Mayonnaise: బర్గర్లు, పిజ్జాలు మయోనైస్‌తో తింటున్నారా? ఇది మీ ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తుందంటే
14 March 2024, 11:52 IST
- Mayonnaise: ఆధునిక కాలంలో సాండ్‌విచ్‌లు, బర్గర్లు, పిజ్జాలు తినే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిని టమాటో కెచప్‌తో పాటు తెల్లని క్రీములా ఉండే మయోనైస్‌ను కూడా ఇస్తారు. ఇది ఉప్పని రుచిని కలిగి ఉంటుంది. అందుకే పిల్లలు ఇష్టంగా తింటారు.
మయోనైస్‌తో ఆరోగ్య సమస్యలు
Mayonnaise: మయోనైస్ ఇప్పుడు ఎక్కువ మంది తింటున్న పదార్థాలలో ఒకటి. బర్గర్లు, శాండ్‌విచ్‌లు, పిజ్జాలు, మోమోస్ తినేటప్పుడు టమాటో కెచప్‌తో పాటు ఈ మయోనైస్‌ను కూడా సర్వ్ చేస్తున్నారు. ఇది కాస్త ఉప్పగా ఉంటుంది. కాబట్టి ఆహారానికి అదనపు రుచిని ఇస్తుంది. అయితే తెల్లని క్రీములా ఉండే ఈ మయోనైస్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా కీడు జరుగుతుంది. అది తెలియక ఎంతో మంది పిల్లలకు ఈ మయోనైస్‌ను తినిపిస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ తెల్లని క్రీము వల్ల కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ.
మయోనైస్ తింటే అనారోగ్యాలు
ఎవరైతే మయోనైస్ తరచుగా తింటూ ఉంటారో... వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ తెల్లని క్రీము రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తుంది. ఇక డయాబెటిస్ పేషెంట్లు దీన్ని పూర్తిగా తినకూడదు. లేకుంటే వారికి ఆ వ్యాధి ముదిరిపోయే అవకాశం ఉంది.
మయోనైస్ తరచూ తినేవారు త్వరగా బరువు పెరుగుతారు. మయోనైస్‌లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును పెంచుతాయి కూడా. బరువు పెరిగే అవకాశం ఉంది.
మయోనైస్ అధికంగా తినడం వల్ల రక్తపోటు పెరిగిపోతుంది. మయోనైస్ తినేవారిలో గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
యువత త్వరగా గుండె జబ్బులు బారిన పడుతున్నారు. అలాంటివారు మయోనైస్‌కు దూరంగా ఉండాలి. మయానైస్ అధికంగా తినే వారు గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఒక స్పూను మయోనైస్‌లో ఒకటిన్నర గ్రాముల సంతృప్తి కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాలను పెంచేస్తుంది. కాబట్టి గుండె జబ్బుల వ్యాధులు త్వరగా వస్తాయి.
మైగ్రేన్ వంటి తలనొప్పులతో బాధపడే వారు మయోనైస్ తినకూడదు. ఎందుకంటే మయోనైస్‌లో ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉంటాయి. అలాగే కృత్రిమ పదార్థాలను కూడా వినియోగిస్తారు. ఇది తలనొప్పిని కలిగిస్తుంది. బలహీనంగా అనిపించేలా చేస్తుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
బయట మార్కెట్లో దొరికే మయోనైస్ తినడం పూర్తిగా మానేయాలి. మీకు తినాలనిపిస్తే ఇంట్లోనే మయోనైస్ తయారు చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ఉప్పును తక్కువగా వేసుకొని తింటే మంచిది.
టాపిక్