Aloe Vera Facial । ముఖం మెరిసేలా.. కలబంద జెల్‌తో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండిలా!-here is how you can do aloe vera facial at home in simple steps telugu story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloe Vera Facial । ముఖం మెరిసేలా.. కలబంద జెల్‌తో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండిలా!

Aloe Vera Facial । ముఖం మెరిసేలా.. కలబంద జెల్‌తో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 09:35 AM IST

కలబందతో సులభంగా ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంట్లోనే అలోవెరా ఫేషియల్ చేసుకునేందుకు ఈ దశలు అనుసరించండి.

Aloe Vera Facial at Home
Aloe Vera Facial at Home (Freepik)

చాలామంది తమ ముఖం తెల్లగా, తళతళ మెరవాలని ఖరీదైన సబ్బులు, ఫేస్‌వాష్‌లు, క్రీములు ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, వాటి తయారీదారులు కూడా తమ ఉత్పత్తులో సహజమైన పదార్థాలను ఉపయోగించినట్లు పెద్దగా ప్రకటనలు ఇచ్చుకుంటారు. మరి అలాంటపుడు నేరుగా సహజసిద్ధంగా లభించేవి ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది కదా. అంతేకాకుండా ఇది ఖర్చులేని పని.

మచ్చలేని మెరిసే చర్మం పొందడం కోసం కలబంద ఉపయోగించవచ్చు. అలోవెరాలో అలోయిన్ అనే సహజ వర్ణద్రవ్యం సమ్మేళనం ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది అలాగే, నాన్‌టాక్సిక్ హైపర్‌పిగ్మెంటేషన్ చికిత్సకు కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిద్రించే ముందు స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ను ముఖానికి అప్లై చేసుకొని, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నలుపుదనం తగ్గుతుంది.

ముఖానికి కలబందను ఉపయోగించడం వల్ల చర్మాన్ని తేమగా మార్చుకోవచ్చు. క్రమం తప్పకుండా కొద్దిగా కలబంద జెల్‌ను ముఖానికి పూయడం వల్ల మొటిమలు, తామర, సన్ బర్న్ మొదలైన చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు.

Aloe Vera Facial at Home - Steps

ఇంట్లోనే కలబంద ఫేషియల్ చేసుకుంటే మీ ముఖఛాయ మెరుగుపడుతుంది. ఇంకా వేరే ఏ ఉత్పత్తి ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలోవేరా ఫేషియల్ ఎలా చేసుకోవాలో దశల వారీగా ఇక్కడ పేర్కొన్నాం, చూడండి.

1) క్లెన్సింగ్

ఫేషియల్ ఎల్లప్పుడూ క్లెన్సింగ్‌తో మొదలవుతుంది. కలబంద జెల్ సహజమైన క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ముఖంపైన మురికిని, జిడ్డును శుభ్రం చేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో అలోవెరా జెల్‌ను తీసి, దానిలో చిటికెడు పసుపు వేయండి. రెండింటినీ బాగా మిక్స్ చేసి, ఆపై మీ ముఖం, మెడపై అప్లై చేయండి. ఒక నిమిషం పాటు వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. ఆపై తడి టిష్యూ పేపర్ తో ముఖాన్ని శుభ్రం చేయండి.

2) స్క్రబ్బింగ్

ముఖం శుభ్రంగా ఉన్నప్పుడు, స్క్రబ్బింగ్ చేయాలి. దీని కోసం కాఫీ, తేనె, కలబందను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ చేతికి కొద్దిగా తీసుకుని, చేతులతో ముఖానికి తేలికపాటి మసాజ్ చేయండి. ఈ స్క్రబ్ ముఖంలోని డెడ్ స్కిన్‌ని పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఈ ఫేషియల్ రెండవ దశలోనే మీరు ముఖంలో మెరుపును చూడటం ప్రారంభిస్తారు.

3) మసాజ్

స్క్రబ్బింగ్ ద్వారా ముఖానికి కొంత మంట, దురద కలగవచ్చు. కాబట్టి చర్మానికి ఓదార్పు ప్రభావాన్ని ఇవ్వడానికి మసాజ్ అవసరం. ఇందుకోసం అలోవెరా జెల్‌లో పెరుగుతో బొప్పాయి గుజ్జును మిక్స్ చేసి మసాజ్ క్రీమ్ లాగా తయారు చేయండి. దీన్ని ముఖానికి బాగా పట్టించి చేతులతో తేలికపాటి మసాజ్ చేయండి. ముక్కు చుట్టూ, కళ్ళు, నుదురు, చెంపల దగ్గర మీ వేళ్లతో రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక టిష్యూను ముంచి, దానితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

4) ఆవిరి

రంధ్రాలను తెరవడానికి ఆవిరి అవసరం. దీని కోసం, మీరు స్టీమర్‌ను వేడి చేసి, అందులో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌ను కలపండి. 3 నుండి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టుకోండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

5) ఫేస్ ప్యాక్

చర్మాన్ని బిగుతుగా మార్చేందుకు ఫేస్ ప్యాక్ చాలా ముఖ్యం. దీని కోసం అలోవెరా జెల్, గంధపు పొడి, తేనె, ఫేస్ క్రీమ్ బాగా కలపాలి. తర్వాత ముఖంపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి, ఆపై ముఖాన్ని శుభ్రం చేసి మాయిశ్చరైజర్ లేదా సీరమ్ అప్లై చేయండి.

ఇలా కలబందతో ఫేషియల్ చేసుకొని మీరు వెంటనే పార్టీకి సిద్ధమైపోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్