Bitter Gourd Benefits : తినడానికి చేదు.. కానీ తింటే శరీరానికి ఎంతో మంచి
03 February 2023, 15:01 IST
- Bitter Gourd Benefits : కాకరకాయ అని చెప్పగానే.. వామ్మో.. ఆ కర్రీ వద్దులేనని చెప్పేస్తారు చాలామంది. అంత చేదు తినడం మనతో కాదులేనని అంటుంటారు. కానీ కాకరకాయ తింటే.. వచ్చే చేదు కంటే.. దాని నుంచి శరీరానికి జరిగే మంచే ఎక్కువగా ఉంటుంది.
కాకరకాయ ఉపయోగాలు
తినే ఆహారంలో చేదు అంటే.. చాలామంది ఇక అక్కడ నుంచి తప్పుకుంటారు. తర్వాత తింటానులేనని వెళ్లిపోతారు. కాకరకాయలాంటి కర్రీని తినేందుకు విసుక్కుంటారు. కానీ ఈ చేదు.. ఆరోగ్యానికి ఎంతో మంచి అనే విషయాన్ని మాత్రం మరిచిపోతారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలలో ఒక ప్రసిద్ధ కూరగాయ కాకరకాయ. చేదు రుచి ఉన్నప్పటికీ వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వాడుతుంటారు కొంతమంది.
కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచిది. అదనంగా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది.
అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం కారణంగా.. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. ఫైబర్ క్రమం తప్పకుండా పేగు కదలికలను ప్రోత్సహించడం, మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాకరకాయ జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని తేలింది. ఇది మొత్తం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి, మొత్తం రోగనిరోధక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. పొటాషియం, ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తికి ఉపయోగపడతాయి.
ఈ కూరగాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. ఈ ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కాకరకాయ తక్కువ కేలరీల ఆహారం, ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే చేదు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయని తేలింది. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.