Egg Chat Recipe । ఉడికించిన గుడ్లతో చాట్.. చేసుకోండిలా ఫటాఫట్!
14 September 2022, 17:59 IST
- పానీపూరీ సెంటర్ల వద్ద మీరు ఆలూ చాట్ తినే ఉంటారు. అంతకంటే గొప్పగా, ఉడకబెట్టిన గుడ్లతో ఎగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ రెసిపీ (Egg Chat Recipe) ఉంది చూడండి.
Egg Chat Recipe -ఎగ్ చాట్
చాలా మందికి చిరుతిళ్లు తినటం అనే మహా ఇష్టం. రోడ్ సైడ్ లభించేవి ఎంత అనారోగ్యం అని తెలిసినా, వాటి రుచికి లొంగిపోతారు. ఇక పానీపూరీ గురించి చెప్పనక్కరలేదు. ముఖ్యంగా అమ్మాయిలేతే పానీ పూరీ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. పానీపూరీతో పాటు మసాలా చాట్, ఆలూ చాట్, కట్ లెట్ వంటివి కడుపులో వేసేస్తే ఆ పూటకి సెట్ అయినట్లే. ఇక, రాత్రి ఎప్పుడవుతుందా? ఏం తిందామా అనే ఆలోచనలు వస్తాయి.
అయితే రోడ్ సైడ్ పానీపూరీ సెంటర్లలో ఎక్కువగా వెజిటెబుల్ చాట్ లభిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా 'బాయిల్డ్ ఎగ్ చాట్' రుచి చూశారా?
ఉడకబెట్టిన గుడ్లను, చిన్నగా కత్తిరించి చాట్ మసాలా వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే, అది మాటల్లో చెప్పలేనిది. అంతేకాదు ఈ ఎగ్ చాట్ చాలా సులభంగా, త్వరితంగా చేసేసుకోవచ్చు.
ఇప్పుడు మీకు ఎగ్ చాట్ తినాలని నోరూరుతుంది కదూ? అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి? ఏమేం పదార్థాలవుతాయో తెలుపుతూ ఎగ్ చాట్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. చిటికెలో చేసుకోండి, చటుక్కున తినేయండి మరి.
Egg Chat Recipe కోసం కావలసినవి
3 ఉడికించిన గుడ్లు
1 టేబుల్ స్పూన్ టమోటా కెచప్
1 tsp టమోటా చిల్లీ సాస్
3 tsp చింతపండు రసం
1 స్పూన్ నిమ్మరసం
1 tsp కాల్చిన జీలకర్ర
1 పచ్చి మిర్చి
1 tsp స్ప్రింగ్ ఆనియన్
2-3 టేబుల్ స్పూన్లు కారా బూందీ
రుచికి ఉప్పు
ఎగ్ చాట్ రెసిపీ- తయారీ విధానం
ఎగ్ చాట్ రెసిపీ- తయారీ విధానం
1.ఒక గిన్నెలో టొమాటో కెచప్, చిల్లీ సాస్, చింతపండు రసం, నిమ్మరసం, వేయించిన జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ చట్నీ లాగా కలపుకోవాలి.
2. ఇప్పుడు ఒక ప్లేట్‌లో ఉడికించిన గుడ్లను ముక్కలుగా కట్ చేసి, వాటిపై ఇదివరకు చేసుకున్న చట్నీని చల్లండి.
3. ఆపైన తరిగిన స్ప్రింగ్ ఆనియన్, గరం మసాలా , కారా బూందీని చల్లుకోండి.
4. అంతే రుచికరమైన ఎగ్ చాట్ సిద్ధమైనట్లే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకొని దీని రుచిని ఆస్వాదించండి.
ఆపై ఒక మసాలా చాయ్ తాగండి. మజా చేసుకోండి.