Book reading benefits: బుక్ రీడింగ్‌తో 10 అద్భుత ప్రయోజనాలు ఇవే
06 January 2023, 21:30 IST
- book reading benefits: బుక్ రీడింగ్ హాబిట్ మీకు ఇప్పటి వరకు లేనట్టయితే ఒకసారి ప్రయత్నించి చూడండి. వాటి వల్ల కలిగే 10 అద్భత ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
బుక్ రీడింగ్ ద్వారా తెలిసే ప్రాపంచిక విషయాలు మీ మేథస్సును పెంచుతాయి
Book reading benefits: బుక్ రీడింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. ఓటీటీల యుగంలో బుక్ రీడింగ్ అలవాట్లు తగ్గడం ఆందోళన రేకెత్తించే అంశం. రెగ్యులర్‌గా బుక్స్ చదవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
1. ఏకాగ్రత, ఫోకస్ పెంచుతుంది
ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి తగినంత ఫోకస్ అవసరం. పుస్తకాల్లో ఉన్న విషయాలను ఆకళింపు చేసుకునేందుకు ఏకాగ్రత చాలా ముఖ్యం. డిజిటల్ ఏజ్‌లో ఒక ఇన్‌స్టా రీల్‌నో, యూట్యూబ్ షార్ట్స్ కూడా పూర్తిగా చూడలేనంత అసహనం మనలో ఏర్పడుతోంది. వెంటవెంటనే స్క్రోలింగ్ చేస్తూ తదుపరి రీల్ కోసం వేటాడుతుంటాం. కానీ పుస్తకం అలా కాదు. ప్రతి పేజీని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది మన సహనం, ఏకాగ్రత, ఫోకస్‌లకు పనిపెడుతుంది. ఆయా అంశాల్లో మన సామర్థ్యం మెరుగవుతుంది.
2. భాషపై పట్టు పెరుగుతుంది
బుక్ రీడింగ్ వల్ల కొత్త కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోగలుగుతాం. పద సంపద పెరిగి మీ సంభాషణ నైపుణ్యం పెరుగుతుంది. అలాగే రాత నేర్పుగా ఉంటుంది. విభిన్న రచనా శైలి అలవడే అవకాశం ఉంటుంది.
3. ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి
రచయిత తన జీవితకాలంలో నేర్చుకున్న, అనుభవంలో ఉన్న విషయాలను పుస్తకం ద్వారా మన ముందుకు తెస్తారు. ఆనాటి కాలమాన పరిస్తితులు మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, దేశాలు, ప్రాంతాల మధ్య ఘర్షణ, నాగరికత, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అనేకం తెలుస్తాయి. ఆయా విషయాలపై మనకు పట్టు పెరుగుతుంది. తద్వారా మీ మేథస్సు పెరుగుతుంది. ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది.
4. స్ఫూర్తి, ప్రేరణ లభిస్తుంది
గొప్ప గొప్ప పుస్తకాలు ఎంతో మంది జీవితాలను మార్చేస్తుంటాయి. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న వారి గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి. నిత్యజీవితంలో మనం చేసే పోరాటానికి ప్రాణవాయువుగా నిలుస్తాయి. సానుకూల ఆలోచనలతో ప్రేరణ ఇస్తాయి.
5. ఒత్తిడిని తగ్గించే బుక్ రీడింగ్
బుక్ రీడింగ్ వల్ల మరొక గొప్ప ప్రయోజనం. మీలో ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఒత్తిడి ఏర్పడడం సహజం. అనేక వైఫల్యాలను చవిచూడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీకు బుక్ రీడింగ్ అనే వ్యాపకం బాగా మేలు చేస్తుంది. స్ట్రెస్ తగ్గించి గుండె కొట్టుకునే వేగాన్ని, బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది.
6. రోల్‌మోడల్‌గా నిలిచినట్టవుతుంది
ఇప్పుడు అనేక విజయవంతమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఒకప్పటి గొప్ప నవలలే. మీరు స్క్రీన్ ముందు ఎక్కువ గడపడం వల్ల మీ పిల్లలు కూడా అదే పనిచేస్తారు. మీరు బుక్ రీడింగ్ వ్యాపకంగా ఎంచుకుంటే మీ పిల్లలకు మీరు రోల్ మోడల్‌గా నిలుస్తారు. వారికీ అలవాటవుతుంది. ఒక మంచి పుస్తకం వారు పూర్తిచేయగలిగితే బుక్ రీడింగ్ హాబిట్ కొనసాగిస్తారు.
7. సహానుభూతి (ఎంపతీ) నేర్చుకుంటారు
మన జీవితం వెలుపల జరిగే సంగతులు ఎన్నో మనకు పుస్తకాలు నేర్పుతాయి. రచయిత కోణంలో నుంచి వారి అనుభవాలను మనం పంచుకుంటాం. అంటే వారి అనుభవాన్ని మనం అనుభూతి చెందుతాం. అంటే ఇతర భావాలాను అర్థం చేసుకోగలగడం, వాటిని పంచుకోగలగడం ఎంపథీ. బుక్ రీడింగ్ వల్ల ఇది సాధ్యమవుతుంది. మన దృక్కోణం వెలుపలి ఆలోచనలను మనం గమనిస్తాం.
8. నిద్ర తీరును మెరుగుపరుస్తుంది..
చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. స్క్రీన్ ముందు అలా కూర్చుండిపోతారు. టీవీ, మొబైల్ నిద్ర లేమి సమస్యలను మరింత పెంచుతాయి. కానీ బుక్ రీడింగ్ వల్ల మీ శరీరానికి ఒక సిగ్నల్ పంపినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కన పడేసి పుస్తకం తెరిస్తే నాలుగు మంచి విషయాలు తెలియడమే కాకుండా ఇది నిదురించే సమయం అని మీ మెదడుకు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. పైగా స్ట్రెస్ తగ్గించే అంశమైనందున మీరు నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది.
9. త్వరగా వృద్దాప్యం దరి చేరకుండా చేస్తుంది
బుక్ రీడింగ్ మీలో గ్రహణ శక్తిని పెంచుతుంది. మీ మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచే ఈ వ్యాపకం అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులను సమీపించకుండా చేస్తుంది.
10. డిప్రెషన్‌ను దూరం చేస్తుంది
చాలా మంది మానసికంగా ఇబ్బందిపడుతున్నప్పుడు ఒంటరితనాన్ని ఫీలవుతుంటారు. ఆ సమయంలో పుస్తకాలు వారికి మంచి నేస్తాలు. పుస్తక పఠనం వారి డిప్రెషన్‌ను ఇట్టే దూరం చేస్తుంది. వారి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అయితే మీ సమస్యను ఎదుర్కోవడానికి టిప్స్ కూడా అందిస్తాయి. అనేక కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.