Coconut Husk: కొబ్బరి పీచు పడేయకండి, ఎన్ని రకాలుగా పనికొస్తుందో చూడండి
11 October 2024, 12:30 IST
Coconut Husk: కొబ్బరి కొట్టిన తర్వాత దాని పీచును పడేస్తారు. కానీ ఈ తొక్కలు మన పనులను కొన్నింటిని సులభతరం చేస్తాయని మీకు తెలుసా? వాటిని ఎలా వాడాలో చూడండి.
కొబ్బరి పీచు ఉపయోగాలు
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ ఫుడ్స్ లో కొబ్బరి ఒకటి. దీన్ని అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకుంటాం. కొబ్బరినీళ్లు, కొబ్బరి చట్నీ, కొబ్బరి తురుమును.. ఇలా అనేక రూపాల్లో ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో, దాని తొక్క కూడా మన దైనందిన పనులకు అలాగే ఉపయోగపడుతుంది.
ఈసారి కొబ్బరికాయ పీచు తీశాక పడేయకండి. దాన్ని జాగ్రత్తచేస్తే రకరకాలుగా వాడుకోచ్చు. రోజూవారీ పనుల కోసం కొబ్బరి పీచు ఎలా వాడాలో చూడండి.
స్క్రబ్బర్‌గా:
కొబ్బరి పీచును పాత్రలు కడగడానికి స్క్రబ్బర్ గా ఉపయోగించవచ్చు. పాత్రలు కడిగే సబ్బులో స్క్రబ్బర్ పెడతాం కదా. బదులుగా ఈ పీచు కాస్త తీసి పెట్టండి. దాంతో పాత్రలు కొత్తగా మెరుస్తాయి. పాతకాలంలో దీన్నే వాడేవారు. అడుగు అంటిన, మాడిపోయిన పాత్రలు కూడా కొబ్బరి పీచుతో సులువుగా శుభ్రం అవుతాయి.
ఎరువు:
కొబ్బరి తొక్కల నుండి నేల సారం పెంచే ఎరువును తయారు చేయొచ్చు. దాన్ని మీ కిచెన్ గార్డెన్లో ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడానికి మొదట కొబ్బరి పీచును కనీసం నాలుగైదు రోజులు విడివిడిగా చేసి ఎండలో ఆరబెట్టాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి పొడి చేయాలి. దీన్ని ఒక గిన్నెలోకి ఈ పొడిని తీసుకుని అందులో నీళ్లు పోసి ఓ రెండు గంటల పాటూ ఉంచాలి. తర్వాత కాస్త పిండేసి మొక్కల వేర్ల దగ్గర వేయాలి. అంతే.. ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది.
కలర్ బ్రష్:
జుట్టుకు సహజ సిద్ధ నలుపు రంగు కోసం కొబ్బరి పీచు వాడొచ్చు. కొబ్బరి పీచు నుంచి హెయిర్ కలర్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం ముందుగా కొబ్బరి పీచును పాన్ లో వేసి అవి మాడిపోయే వరకు వేపాలి. ఇప్పుడు వాటిని మిక్సీ గ్రైండర్ లో గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన పొడిలో కొద్దిగా కొబ్బరినూనె, కొద్దిగా ఆవనూనె కలపాలి. ఈ విధంగా మీ నేచురల్ హెయిర్ కలర్ రెడీ అవుతుంది, దీనిని మీరు మీ జుట్టుకు అప్లై చేయవచ్చు.
కిచెన్ శుభ్రత:
కిచెన్ స్లాబ్ మీద, వెనకాల టైల్స్ మీద పేరుకున్న మురికిని శుభ్రం చేయడానికి కూడా కొబ్బరి పీచు ఉపయోగించవచ్చు. దీని కోసం స్లాబ్ మీద కాస్త నీళ్లు, కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. తరువాత పీచుతో రుద్దితే స్లాబ్ శుభ్రం అవుతుంది. నూనె, మసాలా గ్రేవీల మొండి మరకలు కూడా సులభంగా తొలగిపోతాయి.
సింక్:
కిచెన్ సింక్ చాలా మురికిగా ఉంటుంది. దాన్ని శుభ్రం చేయడం కోసం పీచు వాడారంటే పని చాలా సులువవుతుంది. పీచులో కాస్త గట్టిగా ఉండే భాగాలన్నీ తీసేయండి. పీచు మాత్రం కాస్త వదులుగా చేసి కాస్త దగ్గరగా తాడుతో కట్టేయండి. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ మధ్యలో రంధ్రం చేసి పీచుకు కట్టిన తాడు ఆ రంధ్రం నుంచి బయటకు తీయండి. క్యాప్ పట్టుకుని సింక్ సులువుగా శుభ్రం చేయొచ్చు.