Bottle Gourd Idli Recipe । ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలనుకుంటే.. సోరకాయ ఇడ్లీ ట్రై చేయండి!
02 February 2023, 6:06 IST
- Bottle Gourd Idli Recipe: ఎప్పుడూ ఒకేరకమైన ఇడ్లీ తిని విసుగు అనిపిస్తే ఇలా కొత్తగా ట్రై చేయండి. సోరకాయ ఇడ్లీ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Bottle Gourd Idli Recipe
మీ ఉదయాన్ని ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభిస్తే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి చాలా రకాల అల్పాహారాలు ఉన్నాయి. వాటన్నింటిలో ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైన, శ్రేష్ఠమైన అల్పాహారం. మీరు ఎల్లప్పుడూ తినే ఇడ్లీకి మరింత ప్రత్యేకమైన రుచిని అందించే రెసిపీని మీకు అందిస్తున్నాం.
సోరకాయ లేదా ఆనపకాయ అనేది ఎల్లప్పుడూ లభించే ఒక అద్భుతమైన కూరగాయ. దీనిలో నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనితో ఇడ్లీని కలిపి చేస్తే మరింత రుచిగా, ఆరోగ్యకరమైన అల్పాహారం తయారవుతుంది. మరి సోరకాయ ఇడ్లీ ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలేమిటో తెలుసుకోండి. సోరకాయ ఇడ్లీ రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ అందించిన సూచనల ప్రకారం సులభంగా పోషకభరితమైన అల్పాహారం సిద్ధం చేసేయండి.
Bottle Gourd Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు సూజీ రవ్వ
- 1 కప్పు తురిమిన సోరకాయ
- 1/2 కప్పు పెరుగు
- 1/2 కప్పు నీరు
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1 స్పూన్ ఆవాలు
- 1 స్పూన్ మినప పప్పు
- 1 ఎర్ర మిరపకాయ
- 1 కరివేపాకు రెమ్మ
- 1/4 కప్పు కొత్తిమీర
- ఉప్పు రుచి కోసం
సోరకాయ ఇడ్లీ తయారీ విధానం
1. కడాయిలో నూనె వేడి చేసి, ఆవాలు, మినపపప్పు, కరివేపాకు, ఎర్ర మిరపకాయలను వేసి వేయించాలి. అనంతరం రవ్వ కూడా వేసి 5 నిమిషాలు వేయించాలి.
2. ఆ తర్వాత స్టవ్ నుండి దించేసి, చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులో సరిపడా నీరు, పెరుగు వేసి బాగా కలపండి, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి.
3. అనంతరం సిద్ధం చేసుకున్న ఇడ్లీ మిశ్రమంలో తరిగిన సోరాకాయ, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి.
4. ఈ పిండిని ఇడ్లీలో పాత్రలో వేసి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.
బయటకు తీసి చూస్తే వేడివేడి సోరకాయ ఇడ్లీలు రెడీ. మీకు నచ్చిన చట్నీతో తింటూ ఆనందించండి.
టాపిక్