Gongura Rice: పుల్లపుల్లని గోంగూర రైస్, లంచ్ బాక్స్ రెసిపీగా అదిరిపోతుంది
01 October 2024, 11:30 IST
- Gongura Rice: పులిహోరలాగే గోంగూర రైస్‌ను కూడా లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పులిహారతో పోలిస్తే రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
గోంగూర రైస్ రెసిపీ
Gongura Rice: గోంగూరతో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు గుర్తొస్తే చాలు తినేయాలనిపిస్తుంది. ఇలాంటి సాంప్రదాయ వంటకాలే కాదు, కొన్ని ఆధునిక వంటకాలలో గోంగూర భాగం అయిపోయింది. అలాంటి వాటిలో గోంగూర రైస్ ఒకటి. గోంగూర రైస్ వండుకుంటే పక్కన ఏ కూర లేకపోయినా కూడా తినేయొచ్చు. దీని లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు, పెద్దలకు లంచ్ బాక్స్‌లో ఇది పెడితే ఇష్టంగా తింటారు. స్పైసీగా చేస్తే పెద్దలకు నచ్చుతుంది. కారం లేకుండా చేస్తే పిల్లలకు నచ్చుతుంది. ఎలా చేయాలన్నది మీ ఇష్టమే.
గోంగూర రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోంగూర ఆకులు - రెండు కట్టలు
వండిన అన్నం - రెండు కప్పులు
శనగపప్పు - రెండు స్పూన్లు
మినప్పప్పు - రెండు స్పూన్లు
వేరుశనగ పలుకులు - మూడు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూన్
జీలకర్ర - ఒక స్పూన్
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - అర స్పూను
ఎండుమిర్చి - ఏడు
ధనియాల పొడి - అర స్పూను
నువ్వుల పొడి - అర స్పూను
గోంగూర రైస్ రెసిపీ
1. గోంగూర రైస్ రెసిపీ కోసం ముందుగానే అన్నాన్ని వండి పొడిపొడిగా ఆరబెట్టుకొని రెడీగా ఉంచాలి.
2. ఇప్పుడు గోంగూర ఆకులను ఏరి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి గోంగూర ఆకులను వేసి వేయించుకోవాలి.
4. అవి దగ్గరగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేయాలి. వాటిని చల్లార్చి పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేసి వేరుశెనగ పలుకులు వేసి వేయించాలి.
6. అలాగే ఎండు మిర్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
7. కరివేపాకులు, పసుపు కూడా వేసి వేయించాలి.
8. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర ఆకుల పేస్టును వేసి కలుపుకోవాలి.
9. ధనియాలపొడి, నువ్వుల పొడి కూడా వేసి కలుపుకోవాలి.
10. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి.
11. ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి పులిహోర కలుపుకున్నట్టు కలుపుకోవాలి.
12. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ గోంగూర రైస్ రెడీ అయినట్టే.
13. దీనికి సైడ్ డిష్ ఏదీ అవసరం లేదు. గోంగూర రైస్ ఒక్కటే తినేసినా చాలు, రుచి అద్భుతంగా ఉంటుంది.
గోంగూర వారానికి ఒక్కసారైనా తినడం చాలా అవసరం. దీనిలో ఫోలిక్ యాసిడ్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం, పీచు అధికంగా ఉంటాయి. గోంగూరను అధికంగా తినే వారికి కంటిచూపు అద్భుతంగా పనిచేస్తుంది. రే చీకటి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎలాంటి కంటి వ్యాధులు కూడా రావని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి గోంగూరను ఏదో ఒక రకంగా ఆహారంలో భాగం చేసుకోండి. గోంగూర గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా అడ్డుకునే శక్తిని కలిగి ఉంటుంది.
టాపిక్