Sri Rama Navami 2024: శ్రీరామనవమికి చేసే పానకం, చలిమిడి, వడపప్పు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో, వేసవిలోవీటిని తినాల్సిందే
Sri Rama Navami 2024: శ్రీరామనవమికి కచ్చితంగా చేయాల్సిన నైవేద్యాలలో పానకం, చలిమిడి, వడపప్పు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవితాపాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాయి.
Sri Rama Navami 2024: శ్రీరామనవమికి ఎన్ని వంటలు వండినా కూడా ఆ శ్రీరాముడికి తీయని పానకం, వడపప్పు, చలిమిడి సమర్పించనిదే పూజ పూర్తి కాదు. మన తెలుగు పండుగలకు చెందిన నైవేద్యాలు ఆయా కాలాలను బట్టి నిర్ణయించినట్టు అనిపిస్తుంది. శ్రీరామనవమి ఎండా కాలంలో వస్తుంది. అందుకే వేసవి తాపాన్ని తీర్చేలా శ్రీరామ నవమికి వడ్డించే నైవేద్యాలు ఉంటాయి. వేసవిలో పానకం, పెసరపప్పుతో చేసే వడపప్పు, బియ్యం పిండితో చేసే చలిమిడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వడపప్పు, చలిమిడి
వడపప్పును పెసరపప్పును నానబెట్టి చేస్తారు. ఈ వడపప్పులో చిన్న బెల్లం ముక్క పెట్టి దేవునికి నివేదిస్తారు. తర్వాత ఆ ప్రసాదాన్ని తినేస్తారు. ఇలా పెసరపప్పు, బెల్లం తినడం చాలా ఆరోగ్యకరం. పెసరపప్పు ఆ శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. పెసరపప్పులో శీతలీకరణ లక్షణాలు ఎక్కువ. కాబట్టి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది సహకరిస్తుంది. మధుమేహం ఉన్నవారికి పెసరపప్పు ఎంతో మంచిది. వేసవిలో పెసరపప్పు తినడం చాలా అవసరం. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
ఇక చలిమిడిని వరిపిండి, బెల్లం కలిపి చేస్తారు. కొంతమంది పంచదారను కూడా వినియోగిస్తారు. నిజానికి బెల్లం, వరిపిండి కలిపి చేస్తేనే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. బియ్యంతో చేసే వరిపిండి తినడం చాలా అవసరం. అది శక్తిని అందిస్తుంది. ఇక బెల్లం రక్తహీనత సమస్యను దూరం పెడుతుంది. పంచదారతో చలిమిడి నేను చేయకపోవడమే మంచిది. పంచదార అధికంగా శుద్ధి చేసిన ఉత్పత్తి కిందకి వస్తుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల అనారోగ్యమే తప్ప ఇలాంటి ఆరోగ్య లాభాలు కలగవు.
పానకంతో చలువ
ఇక శ్రీరామనవమికి ఉండే పానకం గురించి ఎంత చెప్పినా తక్కువే. వేసవిలో తాగాల్సిన ద్రవపదార్థాలలో కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు ఎంత ముఖ్యమో పానకం అంతే ముఖ్యం. పానకం తాగితే శరీరానికి శీతలీకరణ లక్షణాలు అందుతాయి. దీనివల్ల వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. డిహైడ్రేషన్ సమస్య కూడా రాదు. గొంతు, పొట్టలోని ఇన్ఫెక్షన్ కాపాడే శక్తి పానకానికి ఉంది. పానకంలో మనం మిరియాల పొడి, యాలకుల పొడి అధికంగా వేస్తాము. అలాగే బెల్లాన్ని వినియోగిస్తాము. ఇవన్నీ కూడా మన శరీరానికి మేలు చేసేవే. బెల్లం రక్తహీనత నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగా పానకాన్ని తాగాల్సిందే. పానకంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి పానకం తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతాయి.
టాపిక్