Hariyali khichdi: షుగర్‌ను కంట్రోల్ చేసే హరియాలి కిచిడి, దీని రెసిపీ చాలా సులువు ప్రతిరోజూ తింటే ఆరోగ్యమే
02 December 2024, 11:36 IST
- Hariyali khichdi: హరియాలి కిచిడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
హరియాలీ కిచ్డీ రెసిపీ
డయాబెటిస్ రోగుల కోసం ప్రత్యేకమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో హరియాలీ కిచిడి ఒకటి. ఇది తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. హరియాలి కిచిడిని ప్రతిరోజూ తిన్నా కూడా డయాబెటిస్ పూర్తిగా అదుపులో ఉండడం ఖాయం. ఈ హరియాలీ కిచిడి చేయడం చాలా సులువు. దీనిలో పోషకాలు నిండుగా ఉంటాయి. విటమిన్ బి1, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఫైబర్ వంటి ఖనిజాలు ఉంటాయి. కేవలం 20 నిమిషాల్లో ఈ కిచిడిని వండేయొచ్చు. హరియాలీ కిచిడి ఎలా చేయాలో తెలుసుకోండి.
హరియాలి కిచిడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మోత్ బీన్స్ - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
లవంగాలు - ఎనిమిది
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ఇంగువ - చిటికెడు
మిరియాల పొడి - అర స్పూను
పుదీనా తరుగు - అరకప్పు
పాలకూర - ఒక కప్పు
బ్రౌన్ రైస్ - ఒక కప్పు
నీరు - తగినంత
నెయ్యి - నాలుగు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి
హరియాలి కిచిడీ రెసిపీ
1. మోత్ బీన్స్... దీన్నే మట్కా పప్పు లేదా మట్కీ పప్పు అని కూడా పిలుస్తారు.
2. ఇవి చాలా చోట్ల మార్కెట్లో లభిస్తాయి. అమెజాన్ వంటి సైట్లలో కూడా ఉంటాయి.
3. ఇవి డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి.
4. ఒక గిన్నెలో ఈ మట్కా పప్పును శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టండి.
5. బ్రౌన్ రైస్ ను వండే ముందు అరగంట పాటు నానబెట్టండి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
7. ఆ నెయ్యిలో జీలకర్ర, అల్లం తరుగు, లవంగాలు వేసి వేయించండి.
8. ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలుపుకోండి.
9. ఇప్పుడు అందులో గరం మసాలా, ఇంగువ కూడా వేసి కలపాలి.
10. పచ్చి మిర్చి తరుగు, పుదీనా తరుగును వేసి బాగా కలుపుకోవాలి.
11. ఇందులో నానబెట్టుకున్న మట్కా పప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి కలపండి.
12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. ఇప్పుడు ఈ మిశ్రమం ఉడికేందుకు సరిపడా నీటిని వేసి పైన మూత పెట్టుకోవాలి.
14. ఒక 20 నిమిషాల తర్వాత మూత తెరిస్తే ఇది బాగా ఉడికిపోతుంది. అంతే టేస్టీ హరియాలీ కిచిడి రెడీ అయినట్టే.
హరియాలీ కిచిడీ డయాబెటిస్ ఉన్నవారే కాదు, ఆ వ్యాధి లేని వారు కూడా తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. మధుమేమ రోగులు ప్రతిరోజూ హరియాలీ కిచిడి తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఈ కిచిడీని అప్పడాలు, ఆవకాయలతో కలిసి తింటే రుచి అదిరిపోతుంది. పైగా ఎంతో రుచి కూడా.