Natural Fertilizers: మొక్కలను ఆరోగ్యంగా ఉంచే సహజ ఎరువులు.. ఇంట్లోనే సిద్దం..
Natural Fertilizers: మొక్కలు ఎదుగుదల కోసం రకరకాల కృత్రిమ ఎరువులు వేస్తుంటాం. బదులుగా ఇంట్లోనే సహజ ఎరువు సులభంగా ఎలా చేసుకోవచ్చో చూసేయండి.
ఇటీవల కాలంలో చాలా మంది గార్డెనింగ్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. పచ్చని మొక్కలు పంచే ఆనందానికి ఫిదా అవుతున్నారు. తమకు తాము కూరగాయలు, ఆకు కూరల్లాంటివి పండించుకుని తినడంలో ఉన్న సంతృప్తిని అనుభవిస్తున్నారు. ప్రతిదీ వ్యాపార దృక్ఫథానికి అనుగుణంగా మారిన ఈ రోజుల్లో బయట దొరికేవి చాలా వరకు కల్తీ ఆహారాలు. లేదంటే పురుగుమందులు లాంటివి చల్లి పెంచిన ప్రమాదకరమైన ఆహారాలు.
అందుకనే ఇలాంటి వాటిపై ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది. ఫలితంగా ఇంటి దగ్గర చిన్న చోటు ఉన్న ఏవో ఒకటి పెంచుకుంటున్నారు. అయితే చాలా మంది మొక్కల్ని పాతి నీరు పోస్తూ ఉంటే చాలు.. అవే ఆరోగ్యంగా పెరిగిపోవాలని అనుకుంటారు. అయితే మనం జీవించడానికి పోషకాలు నిండిన ఆహారం, నీరు ఎలా అవసరమో వాటికీ అంతే. మనకు అనారోగ్యం వస్తే మందులు ఎలా వేసుకుంటామో వాటికీ అంతే. కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడకుండా వీటిని ఇంట్లో ఆరోగ్యంగా పెంచుకోవడానికి సహజమైన ఫెర్టిలైజర్లు కచ్చితంగా అవసరమే. వాటిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం
ఎన్‌పీకే :
మొక్కలు పెంచుకునే వారికి ఎవరికి అయినా సరే ఎన్‌పీకే మీద అవగాహన ఉండాలి. ఎన్‌పీకేలో ఎన్ అంటే నైట్రోజన్, పీ అంటే పాస్ఫరస్, కే అంటే పొటాషియం. వీటిలో నైట్రోజన్ వల్ల మొక్క ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి. అది గుబురుగా ఆకులు తొడిగి ఉంటుంది. పాస్ఫరస్ వల్ల వేళ్లు బలంగా తయారై మెరుగ్గా పోషకాల్ని నేల నుంచి లాక్కుని మొక్కకు అందిస్తాయి. అలాగే పొటాషియం పూలు, కాయలు రావడానికి పని చేస్తుంది. మొక్క మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సహజ ఎరువులు ఏవంటే:
మాంసం, చేపలు తదితరాలు కడిగిన నీటిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకల పొడి(బోన్ మీల్), గుడ్డు పెంకుల పొడి తదితరాల్లో పాస్ఫరస్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే అరటి పండు తొక్కల్లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి వీటిని పొడి చేసి వేయడం గాని, నీటిలో రెండు రోజులు ఊరనిచ్చి ఆ నీరు పోయడం వల్ల గాని మొక్కలకు పొటాషియం లభిస్తుంది. పూలు, కాయల కాపు బాగుంటుంది.
ఇంట్లోనే ఎరువు తయారీ:
చాలా సులభంగా అయిపోయే ఎరువు తయారీ ఇప్పుడు చూద్దాం. మనం వంటింట్లో కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు వచ్చే అనవసర వ్యర్థాలు, పండ్లు తిన్నప్పుడు వచ్చే తొక్కల్లాంటి వాటిని ఓ బకెట్‌లో వేసి నీరు పోయండి. మరుసటి రోజు ఆ తొక్కల్ని బాగా పిసికి వడగట్టండి. ఆ నీటిని మొక్కలకు పోయండి. ఎంత పచ్చగా, ఆరోగ్యంగా అవి పెరుగుతాయో మీరే చూడండి.
టాపిక్