Vinayaka Chavithi Prasadam: పావుగంటలో సిద్ధమైపోయే వినాయక నైవేద్యాలు ఇవిగో, పూజలో కచ్చితంగా ఉండాల్సిన ప్రసాదాలు కూడా
06 September 2024, 11:33 IST
- Vinayaka Chavithi Prasadam: వినాయక చవితికి ఆ బొజ్జ గణేశుడికి ఏ నైవేద్యాలు పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? త్వరగా వండగలిగే కొన్ని ప్రసాదాలు ఒక్కడ ఇచ్చాము. ఇవి కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలు కూడా.
వినాయక నైవేద్యాలు
Vinayaka Chavithi Prasadam: వినాయకచవితి అనేక రకాల ప్రసాదాలు చేసి నివేదించాలని ఎంతో మందికి ఉంటుంది. కానీ కొందరికి సరిగా వండడం రాదు, మరికొందరికి ఎక్కువ సమయం తీసుకుని వండే అవకాశం ఉండదు. అలాంటి వారి కోసమే ఇక్కడ మేము సింపుల్ గా వండే నైవేద్యాల రెసిపీలు ఇచ్చాము. ఇవన్నీ గణేషుడి పూజలో కచ్చితంగా ఉండాల్సినవి కూడా. కేవలం పావుగంటలో సిద్దమైపోయే ప్రసాదాలు ఇవిగో.
బెల్లం చలిమిడి
బెల్లం చలిమిడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బెల్లం తురుము - అర కప్పు
జీడి పప్పులు - గుప్పెడు
పచ్చి కొబ్బరి ముక్కలు - గుప్పెడు
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - మూడు స్పూన్లు
బియ్యం ప్పిండి - ఒక కప్పు
బెల్లం చలిమిడి రెసిపీ
1. చలిమిడి అప్పటికప్పుడు చాలా సులువుగా చేసేయచ్చు.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
3. ఆ నెయ్యిలో పచ్చి కొబ్బరిముక్కలు, జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో బెల్లం తురుము వేసి నీళ్లు వేయాలి.
5. బెల్లం తీగ పాకం తీయాలి. అందులో కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, జీడిపప్పును వేసి కలుపుకోవాలి.
6. అలాగే జల్లించిన బియ్యాంప్పిండిని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
7. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా గట్టిగా అయ్యేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
8. అంతే చలిమిడి రెడీ అయినట్టే. దీన్ని వినాయకుడిని నివేదిస్తే కోరిక కోరికలు తీరుతాయి.
..........…......................………………………………………..
వడపప్పు
వడపప్పు చేయడం చాలా సులువు. వినాయకచవితి పూజలో కచ్చితంగా ఈ నైవేద్యం ఉండాల్సిందే. వడపప్పు తయారీకి పెసరపప్పును ముందుగా నానెబెట్టుకోవాలి. గంట పాటూ నానబెడితే చాలు. ఆ నీటిని వడకట్టి ఒక గిన్నెలో వేయాలి. అందులో బెల్లం తురుము, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. అంతే వడపప్పు రెడీ అయినట్టే.
...............................…………………………………………….
నెయ్యి అప్పాలు
నెయ్యి అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - అర కప్పు
ఉప్మా రవ్వ - అర కప్పు
బెల్లం తురుము - ఒక కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
బియ్యం పిండి - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - మూడు స్పూన్లు
నీరు- తగినన్ని
బేకింగ్ సోడా - చిటికెడు
నెయ్యి అప్పాలు రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమ పిండి, బెల్లం తురుము, బియ్యం పిండి వేసి బాగా కలపాలి.
2. ఉప్పు, బేకింగ్ సోడా, ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి.
3. తగినంత నీరు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
4. కాస్త మందంగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటూ పక్కన పెట్టాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల పాన్ పెట్టాలి.
6. అందులో నెయ్యి వేయాలి.
7. గుంత పొంగనాల పాన్ లో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పొంగనాల్లా వేసుకోవాలి.
8. రెండు వైపులా కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
9. అంతే నెయ్యి అప్పాలు రెడీ అయిపోయినట్టే. వీటిని ప్రసాదం వాడుకోవచ్చు.