Vizag Capital | ఇకపై ఏపి రాజధాని వైజాగ్.. ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం జగన్?
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా 'విశాఖపట్నం' ఉండబోతుందని తెలుస్తోంది. అందుకు సీఎం జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫిబ్రవరి నెలలోనే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
Vishakhapatnam | ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే? అప్పట్లో అమరావతి, ఆ తర్వాత మూడు రాజధానులు.. ఇప్పుడు అసలు రాజధాని ఉందో లేదో అనే ఒక సందేహం వ్యక్తంచేస్తారు జనం. అయితే ఇప్పుడు అలాంటి సందేహాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా 'విశాఖపట్నం' ఉండబోతుందని తెలుస్తోంది. అందుకు సీఎం జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
జగన్ నేతృత్వంలోని ఏపి ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే నూతన జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త జిల్లాలు ఉగాది నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. విశాఖపట్నం రాజధానిగా సరికొత్త పరిపాలన ప్రారంభిస్తుందని పలు కథనాలు వెలువడుతున్నాయి.
తాజాగా టాలీవుడ్ ప్రముఖుల భేటీ జరగడం, సీఎం జగన్ వారిని వైజాగ్‌లో సినిమా ఇండస్ట్రీని ఏర్పాటు చేయమని కోరడం కూడా రాజధానిగా వైజాగ్ ఏర్పాటు కాబోతుందనే వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఫిబ్రవరి చివరి వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే రాష్ట్ర రాజధాని బిల్లును ప్రవేశపెట్టి.. ఏపి రాజధానిగా విశాఖపట్నంను సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది పండగ వస్తుంది. తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే మొదటి రోజు నుంచి విశాఖపట్నం రాజధానిగా పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి వినికిడి.
హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలతో పోటీ పడాలంటే విశాఖపట్నం లాంటి నగరం అయితేనే సాధ్యపడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు వైజాగ్ సిటీకి మకాం మార్చుకోవాల్సిందిగా సూచనలు వెళ్లినట్లు సమాచారం.
పనిలోపనిగా మంత్రివర్గ విస్తరణ కూడా సీఎం జగన్ చేపట్టనున్నారని వార్తలున్నాయి. గత రెండేళ్లలో పనితీరు సరిగ్గాలేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఏపిలో అసెంబ్లీ ఎన్నికలకు సుమారు మరో రెండేళ్ల వరకు సమయం ఉంది. అప్పటివరకు ఇంకా ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.
సంబంధిత కథనం