Diabetes: డయాబెటిస్ ఉన్న వారు చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు చలికాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే రిస్క్ ఉంటుంది. అందుకే ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి.
డయాబెటిస్ (షుగర్)తో బాధపడుతుండే వారికి చలికాలంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణం చల్లగా మారడంతో రక్త ప్రసరణపై ప్రభావం పడడం, ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. శారీరక వ్యాయమం తగ్గించడం, హార్మోన్లలో మార్పులు ఇలా కొన్ని కారణాల వద్ద బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు చలికాలంలో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ చూడండి.
వెచ్చగా ఉండేలా చూసుకోవాలి
వాతావరణం చల్లగా మారడం బ్లడ్ షుగర్ లెవెళ్లపై ప్రభావం చూపుతుంది. అందుకే శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండేలా డయాబెటిస్ ఉన్న వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉలన్ దుస్తులు ఎక్కువగా వేసుకోవాలి. చల్లిగాలి శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే, డయాబెటిస్ కోసం మీరు వాడే మందులకు కూడా ఎక్కువ చల్లదనం తగలకుండా చూసుకోవాలి.
వ్యాయామం తప్పనిసరి
చలికాలంలో ఉదయాన్నే వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే చాలామంది వ్యాయామం చేసేందుకు సముఖంగా ఉండరు. అయితే, డయాబెటిస్ ఉన్న వారు చలికాలంలో తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకవేళ బయటికి వెళ్లలేకపోతే యోగా, జుంబా సహా ఇండోర్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. వ్యాయామం చేస్తే శరీరం వెచ్చబడుతుంది. బ్లడ్ షుగర్ లెవెళ్లు కంట్రోల్‍లో ఉండేందుకు వ్యాయమం ఉపకరిస్తుంది.
ఇవి ఎక్కువగా తినాలి
డయాబెటిస్ ఉన్న వారు చలికాలంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడాన్ని పెంచాలి. కూరగాయల సూప్‍లు తాగాలి. సీడ్స్, నట్స్ తినాలి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవటంతో పాటు బ్లడ్ షుగర్ స్థాయిలో అదుపులో ఉంటాయి. సూప్స్ వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
జ్వరం రాకుండా..
చలికాలంలో జ్వరం, జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారు వీటి నుంచి కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడం కష్టమవుతుంది. అందుకే జ్వరం రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే డాక్టర్ వద్దకు వెళ్లి జ్వరం వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే, అనారోగ్యం బారిన పడకుండా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి.
రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్
చలికాలంలో రెగ్యులర్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సంబంధిత వైద్యులను సంప్రదించాలి. తీసుకునే మందుల్లో ఏవైనా మార్పులు అవసరమేమో అడగాలి. చల్లటి వాతావరణం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు ఎదురైతే వివరించాలి. వైద్యుల సూచనలు పాటించాలి.
హైడ్రేడెట్‍గా ఉండాలి
చలికాలంలో అయినా సరే డయాబెటిస్ ఉన్న వారు ప్రతీ రోజు తగినంత నీరు తాగాల్సిందే. నిరంతరం హైడ్రేడెట్‍గా ఉండాలి. డీహైడ్రేషన్ అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికం అవుతాయి. రోజులో సుమారు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.
అలాగే, మానసిక ఒత్తిడి కూడా పెరగకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడి అధికం అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. అందుకే ఒత్తిడి తగ్గేలా ప్రాణాయామ, యోగా, ధ్యానం లాంటివి చేయాలి.