Beach Vacation | సముద్రమంత ఆనందం పొందడానికి, భారతదేశంలోని సొగసైన సాగరతీరాలు ఇవిగో!
04 April 2023, 17:17 IST
- Beach Vacation: మీరు బీచ్ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే అంధ్రా నుంచి అండమాన్ వరకు, గోవా నుంచి కన్యాకుమారి వరకు దక్షిణ భారతదేశంలోని కొన్ని అందమైన బీచ్ ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Beach Vacation
Beach Vacation: ఉత్తర భారతదేశం హిమనీనదాలకు ప్రసిద్ధి చెందితే, దక్షిణ భారతదేశం సాగరతీరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ భారత భూభాగం అనేక అందమైన బీచ్‌లకు నిలయంగా ఉంది. సన్నని మృదువైన ఇసుకతో కూడిన నిర్మలమైన తీర ప్రాంతాలు, పారదర్శకమైన జలాలు, ఆహ్లాదాన్ని పంచే పామ్ చెట్లు ఇలా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
అలల శబ్దంతో గంభీరంగా గురకపెడుతున్నటు వంటి ప్రశాంతమైన సముద్రం మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. సూర్యోదయం- సూర్యాస్తమయాల సుందరమైన దృశ్యాలు వీక్షించటానికి, చల్లని సాయంత్రాన హాయిగా సేద తీరటానికి తీరప్రాంతాలు మీకు ఆతిథ్యం కల్పిస్తాయి. మీరు ఒంటరిగా ప్రశాంతంగా గడిపేందుకైనా, జంటగా శృంగార భరిత క్షణాలను ఆస్వాదించేందుకైనా , స్నేహితులతో కలిసి థ్రిల్లింగ్ అడ్వెంచర్లలో మునిగి తేలడానికైనా లేదా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసేందుకైనా.. సముద్రం అందరికీ సముద్రమంతటి ఆనందాన్ని పంచుతుంది.
Best Beaches In South India- దక్షిణ భారతదేశంలోని అందమైన బీచ్‌లు
మీరూ సముద్రాన్ని ఇష్టపడే వారైతే ఆంధ్రప్రదేశ్ మొదలుకొని అండమాన్ వరకు, గోవా నుంచి కన్యాకుమారి వరకు దక్షిణ భారతదేశపు అంచులను కలిపేటువంటి అద్బుతమైన బీచ్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి, మీ బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయండి.
రాధానగర్ బీచ్, అండమాన్- నికోబార్ దీవులు
అండమాన్ - నికోబార్ దీవులలో భాగమైన హావ్‌లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్‌కు నిలయం. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి, ఇక్కడి పారదర్శకమైన జలాలు, మృదువైన తెల్లని ఇసుక, పచ్చదనంతో నిండిన వాతావరణం అద్భుతం అని చెప్పాలి. ఈ బీచ్ ఈత కొట్టడానికి, సన్ బాత్ చేయడానికి, స్నార్కెలింగ్ చేయడానికి కూడా సరైనది.
మరారి బీచ్, కేరళ
మరారి బీచ్ కేరళలోని అలప్పుజలో దాగి ఉన్న ఒక రత్నం. ఈ బీచ్ చాలా రహస్య ప్రదేశంగా, కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. చుట్టూ పచ్చదనంతో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ అనేక రిసార్ట్‌లు, స్పాలు ఉన్నాయి, ఏకాంతం కోరుకునే వారికి ఇది సరైన తీరప్రాంతం. ఇది కాకుండా తిరువనంతపురంలో కోవలం బీచ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఆయుర్వేద చికిత్సలు, యోగా తరగతులకు కూడా కోవలం బీచ్ కేంద్రంగా ఉంది.
కన్యాకుమారి బీచ్, కన్యాకుమారి
భారతదేశం దక్షిణ భాగం చివరికొనను ఈ బీచ్ మీకు పరిచయం చేస్తుంది. కన్యాకుమారి బీచ్ మూడు సముద్రాలు కలిచే ఒక త్రివేణి సంగమం. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మూడు ఒక్కచోటు కలిసే ప్రాంతం ఈ కన్యాకుమారి బీచ్ . మూడు సముద్రాలు కలిసిన చోట అల్లకల్లోలమైన ఆటుపోట్లు ఉంటాయి, ఇవి సముద్రంలోకి మిమ్మల్ని ప్రవేశించకుండా నిరోధించినప్పటికీ, ఉత్కంఠభరితమైన సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి.
బటర్‌ఫ్లై బీచ్, గోవా
గోవాలో జనసంచారం తక్కువ ఉండే బీచ్‌ని కోరుకుంటే మీరు బటర్‌ఫ్లై బీచ్‌కి ఎగిరిపోవచ్చు. ఈ బీచ్ చుట్టూ ఉండే అడవులు, చెట్లు దీనికి అసాధారణమైన సీతాకోకచిలుక ఆకారాన్ని అందించాయి. అందుకే ఈ బీచ్‌ని బటర్‌ఫ్లై బీచ్ అంటారు. ఇది గోవాలోని అత్యంత రిమోట్ బీచ్‌లలో ఒకటి. ఈ బీచ్‌కి వెళ్లడానికి మీరు పడవ లేదా ఫెర్రీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ తర్వాత మీ కాళ్లను మీరు నమ్ముకోవాలి.
రిషికొండ బీచ్, వైజాగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల రిషికొండ బీచ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న సహజమైన జలాల గలగలలు, ఇక్కడి ప్రకృతి సౌందర్యం అనిర్వచనీయం. రిషికొండ బీచ్‌కు ఉన్నటువంటి సహజసిద్ధమైన చెక్కుచెదరని అందం కారణంగా దీనికి 'జువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్' అని పేరు వచ్చింది.