Chicken Oats Upma। చికెన్ ఓట్స్ ఉప్మాతో బ్రేక్‌ఫాస్ట్.. అదుర్స్ అనిపించే టేస్ట్!
11 December 2022, 7:30 IST
- ఆదివారం లేదా హాలిడే ఉన్నప్పుడు ఏదైనా ప్రత్యేకంగా తినాలి అనుకుంటే Chicken Oats Upma ట్రై చేయండి, రెసిపీ ఇక్కడ ఉంది. ఇలాంటి రెసిపీ ఇంకా ఎక్కడ ఉండకపోవచ్చు.
Chicken Oats Upma
సాధారణ రోజుల్లో ఉదయం వేళ మనం చేసే అల్పాహారం సాధారణంగానే ఉంటుంది. మరి వీకెండ్‌లో కూడా అదే సాధారణమైన అల్పాహారం ఎందుకు చేయాలి? మటన్ ఖీమాతో పరాఠా చేసుకోవచ్చు, హైదరాబాదీ స్టైల్లో ముర్గ్ ముసల్లంతో రోటీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి మీకు హెవీగా అనిపిస్తే తేలికగా ఉప్మా చేసుకోవచ్చు. ఉప్మా అంటే మీరు ఎప్పుడూ తినే ఉప్మా కాదు, చికెన్ ఉప్మా.
ఓట్‌మీల్, చికెన్ ముక్కలు కలిపి అద్భుతంగా చికెన్ ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు. చికెన్‌లో ప్రోటీన్స్ ఉంటాయి, ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కలయికతో మీకు మంచి పోషకవిలులవలతో కూడిన అల్పాహారం సిద్ధం అవుతుంది. మీరు మధ్యాహ్నం వరకు శక్తివంతంగా ఉంటారు. డయాబెటీస్ ఉన్నవారికి అయితే ఇదొక అద్భుతమైన అల్పాహారం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరెందుకు ఆలస్యం? చికెన్ ఓట్స్ ఉప్మా రెసిపీ ఇక్కడ ఉంది, ఇది చూసి మీరు ట్రై చేయండి.
Chicken Oats Upma Recipe కోసం కావలసినవి
- 350 గ్రాముల బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్‌లు
- 1 కప్పు ఓట్స్
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1 స్పూన్ జీలకర్ర
- 3 బిరియాని ఆకులు
- 1 టేబుల్ స్పూన్ అల్లం
- 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
- 2 పచ్చిమిర్చి
- 1/2 టీ స్పూన్ పసుపు పొడి
- 1 స్పూన్ కారం
- 1 స్పూన్ మిరియాల పొడి
- రుచికి తగినంత ఉప్పు
- 6-8 తాజా కొత్తిమీర
- 1 టేబుల్ స్పూన్ వెన్న
- 1 నిమ్మకాయ
చికెన్ ఓట్స్ ఉప్మా రెసిపీ - తయారీ విధానం
1.ముందుగా చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
2. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్‌లో నూనె వేడి చేసి, అందులో జీలకర్ర, బిరియానీ ఆకులు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
3. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, చికెన్ ముక్కలను వేసి బాగా కలపుతూ వేయించాలి.
4. అనంతరం ఓట్స్, పసుపు పొడి, కారం పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
5. అన్నీ బాగా వేగిన తర్వాత 2 కప్పుల నీరు వేసి బాగా కలపాలి. చికెన్ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించాలి.
6. ఇప్పుడు మరొక పాన్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగులో వేయించాలి, ఆపైన వెన్న, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఇందులో గుడ్డులోని తెల్లసొన కూడా వేసుకోవచ్చు.
7. ఇప్పుడు ఈ వేయించిన ఉల్లిపాయల మిశ్రమాన్ని ఉడికిన చికెన్ ఓట్స్‌తో కలపాలి.
అంతే, చికెన్ ఓట్స్ ఉప్మా రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇది చూడటానికి హలీంలా ఉంటుంది, కానీ టేస్ట్ డిఫెరెంట్ గా ఉంటుంది.