Foods On Empty Stomach | ఉదయాన్నే నిమ్మకాయ నీరు, తేనె కలుపుకొని తాగకూడదు, ఎందుకంటే?!
31 May 2023, 9:12 IST
- Foods To Avoid On Empty Stomach: చాలా మంది ఖాళీ కడుపుతో ఏదైనా పానీయం తాగటం లేదా తినటం చేస్తుంటారు. మీరు ఖాళీ కడుపుతో తీసుకోకూడని పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.
honey lemon water on empty stomach
Foods To Avoid On Empty Stomach: ప్రతిరోజూ ఉదయం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు రాత్రంతా నిద్రలో ఉపవాసం ఉన్నట్లే, ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత మీ జీవక్రియలు సక్రమంగా జరగాలంటే శక్తి అవసరం అవుతుంది. ఆ శక్తి మీరు చేసే అల్పాహారంతో వస్తుంది. అల్పాహారం అనేది రోజులో మీరు చేసే మొదటి భోజనం. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఖాళీ కడుపుతో తింటున్నారా లేదా అంతకు ముందు ఏదైనా తీసుకున్నారా అనేది కూడా ముఖ్యమే.
చాలా మంది అల్పాహారం కంటే ముందు, నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఏదైనా పానీయం తాగటం లేదా తినటం చేస్తుంటారు. అవి తమ ఆరోగ్యాన్ని పెంచుతాయని భావించవచ్చు. అయితే అందులో కొన్ని తీసుకోకూడనివి కూడా ఉంటాయి. మీరు ఖాళీ కడుపుతో తీసుకోకూడని పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.
నిమ్మకాయ నీరు- తేనె
మీరు చదివింది నిజమే. చాలా మంది ఉదయం లేవగానే పరిగడుపున నిమ్మకాయ నీటిలో తేనే కలుపుకొని తాగుతారు. ఇది చాలా మంచిదని వారు భావిస్తారు. ముఖ్యంగా ఇది కొవ్వును కరిగించడంలో, అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుందని భావించి చాలా మంది దీనిని తీసుకుంటారు. అయితే తేనెలో చక్కెర కంటే ఎక్కువ కేలరీలు ఎక్కువ ఉంటాయని మీకు తెలుసా? తేనే గ్లైసెమిక్ ఇండెక్స్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజుల్లో ఎటువంటి సంకలనాలు లేని స్వచ్ఛమైన తేనె దొరకడం కష్టంగా మారింది. చాలా మంది తేనె పేరుతో చక్కెర, రైస్ సిరప్‌ను కలిపి కల్తీ చేస్తున్నారు. ఇదే స్వచ్ఛమైన తేనేగా భావించి చాలా మంది తీసుకుంటారు. కానీ, ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఫలితంగా రోజంతా ఎక్కువ ఆకలి కోరికలు ఉంటాయి. మీరు అనుకున్న ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి.
పండ్లు
పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే. అయితే పండ్లను ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. ముఖ్యంగా ఉదయం పూట ఒక గిన్నెలో పండ్లను తినడం మంచి అలవాటు అని అనుకుంటాము, కానీ పొషకాహార నిపుణులు కేవలం పండ్లు మాత్రమే తినడం మంచి అలవాటు కాదంటున్నారు. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే పండ్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇలా చేస్తే గంటలోనే ఆకలి వేస్తుంది. అలాగే కొన్ని సిట్రస్ పండ్లు ఖాళీ కడుపుతో తింటే కూడా ఎసిడిటీకి దారి తీస్తుంది అని చెబుతున్నారు.
టీ లేదా కాఫీ
చాలా మంది దినచర్య ఒక కప్పు టీ లేదా కాఫీతో మొదలవుతుంది. కానీ, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఏర్పడతాయి మరియు అది మీ పొట్టను కలవరపెడుతుంది , జీర్ణ సమస్యలను సృష్టిస్తుంది.
తియ్యని అల్పాహారం
చాలా మంది ఉదయం పూట బ్రెడ్- జాంతో తమ అల్పాహారాన్ని ముగిస్తారు. కానీఉదయం పూట తియ్యదనంతో కూడిన అల్పాహారం చేస్తే, మీ మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి, అలాగే త్వరగా పడిపోతాయి. దీని వలన మీకు శక్తి తక్కువగా ఉంటుంది, మీ శరీరం కార్బోహైడ్రేట్ల కోసం మరింత ఆరాటపడుతుంది. కాబట్టి తియ్యటి అల్పాహారానికి బదులు ఏదైనా బలమైన రుచికరమైన అల్పాహారం చేయడం శ్రేయస్కరం.
రోజులో మీ మొదటి భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వుతోలు తీసుకోండి. గింజలు, విత్తనాలు, అవకాడో, నెయ్యి వంటి వాటిలో మంచి కొవ్వులు ఉంటాయి, అలాగే ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది, రోజంతా అనవసరపు ఆకలి కోరికలను తగ్గిస్తుంది.