bad dreams: ఇవి తింటే పీడకలలొస్తాయ్
18 May 2023, 20:00 IST
bad dreams: నిద్రపోయే ముందు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో చాలా ముఖ్యం. దాని ప్రభావం మనకొచ్చే కలల మీద కూడా పడుతుందట. నిద్రపోయే ముందు ఏం తినకూడదో చూద్దాం.
పీడకలలు (Shutterstock)
పీడకలలు
వయసు పెరిగే కొద్ది కలలు రావడం కూడా తగ్గుతుంది. కానీ కొంత మందిలో వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా కలలు వస్తుంటాయి. పెద్ద బిల్డింగ్ నుంచి కింద పడుతున్నట్లు, ఎక్కడో ఇరుక్కుపోయినట్లు, ఎవరో తరుముతున్నట్లు.. ఇలా భయపెట్టే కలలూ వస్తుంటాయి. నిద్రకు భంగం కలిగించడమే కాకుండా ఈ కలలు ఆందోళన పెంచుతాయి. ఒక గ్లాసు నీళ్లు తాగితే కాస్త భయం తగ్గుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే కొంతమందికి ఈ కలలొస్తాయి. ఒత్తిడి, మసాలాలున్న ఆహారం తినడం, కొన్ని రకాల మందులు వాడటం దీనికి కారణం అవ్వచ్చు.
కలలు రాకుండా ఉండాలంటే ఏం తినాలి?
- కార్బోహైడ్రేట్లు: వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల కూడా కలలు వచ్చే అవకాశం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, చిలగడదుంప మంచి కార్బోహైడ్రేట్లుండే ఆహారం.
- క్యాల్షియం: శరీరం ప్రశాంతంగా ఉండటంలో సాయపడుతుంది. పడుకునే ముందు క్యాల్షియం ఎక్కువుండే పాలు, పెరుగు, చీజ్, ఆకు కూరలు తినడం మంచిది.
- ట్రిప్టోఫన్: ఇదొక అమైనో యాసిడ్. మంచి నిద్రకు ఇది సాయపడుతుంది. ఇది ఎక్కువగా ఉండే టర్కీ, చికెన్, చేపలు, గుడ్లు, గింజలు పడుకునే ముందు తీసుకోవచ్చు.
- విటమిన్ బీ6: ఈ విటమిన్ వల్ల శరీరంలో సిరటాయిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్ర నియంత్రిస్తుంది. అందుకే విటమిన్ బి6 ఉండే అరటిపండ్లు, విత్తనాలు, చేపలు తీసుకుంటే మేలు.
- హెర్బల్ టీ: చేమంతి టీ, ల్యావెండర్ టీ నిద్రపోయే ముందు తీసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. నాణ్యమైన నిద్ర దొరుకుతుంది.
కలలు రాకుండా ఉండాలంటే ఏం తినొద్దు?:
- ఆల్కహాల్: నిద్రకు ముందు ఆల్కహాల్ తాగడం వల్ల నిద్ర పట్టదు. ఆల్కహాల్ వల్ల ర్యాపిడ్ ఐ మోవ్‌మెంట్ ఉన్న నిద్ర ఎక్కువుందంట. ఇదే కలలు వచ్చే అవకాశం ఉన్న సమయం. ః
- మసాలాలు: కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఉష్ణోగ్రతతో పాటూ, గుండె వేగం కూడా పెరుగుతుంది. ఇది నిద్ర పట్టనివ్వదు.
- కెఫీన్: నిద్రకు భంగం కలిగించే వాటిలో ఇది ముందుంటుంది. కెఫీన్ ఉన్న పానీయాలు, కాఫీ, టీ తీసుకోవడం వల్ల నిద్ర పట్టదు. కలలు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.
- కొవ్వు: ఎక్కువ కొవ్వుండే ఆహారం నిద్రపోయే ముందు తీసుకోకూడదు. దానివల్ల సరిగ్గా జీర్ణకాక అసౌకర్యంతో పాటూ నిద్ర కూడా పట్టదు. దానివల్ల కలలు కూడా ఎక్కువొస్తాయి.
- పంచదార: ఎక్కువ పంచదార ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల నాణ్యమైన నిద్ర లేక కలలొస్తాయి.