AC and Health: రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి నిద్రపోతున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
17 April 2024, 13:20 IST
- AC and Health: వేసవిలో ఎండలు పెరిగిపోయాయి. దీనివల్ల వేడికి తట్టుకోలేక అందరూ ఏసీలను వేసుకొని నిద్రపోతున్నారు. ఇలా ప్రతిరాత్రి ఏసీలలో ఉండడంవల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.
ఎయిర్ కండిషనర్
AC and Health: వేడి గాలుల ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఏసీలు, కూలింగ్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. రాత్రంతా ఎక్కువ మంది ఎయిర్ కండిషనర్లపైనే ఆధారపడుతున్నారు. ఏసీలు ఉంటేనే నిద్రపోయే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే రాత్రంతా ఏసీ ఆన్ లో ఉంచుకొని నిద్ర పోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చెబుతున్నారు నిపుణులు. ఎయిర్ కండిషన్ ఆన్ లో ఉంచుకొని నిద్రపోవడం వల్ల చల్లగా ఉంటుంది. ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. దీనివల్ల హాయిగా నిద్ర పడుతుంది. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మాత్రం వచ్చే అవకాశం ఉంది.
ఏసీ ఆన్‌లో ఉంచుకొని ఆ గదిలోనే ఎక్కువ గంటల పాటు ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి చల్లని గాలికి ఉబ్బసం, అలెర్జీలు వంటివి రావచ్చు. ఏసీ ఉత్పత్తి చేసే చల్లటి గాలి శ్వాసకోశాన్ని ఇబ్బంది పెడుతుంది. దగ్గు, గురక, ఛాతీ బిగుతుగా మారడం, శ్వాస ఆడక పోవడం వంటి లక్షణాలు కలుగుతాయి. అందరికీ ఈ లక్షణాలు కలగాలని లేదు, కానీ శ్వాసకోశ వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి మాత్రం ఈ లక్షణాలు రావచ్చు. అలాగే గాలిలో కాలుష్యకారకాలు కూడా ఉండవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలి. అంటే ఏసీ ఉష్ణోగ్రత మరీ తక్కువగా లేకుండా చూసుకోవాలి. 25 కన్నా తగ్గించి పెట్టుకోకపోవడమే మంచిది. అలాగే ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాల్సిన అవసరం ఉంది.
ఏసీలో ఉంటే వచ్చే సమస్యలు
ఏసీ ఆన్‌లో ఉంచి గదిలో పడుకోవడం వల్ల తేమ స్థాయిలు తగ్గిపోతాయి. ఇవి చర్మం, కళ్ళను ఇబ్బంది పెడతాయి. చర్మం కళ్ళు పొడిబారే అవకాశం ఉంది. ఏసీ ఉత్పత్తి చేసే చల్లని గాలి చర్మం నుండి తేమను తొలగించేస్తుంది. దీని వల్ల చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. పొడిగాలికి ఎక్కువసేపు చర్మం బహిర్గతం కావడం వల్ల కళ్ళకు అసౌకర్యం అనిపిస్తాయి. కళ్ళు ఎరుపెక్కడం, దురద పెట్టడం దృష్ట్యా స్పష్టంగా మారడం కూడా జరగవచ్చు. పొడి చర్మం ఉన్నవారు ఏసీలో ఎక్కువసేపు ఉండకపోవడమే మంచిది. కళ్ళల్లో లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వేసుకోవడం కూడా ఉత్తమం.
ఏసీ ఆన్ లో ఉంచి చల్లని గదిలో పడుకోవడం వల్ల కండరాల దృఢత్వం పెరిగిపోతుంది. తద్వారా కీళ్ల నొప్పులు పెరిగిపోతాయి. ప్రత్యేకించి శరీరం ఎక్కువ కాలం పాటు చల్లని ఉష్ణోగ్రతలకు ఉండడంవల్ల కండరాలు సంకోచించి బిగుతుగా మారుతాయి. ఇవి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలు పెరిగిపోతాయి.
వేడి వాతావరణంలో ఉన్న వారితో పోలిస్తే ఎక్కువ గంటల పాటు ఏసీలో ఉన్న వారికి రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. వీరిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే చల్లని గాలి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనంగా మారుస్తుంది. అందుకే వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. రక్తనాళాలు కూడా సంకోచిస్తాయి. వ్యాధికారక వైరస్‌లను నిరోధించే శక్తి శరీరానికి తగ్గిపోతుంది.
ఏసీ ఆన్ లో ఉన్న గదిలో ఎక్కువ గంటల పాటు ఉండటం వల్ల నిద్ర కూడా సరిగా పట్టకపోవచ్చు. నిద్రా నాణ్యత తగ్గిపోతుంది. రాత్రి సమయంలో పదే పదే మెలకువ వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతమైన నిద్ర కోసం ఏసీ ఉష్ణోగ్రతలను మరీ చల్లగా పెట్టుకోకూడదు. 25కు తగ్గకుండా పెట్టుకుంటే మంచిది.
తరచూ అలెర్జీల బారిన పడేవారు ఎక్కువ గంటలపాటు ఏసీలో ఉండటకపోవడమే మంచిది. తరచూ అలెర్జీల బారిన పడుతున్నారంటే మీరు సున్నితమైన శరీరతత్వమని అర్థం చేసుకోవాలి. ఏసీలను సరిగా తుడవకపోతే దుమ్ము ధూళి వంటివి మనుషుల్లో చేరుతాయి. దీనివల్ల వారికి అనేక రకాల అలెర్జీలు వస్తాయి. ముక్కు కారడం, తుమ్ములు, కళ్ల దురద పెట్టడం వంటివి ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఏసీ యూనిట్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
టాపిక్