Decor ideas to transform your small balcony:బాల్కనీని ఆకర్షణీయంగా అలంకరించడానికి సులభమైన మార్గాలు
08 January 2024, 18:55 IST
decor ideas to transform your small balcony: సాయంత్రం పూట వేడి వేడి టీ, కాఫీలు తాగాలన్నా.. సరదాగా కాసేపు సేదదీరాలన్నా.. బాల్కనీయే గుర్తొస్తుంది. మరి దాన్ని సులభంగా అలంకరించేయండిలా..
బాల్కనీ
గజిబిజిగా గడిపే పట్టణ జీవితాల్లో చిన్న బాల్కనీలు చాలా ప్రశాంతతనిస్తాయి. చాలా మందికి ఇల్లు మొత్తంలో అదే ఇష్టమైన స్థలం కూడా. చిన్నగా ఉన్నా కూడా స్నేహితులు వచ్చినప్పుడు పార్టీలు, పుట్టిన రోజు వేడుకలు కూడా ఇక్కడే చేసుకుంటాం. దాన్ని అందంగా అలంకరించడానికి కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
1. సరైన మెటీరియల్ వాడండి
బాల్కనీలో ఫ్లోరింగ్, గోడలకు వాడే మెటీరియల్ చాలా పెద్ద తేడా తీసుకొస్తుంది. డెక్ వుడ్, కాంక్రీట్ ఫ్లోర్, అలాగే ఫ్లోరింగ్ కోసం మంచి ప్రింట్స్ ఉన్న టైల్స్ వాడటం వల్ల చిన్న స్థలాన్ని కూడా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. గోడలు మరింత అందంగా కనిపించడానికి వాల్‌పేపర్లు లేదా వాల్ టెక్స్చర్ చేయించొచ్చు.
2. ఫ్లూర్ మ్యాట్ లేదా కార్పెట్ వేసి చూడండి
ఇప్పుడు మార్కెట్లో వివిధ థీమ్స్, రంగులు, ఆకర్షణీయమైన ఆకారాల్లో ఫ్లోర్ మ్యాట్లు, కార్పెట్లు దొరుకుతున్నాయి. ఇవి సందర్భానుసారంగా మారిస్తే మీ పార్టీకో, వేడుకకో మంచి లుక్ వస్తుంది.
3. మల్టీపర్పస్ ఫర్నీచర్
ఇపుడు ఒకే వస్తువును అనేక రకాలుగా వాడుకోగలిగే సౌలభ్యం ఉంటోంది. ఉదాహరణకు ఒక సోఫానే బెడ్ లాగా, లేదంటే ఒక డబ్బాలో ఇమిడి పోయినట్టు ఉండే బాల్కనీ కుర్చీలు.. చూడటానికి 4 కుర్చీలు కలిపి పెడితే ఒక చిన్న స్టూల్ లాగా కనిపిస్తాయివి. ఇలాంటి వాటిని మీకు తగినవి చూసి ఎంచుకోండి.
4. కృత్రిమ మొక్కలను వాడకండి
అపార్ట్‌మెంట్‌లో చెట్లు పెంచుకోడానికి సౌకర్యంగా ఉండేది బాల్కనీయే. అందుకే వీలైనన్ని సహజమైన మొక్కలతోనే ఆ ప్రాంతాన్ని అలంకరించండి. గ్రీన్ వాల్స్ కూడా మంచి ఎంపిక. అంటే గోడకు మొత్తం మొక్కలని పెంచే ఒక ఏర్పాటిది. కింద మొక్కలు పెంచితే స్థలాబావం ఉంటుందనుకుంటే పైన హ్యాంగ్ చేసే కుండీలు కూడా చాలా మోడల్స్ దొరుకుతున్నాయి.
5. వీటితో అలంకరించండి..
చూడగానే సాంత్వననిచ్చే ఫోటో ఫ్రేములు, రంగురంగుల కుషన్ కవర్లు, ఏవయినా సామాన్లు ఉంచడానికి ఉపయోగపడే జూట్‌తో చేసిన బాస్కెట్లు.. మీ బాల్కనీ లుక్ పూర్తిగా మార్చేస్తాయని గుర్తుంచుకోండి.
6. రిక్లైనర్ లేదా ఊయల
సేదదీరడమంటే చేతిలో కప్పు కాఫీ పట్టుకుని ఊయల్లో ఊగడమే. ఆహా ఈ ఊహ ఎంత బాగుందో కదా. మరింకేం.. వెంటనే మీ స్థలంలో సరిపోయే చిన్న రిక్లైనర్ గానీ, లేదంటే కాస్త ట్రెండీగా ఉండే ఊయలనైనా తెచ్చేసుకోండి. ఊహల్లో తేలిపోయే స్వర్గం మీ ఇంట్లో సిద్ధం అయినట్టే.
7. విద్యుత్ దీపాలతో అలంకరించండి
లైట్ల వెలుతురులో ఏదయినా అందంగా, కళ్లకు ఇంపుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనసుకు ఏదో వేడుక చేసుకుంటున్న అనుభూతి కలుగుతుంది. మీ బాల్కనీలో కూడా అలాంటి ఏర్పాటు చేసుకోండి. చిన్న లైట్ల వరసను గోడల చుట్టూ, అలాగే కాస్త పెద్ద సైజు ల్యాంపులను అక్కడక్కడా పెట్టండి. ఇంకేం.. స్నేహితులతో నైట్ పార్టీ చేసుకోవచ్చక్కడ.
టాపిక్