Duck Walk Exercise। బాతు నడక నడవండి.. ఈ మిలిటరీ వ్యాయామంతో కలిగే ప్రయోజనాలు గొప్పవి!
08 August 2023, 10:09 IST
- Duck Walk Exercise: డక్ వాకింగ్ గురించి తెలుసా? ఈ డక్ వాకింగ్ అనేది ఒక మిలిటరీ వ్యాయామం, దీని ప్రయోజనాలను ఈ క్రింద తెలుసుకోండి.
Duck Walk Exercise
Duck Walk Exercise: ఫిట్‌నెస్ కాపాడుకోడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనకు అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అందులో కొన్ని వ్యాయామాలు వివిధ జీవులు, జంతువుల పేర్లతో ఉన్నాయి. ఉదాహారణకు కోబ్రా పోజ్ అనేది యోగాలో ఉన్నటువంటి కండరాలను సాగదీసే ఆసనం, అలాగే డౌన్ వార్డ్ డాగ్ పోజ్, కౌ పోజ్ వంటివి మీరు వినే ఉంటారు. వీటితో పాటు టైగర్ పుష్-అప్‌లు, బేర్ క్రాలింగ్, స్పైడర్ కర్ల్స్ అనే వ్యాయామాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆయా జీవుల కదలికలను పోలినట్లుగా ఉండే వర్కవుట్‌లు. ఒక్కో రకమైన వ్యాయామం నిర్ధిష్ట ప్రయోజనాలను అందిస్తుంది.
ఇలాంటిదే మరొకటి డక్ వాక్ వ్యాయామం. మీకు ఈ డక్ వాకింగ్ గురించి తెలుసా? ఈ డక్ వాకింగ్ అనేది బాతు నడకను పోలి ఉన్నటువంటి నడక. ఈ వ్యాయామం చేసేటపుడు చాలా వినోదభరితంగా ఉంటుంది, అయినప్పటికీ కష్టంగానే ఉంటుంది. కానీ బాతు నడకతో మీకు బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. డక్ వాకింగ్ ఎలా చేయాలి, దీని వలన కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
డక్ వాక్ వ్యాయామం ఎలా చేయాలి?
మీకు స్క్వాట్స్ చేయడం తెలిసి ఉంటుంది, అదే పొజిషన్ లో ముందుకు కదలడం డక్ వాక్ అవుతుంది. గుంజీలు తీస్తున్నట్లుగా కూర్చోవాలి. మీ రెండు చేతులను కలిపి పట్టుకోండి. ఆపై అలాగే కూర్చొని ముందుకు నడుస్తూ ఉండండి. కొద్దిసేపు ముందుకు అలాగే కొద్దిసేపు వెనక్కి నడవాలి. డక్ వాక్ ఒక మిలిటరీ వ్యాయామం, దీని ప్రయోజనాలను ఈ క్రింద తెలుసుకోండి.
దిగువ శరీర కదలికను మెరుగుపరుస్తుంది
డక్ నడకలు, మీకు మంచి ఫిటి నెస్ శిక్షణ, ఇది మీ దిగువ శరీర కదలికను మెరుగుపరుస్తుంది. మీ చీలమండలు, మోకాళ్లను సాగదీస్తుంది. దిగువ కండరాలను సక్రియం చేస్తుంది, అలాగే మీ తుంటి భాగాన్ని విస్తరిస్తుంది.
మెరుగైన శక్తి
మీ శరీర భంగిమను మెరుగు పరుస్తుంది. మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. మీరు ఎక్కువ దూరం, వేగంగా పరుగెత్తడానికి ఈ డక్ వాక్ వ్యామాలు చేస్తుండాలి. ఇది మీ అథ్లెటిక్ పనితీరును మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉండవచ్చు.
దిగువ కండరాలు బలోపేతం చేస్తుంది
డక్ వాకింగ్ మీ తొడ కండారాలు, కాళ్లు, చీలమండల కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది మీ నడకను, పరుగును మెరుగుపరుస్తుంది. మీ దిగువ శరీరానికి ఫ్లెక్సిబిలిటీని, సమతుల్యతను అందిస్తుంది.
గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది
గర్భిణీ స్త్రీలు ఒకరి సహాయంతో డక్ వాక్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వారిలో వెన్నునొప్పిని నివారిస్తుంది, వారిలో శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. అయితే గర్భిణీలు ఏ వ్యాయామాలు చేయాలనుకున్నా ముందుగా వైద్యుల సలహా, నిపుణులు లేదా సహాయకుల పర్యవేక్షణ అవసరం.