Chapped Lips Tips: చలికాలంలో పెదాలు పగులుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి.. ఆ రెండు పనులు వద్దు
12 November 2024, 12:30 IST
- Chapped Lips Tips: చలికాలంలో పెదాలు పగలడం సమస్యగా మారుతుంది. దీనివల్ల పెదాలు మండుతుంటాయి. చిరాకుగా అనిపిస్తుంది. అందుకే ఈ కాలంలో పెదాలు పగలకుండా ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Chapped Lips Tips: చలికాలంలో పెదాలు పగులుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి.. ఆ రెండు పనులు వద్దు
చలికాలంలో చర్మం, పెదవులు పొడిగా మారడం సమస్యగా మారుతుంది. మృధువుగా ఉండే పెదాలపై పగుళ్లు వచ్చి మంట పుడుతుంటుంది. ఇది బాధ కలిగించడంతో పాటు చిరాకుగా అనిపిస్తుంది. చలికాలంలో వాతావరణంలో తేమశాతం శాతం తక్కువగా ఉండడం వల్ల పెదాలకు ఈ ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెదాలు పొడిబారే, పగిలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
సూటయ్యే లిప్‍బాంబ్
లిప్‍బాంబ్ రాసుకుంటే పెదాలు పగలకుండా ఉంటాయి. అయితే, లిప్‍బాంబ్ రాసుకున్నప్పుడు పెదాలకు ఎలాంటి దురద, మంట రాకుండా ఉండాలి. ఒకవేళ అలా జరిగితే వెంటనే వేరే రకం లిప్‍బాంబ్‍ను వాడాలి. అలా.. పెదాలకు సూటయ్యేలా ఉండే లిప్‍బాంబ్ పూసుకుంటే పొడిబారకుండా, పగలకుండా ఉంటాయి.
తగినంత నీరు
పెదాలు పరిగేందుకు ఓ ప్రధానమైన కారణం సరిపడా నీరు తాగకపోవడం. వాతావరణం చల్లగా ఉందని శీతాకాలంలో చాలా మంది శరీరానికి సరిపడా నీరు తాగరు. తరచూ నీరు తీసుకోరు. దీంతో పెదాలు ఎక్కువగా పొడిబారతాయి. అందుకే చలికాలమైనా సరిపడా నీరు తాగాల్సిందే. రోజులో 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.
ప్యూర్ పెట్రోలిజం జెల్లీ
పెదాలు పొడిబారి పగులుతుంటే ప్యూర్ పెట్రోలిజం జెల్లీ రాయవచ్చు. ఒకవేళ ఏ లిప్‍బాంబ్ సెట్ కాకపోతే పెట్రోలిజం జెల్లీ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది రాయడం వల్ల పెదాలపై తేమ మెరుగ్గా ఉంటుంది. పగలగడాన్ని నివారిస్తుంది.
నేచురల్‍గా..
పెదాలు పొడిబారకుండా కొన్ని సహజమైన పదార్థాలు కూడా వాడొచ్చు. పెదాలకు కొబ్బరినూనె, తేనె, కలబంద జెల్, నెయ్యి కూడా రాయొచ్చు. ఇవి పెదాలకు తేమ అందించి.. పగలకుండా చేయగలవు.
పోషకాలు ఉండే ఆహారం
విటమిన్లు లోపం కూడా పెదాలు పగిలేందుకు ఓ కారణంగా ఉంటుంది. చలికాలంలో విటమిన్ బీ, ఐరన్, అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ఒకవేళ మీ ఆహారంలో పోషకాలు ఎక్కువగా లేకపోతే వైద్య నిపుణుల సలహా తీసుకొని సప్లిమెంట్స్ వాడొచ్చు.
హ్యూమిడిఫైర్ వాడడం
వాతావరణంలో తేమ శాతం సరిగా లేక చలికాలంలో పెదాలు, చర్మం పగులుతుంటాయి. అయితే, ఇళ్లలో హ్యుమిడిఫైయర్ వాడడం గాలిలో తేమ స్థాయి పెరుగుతుంది. అందుకే పెదాలు పొడిబారకుండా ఇవి తోడ్పడతాయి. ఒకవేళ ఇళ్లలో రూమ్ హీటర్ వాడుతుంటే హ్యుమిడిఫైర్ తప్పకుండా వాడాలి.
చేయకూడనివి ఇవే
పెదాలను తరచూ చప్పరించడం, కొరకడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల పెదాలు పగిలే సమస్య ఎక్కువ అవుతుంది. మెడలో ఉన్న చైన్‍లను నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇలా జ్యువెలరీ సహా ఇతర మెటల్ వస్తువులు పెదాలకు తాకించడం వల్ల పెదాలు పొడిబారి పగిలేది అధికమవుతుంది. పెదాల మంట కూడా ఎక్కువవుతుంది.