Places To Visit in Vishakhapatnam । భావి ఏపి రాజధాని వైజాగ్ సిటీలో చూడదగ్గ ప్రదేశాలు ఇవే!
Places To Visit in Vishakhapatnam: విశాఖపట్నం బంగాళాఖాతంను ఆనుకొని ఉన్న ఒక సుందరమైన ఓడరేవు నగరం. మీరు వైజాగ్ టూర్ ప్లాన్ చేస్తే, ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయో ఒక లుక్ వేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ఒక పెద్ద వరంగా సుమారు 975 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. ఈ తీరప్రాంతాన్ని అనుకొని ఎన్నో సుందరమైన నగరాలు, రేవు పట్టణాలు, బీచ్ లు, హిల్ స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతాన్ని అనుకోని విశాఖపట్నం లాంటి ఒక పెద్ద ఓడరేవు నగరం ఉంది. విధిగల నగరం (The City of Destiny), తూర్పుతీర రత్నం (The Jewel of the East Coast) గా పేరుగాంచిన వైజాగ్ సిటీ రాష్ట్రానికి ఒక ముఖ్య పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లుతోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానుల ప్రణాళికకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లో, ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఉండబోతున్నట్లు ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక మీటింగ్‌లో స్పష్టం చేశారు.
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతుందని హిందూస్తాన్ టైమ్స్- తెలుగు గతేడాదే తెలియజేసింది. (Read Here: ఇకపై ఏపి రాజధాని వైజాగ్.. ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం జగన్)
Best Places To Visit in Vishakhapatnam- విశాఖపట్నంలో విహారయాత్ర
విశాఖపట్నం పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మరికి ఏపి కాబోయే రాజధాని చుట్టూ చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయో మీరూ ఒక లుక్ వేయండి.
రామకృష్ణ బీచ్
వైజాగ్ నగరానికి అతిపెద్ద ఆకర్షణ రామకృష్ణ బీచ్. నగర వాసులకు ఏ సమయంలోనైనా గొప్ప ఉపశమనం అందించే ప్రదేశం ఇది. ఇక్కడ స్పోర్టీ టైమ్ స్విమ్మింగ్ , బీచ్ వాలీబాల్ వంటి జల క్రీడలు ఆడటం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు బీచ్ రోడ్‌లోని సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడవచ్చు. జలాంతర్గామి లోపల ఎలా ఉంటుందో అనుభూతి చెందవచ్చు.
సుదూర కొండలతో రాతి తీరం కలిగిన నగరంలోని మరొక బీచ్ రుషికొండ బీచ్ కూడా ప్రకృతి అందానికి ప్రతిరూపం. ఇక్కడ వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్‌ని ఆస్వాదించవచ్చు.
కైలాసగిరి కొండలు
శివపార్వతుల ఎత్తైన రాతి విగ్రహాలు కొలువుదీరి ఉన్న ఈ కొండ ప్రాంతం నిజంగా కైలాసగిరి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక్కడ అందమైన ఉద్యానవనం ఉంది, ఎదురుగా అత్యద్భుతంగా కనిపించే బీచ్ వ్యూ పాయింట్ మీరు సేదతీరడానికి ప్రశాంత వాతావరణంను అందిస్తాయి. అడ్వెంచర్లకు కూడా ఇది గొప్ప స్పాట్. ఇక్కడ థ్రిల్లింగ్ రోప్‌వే మార్గం గుండా చేసే చిన్ని ప్రయాణం మీకు చిరస్మరణీయ జ్ఞాపకాలను పంచుతుంది.
టైడా పార్క్
మీరు ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే నగరానికి కొద్దిదూరంలో టైడా పార్క్ ఉంది. ఇక్కడి స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిల రావాలు మిమ్మల్ని పూర్తిగా రణగొణ జనజీవనం నుంచి వేరు చేసి, మరొక స్వచ్ఛమైన లోకంలో విహరింపజేస్తాయి. ఇక్కడ రిసార్టుల్లో ఒక రాత్రి బస చేయడం ద్వారా మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని ఆస్వాదించినవారవుతారు.
అరకులోయ
టైడా పార్క్ నుంచి మరికొద్ది దూరంలోనే ప్రకృతి చేసిన అందాల మాయ అరకులోయ ఉంటుంది. తూర్పు కనుమల నడుమన నైలవైన ఈ అద్భుతమైన ప్రాంతంకు వెళ్తే మరో ప్రపంచంను మీ కళ్లముందు ఆవిష్కరిస్తుంది. స్వచ్ఛమైన గిరిజనులు, వారి గొప్ప సంస్కృతి, జీవనశైలి, ధింసా నృత్యాలు, కాఫీ తోటలు, బొర్రా గుహాలు ఇలా అనేకం మీ జ్ఞాపకాల్లో పదిలం చేసుకోవచ్చు.
లంబసింగి
సముద్రమట్టానికి 1025 మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగి అనే కుగ్రామం 'ఆంధ్రా కాశ్మీర్' గా ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో హిమపాతం పొందే ఏకైక ప్రదేశం ఇదేనని చెబుతారు. అద్భుతమైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటలు, ఇక్కడి జీవవైవిధ్యం మిమ్మల్ని అబ్బురపరుస్తాయి.
సింహాచలం
విశాఖపట్నం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఉంది. ఇది సింహాచలం కొండ శ్రేణిలో ఉన్న ఒక హిందూ దేవాలయం. మహా విష్ణువును ఈ ఆలయంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహునిగా కొలుస్తారు. ఏడాది పొడవునా భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
సంబంధిత కథనం