DIY Cucumber Face Pack । ముఖం అద్దంలా మెరిసిపోవాలా? అయితే దోసకాయ ఫేస్ ప్యాక్ వేసుకోండి!
21 November 2022, 18:13 IST
- DIY Homemade Cucumber Face Pack: ముఖం అద్దంలా మెరిసిపోవాలా? అయితే పాత పద్ధతుల్లోనే ప్రయత్నించండి, రసాయన రహితమైన దోసకాయతో ఫేస్ ప్యాక్ ఇంట్లోనే చేసుకొని ముఖానికి పట్టించండి. ఆ తర్వాత మీ ముఖం మీరు చూసుకుంటే నమ్మలేకపోతారు.
DIY Homemade Cucumber Face Pack
తమ మొఖం మెరిసిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మొఖంపై మొటిమలు, మొండి మచ్చలు మెరిసే చర్మం కలని నిజం చేయనివ్వవు. కొన్నిసార్లు దుమ్ము, కాలుష్యం కారణంగా మొటిమలు రావడం ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు హార్మోన్ల లోపం వల్ల మొటిమలు వస్తాయి. చాలా సార్లు రసాయన ఉత్పత్తులు ముఖానికి హాని చేస్తాయి. అయితే ముఖానికి ఎలాంటి ఉత్పత్తులు ఉపయోగించకుండా కేవలం దోసకాయ ఉపయోగించడం ద్వారా మీ ముఖంలో మెరుపు వస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.
దోసకాయలు తినడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాదు. దీన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మానికి కూడా మెరుపు కూడా వస్తుంది. మచ్చలు లేని ముఖాన్ని పొందడం కోసం ఇంట్లోనే దోసకాయతో ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ దోసకాయ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల మొండి మచ్చలు సైతం తొలగిపోతాయి. దీని వల్ల ముఖం అద్దంలా మెరుస్తూ అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. మరి ఈ దోసకాయ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయవచ్చో, ఇక్కడ తెలుసుకోండి.
దోసకాయ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి మీకు దోసకాయ, బియ్యం పిండి, ముల్తానీ మట్టి, నిమ్మరసం అవసరం అవుతాయి. తయారు చేసే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
DIY Homemade Cucumber Face Pack- దోసకాయ ఫేస్ ప్యాక్
దోసకాయ ఫేస్ ప్యాక్ చేయడానికి, ముందుగా ఒక దోసకాయను తీసుకొని దానిని శుభ్రంగా కడగండి, ఆపై ముక్కలుగా కోసుకుని, ఈ ముక్కలను మిక్సర్ లో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ దోసకాయ పేస్ట్‌కు సమాన పరిమాణంలో ముల్తానీ మట్టి, బియ్యప్పిండిని కలపండి. ఆ తర్వాత రెండు మూడు చుక్కల నిమ్మరసం కలపండి. ఇప్పుడు అన్నింటిని బాగా కలుపుకుంటే చిక్కని పేస్ట్ అవుతుంది. మీకు కావలసిన దోసకాయ ఫేస్ ప్యాక్ సిద్ధం అయినట్లే.
ఫేస్ ప్యాక్ చేసుకునే విధానం
దోసకాయ ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసే ముందుగా, ఏదైనా తేలికపాటి ఫేస్ వాష్ సహాయంతో మీ ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో ముఖంపై మురికి మొత్తం పోయి, ఫేస్ వాష్ ప్రభావవంతమైన ఫలితాలను అందిస్తుంది. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత దోసకాయ ఫేస్ ప్యాక్‌ను ఒక బ్రష్ సహాయంతో ముఖంపై అప్లై చేయండి. సుమారు 20 నిమిషాల పాటు అది ఆరిపోయేంతవరకు ఉంచుకోవాలి. ఆరిపోయిన తర్వాత, ఒక తడిగుడ్డ తీసుకొని దానితో ఫేస్ ప్యాక్‌ను మొత్తం తుడిచి వేయాలి. అనంతరం చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఈ దోసకాయ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గినట్లు అనిపిస్తుంది. క్రమంగా ముఖం కాంతివంతం అవుతుంది.
టాపిక్