Afternoon Siesta । మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రమత్తుగా ఉంటుందా? అయితే ఇది మీకోసమే!
28 December 2022, 13:40 IST
- Afternoon Siesta: మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం మంచిదేనా? ఎంత సమయం కునుకు తీయాలి, నిద్రను నివారించే మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
Afternoon Siesta
మనలో చాలా మందికి భోజనం చేసిన తర్వాత మంచిగా నిద్ర వస్తుంది, కానీ ఆ సమయంలో నిద్రపోవాలంటే అందరికీ కుదరదు. ప్రత్యేకించి ఆఫీసులో పనిచేసే వారికి మధ్యాహ్నం వచ్చే నిద్ర ఇబ్బంది పెడుతుంది. ఇంటి నుండి పని చేసే వారికి, చిన్నగా ఒక కునుకు వేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యాహ్నం నిద్రపోవడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మధ్యాహ్నం కునుకు తీస్తే ఆరోగ్యానికి మంచిది, ఇది ఒత్తిడిని తగ్గించి హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. మధుమేహం, PCOD, థైరాయిడ్ సమస్యలు పరిష్కారం అవుతాయని పోషకాహార నిపుణులు చెబుతారు.
అయితే మధ్యాహ్నం నిద్రతో రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది, ఇది అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. రోజులో ఉత్పాదకత తగ్గి, బద్ధకానికి దారితీస్తుంది అనేది మరికొందరి వాదన. ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం నిద్రపోవాలనుకుంటే 20-30 నిమిషాలకు మించి నిద్రపోకూడదని నిపుణులు పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజనం తర్వాత కొంత మగత అనేది ఏర్పడుతుంది. దీనికి ఒక జీవసంబంధమైన కారణం ఉంది, మెదడులోని అడెనోసిన్ అనే రసాయనం ఉత్పత్తి జరగటం వలన నిద్ర కలుగుతుంది. సాధారణంగా దీని ఉత్పత్తి రాత్రివేళ నిద్రకు ముందు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మధ్యాహ్నం సమయంలోనూ దీని ప్రభావం కొంత ఉంటుంది. ఇందుకు మీరు తినే ఆహారం నిద్రమత్తుకు ప్రధాన కారణం.
Ways to beat F మధ్యాహ్నం నిద్రమత్తును వదిలించుకునే మార్గాలు
మీరు మధ్యాహ్నం నిద్ర పోకూడదు అనుకుంటే మీ లంచ్ డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. తద్వారా చురుకుగా ఉండగలుగుతారు.
1. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తినండి
మీకు మధ్యాహ్నం నిద్రమత్తుగా అనిపిస్తే, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తినండి. మీరు మెలకువగా, అప్రమత్తంగా ఉండటానికి చక్కెర లేని పదార్థాలు తీసుకోండి. గుడ్లు, కాయధాన్యాలు, క్వినోవా, కాటేజ్ చీజ్, వేరుశెనగ, బాదం, టోఫు, పచ్చి బఠానీలు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్‌లను మీ భోజనంలో చేర్చుకోండి. రోస్టెడ్ చికెన్, కూరగాయలు, సలాడ్‌లను తినండి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
2. కార్బోహైడ్రేట్లను నివారించండి
చాలా మంది లంచ్‌లో కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా ఉన్నవి ఎక్కువ తింటారు అందుకే నిద్రమత్తు ఆవహిస్తుంది. అన్నం, కూర, పప్పు, బర్గర్‌లు, బిర్యానీలు, దోసెలు, ఇడ్లీలు, సాంబార్, నూడుల్స్, క్రీమ్, సూప్‌లు, కార్న్ స్టార్చ్ ఆధారిత సూప్‌లు , ఫ్రైడ్ స్టార్టర్‌లు, వెజ్ లేదా నాన్ వెజ్ స్టార్టర్లు, పావ్ భాజీ, వడా పావ్, పిజ్జాలు మొదలైనవి మధ్యాహ్నం తింటే నిద్ర ముంచుకొస్తుంది. మనకు మధ్యాహ్నం అన్నం, కూరలు తినడం అలవాటు కాబట్టి నిద్ర రాకుండా తక్కువ తినండి. తేలికైన పదార్థాలు తీసుకోండి.
3. సమృద్ధిగా నీరు తాగండి
మీ శక్తిని పెంచడానికి, మిమ్మల్ని మెలకువగా ఉంచటానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి సమృద్ధిగా నీరు త్రాగడం. నిర్జలీకరణం మీ మానసిక సామర్థ్యాలను మందగిస్తుంది, కాబట్టి మీరు పగటిపూట హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. కాఫీ, టీలు అవసరమే లేదు.
ఇంకా చ్యూయింగ్ గమ్ నమలడం, కొద్దిసేపు తేలికపాటి ఎండలో నడవటం, మ్యూజిక్ వినడం, అందమైన దృశ్యాలు చూడటం మొదలైన చర్యల ద్వారా కూడా మీ నిద్రమబ్బును తరిమేయవచ్చు.