తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indoor Plant Garden Ideas | ఇంటి లోపల ఇలాంటి మొక్కలు నాటితే.. మీ ఇల్లే ఒక బృందావనం!

Indoor Plant Garden Ideas | ఇంటి లోపల ఇలాంటి మొక్కలు నాటితే.. మీ ఇల్లే ఒక బృందావనం!

HT Telugu Desk HT Telugu

26 December 2022, 17:26 IST

    • Indoor Plant Garden: ఇంట్లో మొక్కలు ఉంటే ఆహ్లాదం, ఆనందం. కృత్రిమ వస్తువులకు బదులుగా జీవం ఉన్న మొక్కలతో మీ ఇంటి గదులను అలంకరించండి. మీ ఇంటికే జీవకళ వస్తుంది.
Indoor plant garden
Indoor plant garden (Unsplash)

Indoor plant garden

నేడు చాలామంది ఎత్తైన భవంతులలో నివసిస్తున్నారు. అంతస్తుల మీద మరిన్ని అంతస్తులను నిర్మించుకొంటున్నారు. అద్దెలు వస్తే చాలు అనుకొని నిర్మాణాలు చేపడుతున్నారు గానీ, వారి ఆరోగ్యం కోసం ఇంటి చుట్టూ మొక్కలు పెంచడానికి కొంచెం స్థలం కూడా ఉంచుకోవడం లేదు. మొక్కలు ఉన్న ఇళ్లు పచ్చదనంతో ప్రశాంతంగా ఉంటాయి, ఆ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అవి స్వచ్ఛమైన గాలిని, చల్లటి నీడని ఇవ్వటమే కాకుండా సానుకూల శక్తిని నింపుతాయి. ఏ ప్రదేశాన్నైనా ప్రకాశంగా మార్చే శక్తి మొక్కలకు ఉంది.

మీ ఇంటి చుట్టూ మొక్కలు నాటడానికి సరిపడా స్థలం లేనపుడు, కొద్దిపాటి స్థలంలో కూడా మొక్కలను నాటవచ్చు. మీ ఇంటి లోపల కూడా మొక్కలను నాటుకోవచ్చు. ఇండోర్ మొక్కలు మీ ఇంటిని అలంకరించడానికి అద్భుతమైన మార్గం. ఇవి గది సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు, మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇంకా మీలోపల సృజనాత్మకతను పెంచుతాయని, ఒత్తిడి స్థాయిలను తగ్గించగలవని, వాయు కాలుష్యాలను తొలగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండోర్ మొక్కలతో మీరు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు.

Indoor Plant Garden Ideas- ఇండోర్ మొక్కలు పెంచేందుకు ఉపాయాలు

ఈ వింటర్‌లో ఇండోర్ ప్లాంట్‌లను నాటడానికి, మీ ఇంటిలోపల పచ్చదనాన్ని జోడించటానికి ఇక్కడ మీకు ఉపయోగపడే కొన్ని మొక్కలు, చిట్కాలను తెలియజేస్తున్నాం.

లిల్లీ పూల మొక్కలు

లిల్లీ పూల మొక్కలు ఇంట్లో నాటుకోవడానికి ఎంతో అనువైనవి. ఇవి ఇంట్లో మంచి సువాసను వెదజల్లడంతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని చూస్తేనే మనసుకి ఒక రకమైన హాయి కలుగుతుంది. మీ ఆత్మకు పునర్జన్మను కలిగిస్తుంది. ఈ మొక్క గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ప్రసిద్ధి చెందింది. ఈ మొక్క పెరగడానికి మధ్యస్థం నుండి తక్కువ కాంతి అవసరం, పరోక్ష సూర్యకాంతిలో కూడా చక్కగా పెరుగుతుంది.

అరేకా పామ్స్

అరేకా పామ్ మొక్కలను ఇంటి లోపల మూలల్లో ఉంచవచ్చు, వీటితో పాటు స్నేక్ ప్లాంట్ కూడా చాలా ఇండోర్‌లలో సాధారణంగా కనిపించే మొక్క. ఇవి ఆకర్షణీయమైన పొడవాటి ఆకులతో ఉంటాయి, మైక్రో టోన్డ్ సిరామిక్ పాట్‌లలో పరిపూర్ణంగా కనిపిస్తాయి. ఈ మొక్కల కుండీలు ఎక్కడ పెట్టినా ఆ ప్రదేశానికే మొత్తం అందం వస్తుంది.

సక్యూలెంట్ ప్లాంట్

సక్యూలెంట్లను కిటికీల పక్కన, గుమ్మము వద్ద ఉంచవచ్చు. కాక్టస్, సక్యూలెంట్లను కూడా సెంటర్ పీస్‌లుగా తయారు చేయవచ్చు. ఇవి తక్షణమే ఒక ప్రాంతాన్ని ఉత్తేజపరచడమే కాకుండా, మానసిక స్థితిని పెంచుతాయి. శక్తివంతమైన, అందమైన ప్రకృతిని మీ ఇంటి లోపలికే తీసుకువస్తాయి.

అలోవెరా

తక్కువ నిర్వహణలో ఉండే ఇండోర్ ఉష్ణమండల మొక్కలలో కలబంద కూడా ఒకటి. కలబందకు వెచ్చని మితమైన ఉష్ణోగ్రత, పరోక్ష సూర్యకాంతి అవసరం. మీరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు నీరు పెట్టవచ్చు. అందువల్ల, శీతాకాలంలో ఇంట్లో ఉంచడానికి ఇది గొప్ప మొక్క. మీరు చర్మం సంరక్షణ, జుట్టు కోసం అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. ఈ మొక్క మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

కాక్టస్ ప్లాంట్

ఈ రోజుల్లో ఇంటి లోపల సెంటర్ టేబుల్‌పై కాక్టస్‌లను ఉంచడం ఒక ట్రెండ్. కాక్టస్‌ల నిర్వహణకు ఎటువంటి శ్రమ అవసరం లేదు. అలాగే స్పైడర్ మొక్కలు కూడా చాలా రకాలను కలిగి ఉంటాయి, మీరు వాటిని ఒక జంటను కలిపి ఉంచవచ్చు. అవి ఖచ్చితంగా గాలిని క్లియర్ చేస్తాయి, ఆ ప్రదేశానికి అందాన్ని తెస్తాయి.

ఈ మొక్కలతో పాటుగా ఒక చిన్న ఫౌంటెన్‌ని కూడా తయారు చేసి ఉంచవచ్చు. దాని చుట్టూ వెదురు, స్పైడర్ ప్లాంట్ వంటి కొన్ని మొక్కలను పెట్టడం ద్వారా మీ ఇంటి లోపల గదులు, బాల్కనీని ఆహ్లాదకరంగా మార్చవచ్చు.