Avocado Toast । అవకాడో టోస్టుతో బ్రేక్‌ఫాస్ట్.. మీ రోజుకు ఆరోగ్యకరమైన స్టార్ట్!
01 August 2022, 8:19 IST
- త్వరగా ఏదైనా అల్పాహారం సిద్ధం చేయాలంటే అవకాడో టోస్టును కేవలం 5-10 నిమిషాల్లో చేసేయొచ్చు. అవకాడో ఎంతో రుచికరమైనది ఇంకా ఆరోగ్యకరమైనది. అవకాడో టోస్ట్ చేయటానికి రెసిపీ ఇక్కడ ఉంది.
Avocado Toast
త్వరగా ఏదైనా అల్పాహారం చేసేయాలంటే జాబితాలో అవకాడో టోస్ట్ కూడా ఉంటుంది. అవోకాడో టోస్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ. ఇది ఎంతో ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన అల్పాహారం. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, స్నాక్స్‌గా అయినా ఏ సమయంలోనైనా తినవచ్చు. ఇది చేసుకోవటానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. కేవం 5-10 నిమిషాల్లో సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. ఇందుకు మీకు కావలసిందల్లా అవకాడోలు, బ్రెడ్, ఆలివ్ ఆయిల్ కొంచెం సీజనింగ్.
అలాగే అవకాడోలతో మీకు పుష్కలమైన పోషకాలు లభిస్తాయి, తద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవకాడోలలో ఒలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యకరమైన కొవ్వు. కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కళ్లకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్ అయిన లుటీన్ సమ్మేళనం అవకాడోలో అధికంగా ఉంటుంది. ఇవి కీలకమైన పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించవచ్చు. చర్మాన్ని మెరుగుపరుస్తుంది, గాయాలను నయం చేసే గుణాలను కలిగిఉంటుంది.
మరి ఇంకా ఆలస్యం ఎందుకు? అవకాడో టోస్ట్ చేసేందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ కింద తెలుసుకోండి.
కావలసినవి
- 1 పండిన అవకాడో
- 1/2 టీస్పూన్ నిమ్మరసం
- చిల్లీ ఫ్లేక్స్ సీజనింగ్ కోసం
- 2 గార్లిక్ బ్రెడ్ లేదా మల్టీ గ్రెయిన్ బ్రెడ్ లేదా హోల్ వీట్ బ్రెడ్
- 1 టీస్పూన్ ఆలివ్ నూనె
తయారీ విధానం
- ముందుగా మీడియం మంట మీద తవా స్కిల్లెట్‌ను వేడి చేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయండి.
- ఆ తర్వాత బ్రెడ్ ముక్కలను వేసి బంగారు గోధుమ రంగు వచ్చేంతవరకు టోస్ట్ చేయండి.
- ఇప్పుడు అవకాడోను తీసుకొని దానిని సగానికి కట్ చేయండి. అందులో గింజను తీసేయండి.
- అవకాడో గుజ్జుకు గాట్లు పెట్టి ఉప్పు, కారం చల్లుకుంటూ ఒక ముద్దగా నూరుకోండి.
- బ్రెడ్ టోస్టులపైన అవకాడో మిశ్రమం అద్దుకుంటే సరిపోతుంది.
సువాసనభరితమైన, పోషకాలు నిండిన అవకాడో టోస్ట్ సిద్ధంగా ఉంది. చాయ్, కాఫీని తాగుతూ అవకాడో టోస్ట్ తింటూ రుచిని ఆస్వాదించండి.