పెరుగు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా? అమెరికా శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?-does yogurt reduce the risk of diabetes what are american scientists saying ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Does Yogurt Reduce The Risk Of Diabetes? What Are American Scientists Saying?

పెరుగు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా? అమెరికా శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

Haritha Chappa HT Telugu
Mar 02, 2024 07:00 PM IST

Diabetes: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ కప్పు పెరుగు తినడం అలవాటు చేసుకోండి చాలు అని చెబుతున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే శక్తి పెరుగుకు ఉంది.

పెరుగు తింటే ఆరోగ్యమా?
పెరుగు తింటే ఆరోగ్యమా? (Photo by Unsplash)

Diabetes: డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. మనదేశంలో కూడా కోట్ల మంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అలాగే అమెరికన్లు అధికంగా డయాబెటిస్ వ్యాధితో మరణిస్తున్నారు. ఆ వ్యాధితో బాధపడుతున్నవారు ఓజెంపిక్ వంటి మందులను వాడుతున్నారు. అయితే ప్రతి రోజూ కప్పు పెరుగు తినడం వల్ల కూడా ఆ వ్యాధి అదుపులో ఉంటుందని చెబుతున్నారు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.

శాస్త్రీయ ఆధారాల ప్రకారం, పెరుగును క్రమం తప్పకుండా తినడం వల్ల… అంటే వారానికి కనీసం రెండు కప్పులు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు కచ్చితంగా పెరుగను తినాలి. పెరుగులో చక్కెర లాంటివి ఏవీ కలుపుకోకుండా తినాలి. కేవలం ఉత్త పెరుగు మాత్రమే తినాలి. ఇలా తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుంది.

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు 2014లో ఇదే అంశంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో కూడా పెరుగు ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. పెరుగు వినియోగం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందనే వాదనకు మద్దతు ఇవ్వడానికి మరో 32 అధ్యయనాలు ఉన్నాయి. అయితే పాల నుంచి తయారయ్యే పెరుగుకే డయాబెటిస్ తగ్గించే శక్తి ఉంటుంది. బాదం, కొబ్బరి, సోయా వంటి పదార్థాలతో చేసే పెరుగు వల్ల మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు.

పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇది ఆహారం జీవక్రియను మెరుగుపరుస్తాయి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా... పొట్టపై సున్నితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలలో సహాయపడుతుంది. పెరుగు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇన్సులిన్ సహాయం లేకుండా రక్తంలో చక్కెర స్థాయిలలో ఇది నియంత్రించగలదు. అందుకే పెరుగు మధుమేహ రోగులకు చాలా మంచిది అని ఎన్నోసార్లు రుజువయింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వాటి నుంచి విడుదలయ్యే శక్తి కూడా నెమ్మదిగా విడుదలవుతుంది. కాబట్టే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ కప్పు పెరుగు తింటే ఇంకా మంచిది.

పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. పెరుగు ఆహారాన్ని జీర్ణం చేసే శక్తిని పెంచుతుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. అందుకే పెరుగును ప్రతిరోజూ తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు పెరుగును కచ్చితంగా తినాల్సిందే.

రోజూ ఎంత పెరుగు తినవచ్చు?

డయాబెటిస్ బారిన పడినవారు ప్రతిరోజూ కప్పు పెరుగును తినవచ్చు. అయితే అందులో చక్కెర గాని, ఇతర తీయని పదార్థాలు ఏవీ కలుపుకోకూడదు. ఉప్పు కూడా కలుపుకోకుండా తినాలి. అప్పుడే పెరుగులోని అన్ని పోషకాలు వారికి అందుతాయి. పెరుగులో ప్రోటీన్లతో పాటు మన శరీరానికి అవసరమైన కొవ్వులు ఉంటాయి. పెరుగు గ్లెసెమిక్ ఇండెక్స్ 28. గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉందంటే ఆ ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉన్నాయని అర్థం. పిండి పదార్థాలు లేని ఆహారం మధుమేహ రోగులకు అంతా మేలే చేస్తుంది. కాబట్టే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలను తినమని చెబుతారు వైద్య నిపుణులు.

WhatsApp channel