనలో ఉంటుంది.
వ్యాయామం చేయడం వల్ల లాభాలు:
కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. బీపీ, కొలెస్ట్రాల్, బరువు తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చాలా మంది బరువు తగ్గడానికి కార్డియో వ్యాయామాలు చేస్తారు. కానీ వాటితో పాటే బరువులు ఎత్తడం, కేలరీలు కరిగించడం ముఖ్యమే. వాటివల్ల కండరాలు బలపడటమే కాదు, కొవ్వు కూడా తొందరగా కరుగుతుంది. వారానికి రెండు సార్లు బరువులెత్తే వ్యాయామాలు కనీసం ఒక గంట సేపు చేయడం ఉత్తమం.
ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
- ఏరోబిక్ ఎక్సర్‌సైజ్: వారానికి కనీసం 150 నిమిషాలు మామూలు స్థాయి ఏరోబిక్ వ్యాయామాలు, 75 నిమిషాల హై ఇంటెన్సిటీ ఏరోబిక్ వ్యాయామాలు చేయొచ్చు. వేగంగా నడవటం, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, రన్నింగ్ లేదా బాస్కెట్ బాల్, సాకర్ లాంటి ఆటలు ఆడొచ్చు.
- స్ట్రెంత్ ట్రైనింగ్: వారానికి కనీసం రెండ్రోజులు కండరాల గురించి వ్యాయామం చేయాలి. కాళ్లు, భుజాలు, వెన్ను కండరాల బలం కోసం ఇవి ఉపయోగపడతాయి. బరువులెత్తడం, రెసిస్టెంట్ బ్యాండ్ వర్కవుట్స్, యోగా ఇవన్నీ దీని కిందకే వస్తాయి.
- ఫ్లెక్సిబిలిటీ: శరీరం సాగేగుణాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. స్ట్రెచ్చింగ్, యోగా ఉత్తమమైనవి. వీటివల్ల శరీరం సాగేగుణం పెరగడంతో పాటూ, బ్యాలెన్సింగ్ మెరుగవుతుంది.
- ఎక్సర్‌సైజ్: వయసు, గుండె ఆరోగ్యం, ఫిట్ నెస్ బట్టి వివిధ రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మీకేమన్నా ఇబ్బందులుంటే ముందుగా వైద్యుల్ని సంప్రదించాలి.
- భద్రత: ఏదైనా వెంటనే ఎక్కువ స్థాయిలో మొదలుపెడితే ప్రమాదమే. అందుకే మెల్లమెల్లగా వ్యాయామం చేసే సమయం, కఠినత్వం పెంచుతూ వెళ్లాలి. దానివల్ల మన శరీరం తొందరగా అలవాటు పడుతుంది. అలాగే అవసరమైనన్ని నీళ్లు తాగడం, శరీరాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
- మోటివేషన్: అనుకున్న పనిని క్రమం తప్పకుండా చేయాలంటే మోటివేషన్ అవసరం. అందుకే ఏదో తప్పనిసరి అనుకోకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా వ్యాయామం చేయండి.
- చేరుకోదగ్గ లక్ష్యాలు: మీరు సాధించదగ్గ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. వాటివల్ల మీకింకా కొనసాగించాలనే ఉత్సాహం వస్తుంది.
- నచ్చినవి: మీకు బాగా నచ్చుతున్న, మీరు ఎంజాయ్ చేస్తున్న వ్యాయామాలేంటో చూడండి. వాటన్నింటినీ కలిపి ఒక రొటీన్ తయారుచేసుకోండి. అలవోకగా వ్యాయామం చేసేస్తారు.
టాపిక్