Nuvvula Podi: ఆంధ్రాస్టైల్‌లో నువ్వుల పొడి ఇలా చేశారంటే వేడి వేడి అన్నంలో, నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందే
Nuvvula Podi: ఆంధ్ర స్టైల్‌లో నువ్వుల పొడి చేసుకుని తినండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా రుచిగా కూడా ఉంటుంది. రోజుకు రెండు ముద్దలు తింటే మహిళలకు ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
Nuvvula Podi: నువ్వుల పొడి ఒకప్పుడు కచ్చితంగా ప్రతిరోజూ తినాల్సిన ఆహారంలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వుల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. నువ్వులను వేయించి పొడిచేసి ఒకసారి దాచుకుంటే... వాటిని కొన్ని నెలల పాటు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నువ్వులు కూడా ఒకటి. రోజువారీ భోజనంలో రెండు ముద్దలు నువ్వుల పొడి వేసుకొని కలుపుకొని తినండి. మీకున్న నెలసరి సమస్యలు తొలగిపోతాయి. ఇక్కడ మేము ఆంధ్ర స్టైల్‌లో నువ్వుల పొడి ఎలా చేయాలో ఇచ్చాము. దీన్ని చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల పాటు తాజాగా ఘుమఘుమలాడిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
నువ్వుల పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - ఒక కప్పు
ఎండుమిర్చి - ఎనిమిది
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బుల - గుప్పెడు
నువ్వుల పొడి రెసిపీ
1. నువ్వుల పొడి చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. వీటిని చాలా సులువుగా చేసేయొచ్చు.
2. నువ్వుల పొడికి కేవలం మూడు రకాల పదార్థాలు ఉంటే చాలు, ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు వేసి వేయించండి.
3. ఆ నువ్వులను ఒక ప్లేట్లో వేసి చల్లబరచండి.
4. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చిని, ధనియాలను, జీలకర్రను వేసి వేయించండి. తర్వాత స్టవ్ కట్టేయండి.
5. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులను, వేయించుకున్న ఎండుమిర్చిని, జీలకర్రను, ధనియాలను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
6. అందులో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పొడి చేస్తే మంచి రుచి వస్తుంది.
7. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి.
8. గాలి చొరబడని సీసాలో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి మూత పెట్టేయాలి.
9. గాలికి వదిలేస్తే ఇది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.
10. అలాగే సువాసన బయటికి పోతుంది. వేడి అన్నం పై ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను నువ్వుల పొడి వేసుకొని తిని చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.
నువ్వులు ఉపయోగాలు
నువ్వులు ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజూ రెండు ముద్దలు నువ్వులు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటివి పేరుకుపోకుండా ఉంటాయి. ఆర్ధరైటిస్ వంటి సమస్యలకు రాకుండా ఉంటాయి. థైరాయిడ్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన నువ్వుల్లో ఇవీ ఒకటి. అధిక రక్తపటు ఉన్న వారికి నువ్వులు మంచి ఔషధమనే చెప్పాలి. నెలసరి సమయంలో పొట్ట నొప్పి, పొట్ట తిమ్మిరి వంటి సమస్యలను తగ్గించే శక్తి నువ్వులకు ఉంది.