Moon Milk At Night : రాత్రి నిద్ర సరిగా పట్టడం లేదా? ఈ పాలు తాగితే సమస్య ఉండదు
23 February 2024, 20:00 IST
- Moon Milk Benefits : రాత్రి నిద్ర సరిగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే సమస్యలు చాలా ఎదుర్కోవలసి వస్తుంది. రాత్రి పడుకునేముందు మూన్ మిల్క్ తాగితే హాయిగా నిద్రపడుతుంది.
నిద్ర సమస్యలకు మూన్ మిల్క్
శరీరం ఆరోగ్యంగా పనిచేయాలంటే మంచి రాత్రి నిద్ర అవసరం. గాఢ నిద్రను పొందినప్పుడు మాత్రమే మీ శరీరం, మనస్సు సజావుగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది రాత్రిపూట నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రపోవడానికి ప్రధాన కారణాలలో ఒత్తిడి ఒకటి.
నేటి వేగవంతమైన ప్రపంచంలో చాలామంది తమకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతున్నారు. డిప్రెషన్‌తో బాధపడేవారు రాత్రిపూట నిద్రపోలేరు. ఇలా సరైన నిద్ర లేకపోతే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా నిద్ర సరిగా రాకపోతే ముందుగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు.
రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే వెంటనే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. నిద్ర సమస్యను నయం చేయడంలో మీకు సహాయపడే అద్భుతమైన మిల్క్ రెసిపీని ఉంది. దానిని మూన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. ఈ పాలను అశ్వగంధ, జాజికాయ, పసుపు మొదలైన వాటితో తయారుచేస్తారు.
ఈ పదార్థాలు శరీరం, మనస్సును విశ్రాంతి తీసుకునేలా చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. ఈ పాలను ఎలా తయారుచేయాలో, మంచి నిద్రకు ఈ పాలు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం..
మూన్ మిల్క్ చేసేందుకు కావాల్సిన పదార్థాలు
పాలు – 1 టంబ్లర్, అశ్వగంధ పొడి – 1/2 tsp, * పసుపు పొడి – 1/2 tsp, జాజికాయ పొడి – చిటికెడు
మూన్ మిల్క్ తయారీ విధానం
ముందుగా గిన్నెలో పాలు పోసి తక్కువ మంట మీద వేడి చేయాలి.
తర్వాత అందులో అశ్వగంధ పొడి, పసుపు, జాజికాయ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి 5-10 నిమిషాలు నాననివ్వాలి.
ఆ తర్వాత రుచికి తగినట్లు తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి.
మూన్ మిల్క్ ఉపయోగాలు
పాలలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. పాలలో ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అశ్వగంధ ఔషధ గుణాలు కలిగిన మూలిక. ఇది ఆయుర్వేదంలో అనేక సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ప్రధానంగా, అశ్వగంధ ఒత్తిడి, ఆందోళనతో పోరాడటానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర బలాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. పసుపు కూడా కార్మినేటివ్ ప్రభావాలను కలిగి ఉన్నందున, ఇది జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
జాజికాయ మన శరీరానికి మత్తుమందుగా పనిచేసే అడాప్టోజెన్. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, శరీరానికి విశ్రాంతిని, ప్రశాంతమైన నిద్రను పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది.
నిద్ర సరిగా ఉంటేనే మెుత్తం ఆరోగ్యం బాగుంటుంది. సరైన నిద్రలేకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి. రోజూ 8 గంటల నిద్ర అవసరం. ఒకే సమయంలో పడుకుని.. ఒకే సమయంలో నిద్రలేస్తే నిద్ర చక్రం బాగుంటుంది.