Diabetes: డయాబెటిస్ ఉన్న వారు పండ్లు తినొచ్చా? ఎలా తీసుకోవచ్చో చెప్పిన డాక్టర్
05 November 2024, 20:30 IST
- Diabetes: డయాబెటిస్ ఉన్న వారు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే, పండ్లలో కార్స్బ్ ఎక్కువగా ఉంటాయి. దీంతో డయాబెటిస్ ఉన్న వారు పండ్లు తినొచ్చా అనే సందేహం ఉంటుంది. ఈ విషయంపై ఓ డాక్టర్ సలహాలు వెల్లడించారు.
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు పండ్లు తినొచ్చా? ఎలా తీసుకోవచ్చో చెప్పిన డాక్టర్
పండ్లలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు గ్లూకోజ్ అనే షుగర్‌గా కార్బ్స్ మారతాయి. కొన్ని పండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి తిన్నప్పుడు అది రక్తంలోకి చేరి.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు కారణం కావొచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా పండ్లు తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. అయితే, డయాబెటిస్ ఉన్న వారు పండ్లను ఏ విధంగా తీసుకుంటే మంచిదో ఓ వైద్య నిపుణుడు వివరించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పండ్లతో పాటు ఇవి కూడా..
పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కాస్త పెరుగుతాయి. ఫైబర్ ఈ ప్రక్రియను తగ్గించడంలో సహకరించినా.. కాస్త షుగర్ స్థాయి అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై శక్రా వరల్డ్ హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్, డయాబెటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సుబ్రతా దాస్.. హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍తో ఇంటర్వ్వూలో మాట్లాడారు.
హెల్దీ ఫ్యాట్స్ లేదా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో పండ్లను డయాబెటిస్ ఉన్న వారు తినవచ్చని సుబ్రతా దాస్ తెలిపారు. “డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెంట్స్ ఉన్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్లెసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తిన్నాక ఇలా జరుగుతుంది. అయితే, హెల్దీ ఫ్యాట్స్ లేదా ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలతో కలిపి పండ్లను తినడం వల్ల గ్లెసెమిక్ రెస్పాన్స్ తగ్గుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ తటస్థంగా ఉండడం ఎక్కువగా ఫ్యాట్, ప్రోటీన్‍పై ఆధారపడి ఉంటుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉండేలా ప్రోటీన్ చేయగలదు. కార్బోహైట్రేడ్ల ప్రక్రియను ఫ్యాట్ నెమ్మదయ్యేలా చేస్తుంది” అని సుబ్రదా దాస్ పేర్కొన్నారు. బాదం, ఆక్రోటు లాంటి నట్స్, సీడ్స్, పప్పు ధాన్యాలు, యగర్ట్, కోడిగుడ్లు, ఫ్యాటీ ఫిష్ లాంటి ఆహారాల్లో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి.
హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ మేలు
ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండే ఆహారాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. “నట్స్, అవకాడో, కోడిగుడ్డు సొన, ఆలివ్ ఆయిల్ లాంటి వాటిలో హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. ఇవి తింటే ఎక్కువసేపు ఎనర్జీ ఉంటుంది. శరీరంలో నేచురల్ హర్మోన్ కోర్టిసాల్ ఉదయం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ హెల్దీ ఫ్యాట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. కార్బ్స్ కాకుండా ఉదయం ఫ్యాట్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు సహకరిస్తాయి. కార్స్బ్ ఎక్కువగా తీసుకుంటే ఆ లెవెల్స్ ఎక్కువవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్న వారు హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తినడం చాలా ముఖ్యం” అని డాక్టర్ సుబ్రతా దాస్ చెప్పారు.
శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెంట్‍ను, విటమిన్లు శోషించుకునే గుణాలను హెల్దీ ఫ్యాట్స్ మెరుగుపరుస్తాయని సుబ్రతా దాస్ వెల్లడించారు. పేగుల ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి కూడా మేలు చేస్తాయని చెప్పారు. నెయ్యి, వెన్నె, కొబ్బరి నూనె, అవకాడో ఆయిల్‍లోనూ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయన్నారు. నట్స్, నట్స్ బటర్ కూడా ఆహారంలో తీసుకోవచ్చని చెప్పారు. ఫ్రైడ్ ఫుడ్స్, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బ్రెడ్, పాస్తా, పిజ్జా లాంటివి తినకూడదని తెలిపారు.