Wastage usage: కిచెన్‌లో మిగిలే చెత్త కాదివి, వాడేందుకు ఉత్తమ మార్గాలివే
29 October 2024, 12:30 IST
Wastage usage: కిచెన్‌లో మిగిలిపోయిన కొన్ని పదార్థాలను, తొక్కలను అనేక రకాలుగా వాడొచ్చు. వాటితో ఉత్తమ ఫలితాలను పొందొచ్చు. ఎలాంటి కిచెన్ వేస్ట్‌ను ఎలాంటి అవసరానికి వాడాలో తెల్సుకోండి.
కిచెన్ వృథాను వాడే మార్గాలు
కిచెన్‌లో వంట పూర్తయ్యాక కూరగాయల పొట్టు,గింజలు, పండ్ల తొక్కలు చెత్తలో పడేస్తాం. అలాగే కొన్ని వస్తువులు ఒకసారి వాడి మళ్లీ వాడుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకోం. అలా కిచెన్‌లో మిగిలిప్యే వృథాను ఉపయోగకరంగా ఎలా వాడుకోవాలో తెల్సుకోండి.
1. పైనాపిల్ తిన్నతర్వాత పైన ఆకుపచ్చ భాగం పడేయకుండా నేలలో పాతితే ఇంట్లోనే పైనాపిల్ చెట్టు పెరుగుతుంది.
2. అరటిపండు తొక్కను అలాగే పడేయకుండా చెట్ల వేర్ల దగ్గర వేస్తే మొక్కలకు ఎరువులాగా ఉపయోగపడతాయి. లేదా ఆ తొక్కల్ని రెండు మూడు రోజులు నీళ్లలో నానబెట్టి మొక్కలకు చల్లొచ్చు. క్రిమీ సంహారిణిగా, ఎరువుగా పనికొస్తుంది.
3. పుచ్చకాయ ముక్కలు కట్ చేశాక మిగిలిన ఆకుపచ్చ భాగాన్ని ముఖానికి రాసుకుంటే యాక్నె సమస్య తగ్గుతుంది. ముఖంలో మెరుపు పెరుగుతుంది.
4. నారింజ తొక్కల్ని అలాగే పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి ముఖానికి రాసుకోవచ్చు. లేదా మొక్కలకు ఎరువులాగానూ పొడి చేసి వేయొచ్చు.
5. రెండు మూడు బ్రెడ్ స్లైసులు తినకుండా అలాగే ఉండిపోతే వాటిని పొడి చేసి పెట్టుకోండి. కట్‌లెట్లు, చికెన్ వింగ్స్ లాంటివి చేస్తున్నప్పుడు కరకరలాడే కోటింగ్ లాగా వాడొచ్చు. బ్రెడ్ క్రంబ్స్ ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం ఉండదు.
6. యాపిల్ తిన్నాక తొక్కను కళ్లకింద రుద్దుకుంటే నల్లటి వలయాలు తగ్గుతాయి. అల్యూమినియం పాత్రల మీద మరకలుంటే ఈ తొక్కతో రుద్ది చూడండి. వెంటనే జిడ్డు వదులుతుంది.
7. ఎండ వల్ల కమిలిపోయిన చర్మం మీద బంగాళదుంప తొక్కను రుద్దితే చల్లగా, ఉపశమనంగా అనిపిస్తుంది. ఈ తొక్కలను నూనెలో వేయించి ఉప్పు కారం చల్లుకుని తింటే రుచికరమైన చిప్స్ రెడీ అవుతాయి. ఈ ఆలూ పీల్ చిప్స్ ఒక్కసారైనా ట్రూ చేయండి. ఓవెన్ ఉంటే కాస్త నూనె చల్లి ఓవెన్ లో పెట్టి ఉప్పు, మిరియాలపొడి, చీజ్ వేసుకుని తినొచ్చు.
8. గుడ్డు పెంకుల్నిపొడి చేసి మొక్కలను మంచి ఎరువుగా వాడొచ్చు.
9. మెంతికూర, కొత్తిమీర, ఆరిగానో, మునగాకు లాంటివి తాజాగా తెచ్చుకున్నవి మిగిలిపోతే వాటిని ఎండబెట్టి పొడిచేసి భద్రపర్చుకోండి. చాలా వంటల్లో వాడుకోవచ్చు.
10. నిమ్మకాయలు పాడయిపోతాయి అనిపిస్తే రసం పిండేసి ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు ఆ నిమ్మరసం క్యూబుల్ని వంటల్లోకి వాడుకోవచ్చు.
11. అల్లం కూరల్లో వాడటానికి పైన తొక్క తీసేస్తాం. ఆ తొక్కను నీళ్లలో వేసి మరిగిస్తే మంచి అల్లం టీ రెడీ అవుతుంది. దాంట్లోనూ అనేక పోషక విలువలుంటాయి.