Sunscreen Lotion: సన్‌స్క్రీన్ లోషన్ రోజూ రాస్తే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
22 August 2024, 12:30 IST
- Sunscreen Lotion: సన్‌స్క్రీన్ లోషన్ అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడేందుకు ముఖానికి, చేతులకు రాసుకుంటారు. అయితే ఆ సన్‌స్క్రీన్ లోషన్ చర్మ క్యాన్సర్‌కు స్వయంగా కారణమవుతుందనే వాదన ఉంది. దీనిపై పరిశోధకులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
సన్ స్క్రీన్ లోషన్లతో క్యాన్సర్ ప్రమాదం?
Sunscreen Lotion: సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడానికి ప్రధాన కారణం క్యాన్సర్ బారిన పడకుండా చర్మాన్ని రక్షించుకోవడం. సూర్యకిరణాల నుంచి వచ్చే అతనీలలోహిత కిరణాలు చర్మంపై పడి ఆ రేడియేషన్‌కు కొందరిలో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు యూవీ రేడియేషన్ నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేస్తూ ఉంటారు. అయితే స్వయంగా సన్‌స్క్రీన్ లోషన్ రాయడం వల్లే చర్మకాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే వాదన కూడా ఉంది. దీనిపై పరిశోధకులు వివరణ ఇస్తున్నారు.
బెంజీన్‌తో క్యాన్సర్
బెంజీన్ అనేది ఒక రసాయనం ఇది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సన్‌స్క్రీన్ లోషన్లో ఈ బెంజీన్ రసాయనాన్ని వాడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అందుకే కొంతమంది సన్‌స్క్రీన్ లోషన్ రాసుకునేందుకు కూడా భయపడుతున్నారు.
ఇటీవల అధ్యయనాల ప్రకారం కొన్ని సన్‌స్క్రీన్ లోషన్లలో రసాయనాల వాడకం జరుగుతోందని తేలింది. ముఖ్యంగా బెంజీన్‌ను అధికంగా వాడుతున్నట్టు తెలుస్తోంది. బెంజీన్ అనేది క్యాన్సర్ కారకంగా ఉంది. అయితే సన్‌స్క్రీన్ లోషన్లలో బెంజీన్ ఎంత మొత్తంలో వాడుతున్నారన్నదానిపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ బెంజీన్ ఎంత చర్మం ద్వారా శోషణకు గురవుతుందో కూడా తెలియడం లేదు. కాబట్టి బెంజీన్ లేని సన్‌స్క్రీన్ లోషన్లను వెతికి కొనుక్కోవడం మంచిది. లేదా SPF30 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా సన్‌స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం ఉత్తమం. కొన్ని సన్‌స్క్రీన్ లోషన్లలో బెంజిన్ చాలా తక్కువ సాంద్రతలో వినియోగిస్తున్నారు. అలాంటి వాటి వల్ల కూడా ప్రమాదం ఉండకపోవచ్చు అన్నది పరిశోధకుల అభిప్రాయం. ఇప్పటికీ సన్‌స్క్రీన్ లోషన్లపై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి చర్మ క్యాన్సర్ రాకుండా ఎంత భద్రతను కల్పిస్తాయి అనే అంశాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి.
సన్‌స్క్రీన్ లోషన్ ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిత్యం ఎండల్లో తిరిగేవారు, సూర్యకాంతిలో ఉండే యువి రేడియేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎక్కువ కాలం పాటు రేడియేషన్‌కు గురైతే చర్మం క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎండలో తిరిగేవారు సన్‌స్క్రీన్ లోషన్ రాయాల్సిన అవసరం ఉంది.
ఎలాంటి సన్‌స్క్రీన్ లోషన్ కొనాలి?
సన్ స్క్రీన్ లోషన్లను కొనే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్.. దీన్నే షార్ట్‌కట్‌లో SPF30 అని పిలుస్తారు. SPF30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అవి రేడియేషన్ నుండి అత్యుత్తమ రక్షణను కల్పిస్తాయని చెబుతారు. చర్మకాన్సర్‌ను నిరోధించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తాయని అంటారు. SPF30 లోపు విలువ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను వాడితే చర్మక్యాన్సర్ నుండి తగినంత రక్షణ లభించకపోవచ్చు. మీరు సన్ స్క్రీన్ లోషన్లను కొనేటప్పుడు UVA లేదా UVB రేడియేషన్ నుండి రక్షించే వాటి కోసం వెతకండి. టైటానియం డయాక్సైడ్ లేదా జింక్ ఆక్సైడ్ వంటి వాటితో తయారుచేసిన సన్‌స్క్రీన్ లోషన్లను కొనేందుకు ప్రయత్నించండి.