Cleaning tips: ఒక స్పూను ఉప్పుతో ఇంట్లోని ఎన్ని మరకలు పొగొట్టుకోవచ్చో తెలుసా? తక్కువ ఖర్చుతో ఎక్కువ మెరుపు
16 October 2024, 14:00 IST
Cleaning tips: ఉప్పును ఆహారం రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఉప్పును రుచికి మాత్రమే కాదు, ఇంట్లోని మరకలను పొగొట్టుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు.
ఉప్పుతో క్లీనింగ్ టిప్స్
ఉప్పు లేకుండా ఆహారం ఏమాత్రం రుచిగా ఉండదు. ఆహారంలో నూనె, మసాలా దినుసులు వేసినా కూడా చిటికెడు ఉప్పు వేయకపోతే అది ఏమాత్రం టేస్టీగా ఉండదు. ఆహారంలో ఉప్పు ప్రాముఖ్యత ఎంతో అందరికీ తెలిసిందే. కేవలం ఉప్పు ఆహారానికి రుచి ఇచ్చేందుకే కాదు, ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉప్పు సహాయపడుతుంది. ఉప్పును వివిధ రకాల క్లీనింగ్ హాక్ లలో కూడా ఉపయోగించవచ్చు.
పండుగలకు ఇంటిని శుభ్రపరచడం పెద్ద టాస్క్. సాధారణ ఉప్పును ఉపయోగించడం ద్వారా ఇంటిని త్వరగా, సులువుగా శుభ్రపరచవచ్చు. కాబట్టి ఉప్పుతో చేసే క్లీనింగ్ హ్యాక్ గురించి ఇక్కడ చెప్పాము. ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతి వస్తువు, ప్రతి మూల తళతళ మెరిసిపోతుంది.
రాగి పాత్రలు మెరిసేలా
ఇంట్లో ఉంచిన రాగి లేదా ఇత్తడి పాత్రలను ఎక్కువగా ఉపయోగించరు, కాబట్టి వాటిని తరచూ శుభ్రం చేయరు. ఈ కారణంగా అవి నలుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. నల్లగా మారిన ఈ రాగి, ఇత్తడి పాత్రలను పండుగల సమయంలోనే తీసి శుభ్రం చేస్తారు. వాటిని ఉప్పు సహాయంతో మెరిపించవచ్చు. దీని కోసం, సగం నిమ్మకాయ ముక్కను తీసుకొని దానిపై ఒక టీస్పూన్ ఉప్పును వేయండి. ఇప్పుడు రాగి పాత్రను నిమ్మచెక్కతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల పాత్రల నలుపు తొలగిపోయి రాగి, ఇత్తడి పాత్రలు మెరిసిపోతాయి.
వంటగది టైల్స్ మరకలు
వంట చేసేటప్పుడు నూనె, మసాలా దినుసులు తరచుగా వంటగది టైల్స్ పై పడతాయి. వాటిని వెంటనే శుభ్రం చేయకపోతే, వాటి మరకలు మొండిగా మారతాయి, వీటిని శుభ్రం చేయడం చాలా కష్టంగా మారుతుంది. వీటిని ప్రతిరోజూ శుభ్రపరచలేరు. వారానికోసారి లేదా నెలకోసారి వీటిని రుద్దుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఉప్పు సహాయం తీసుకోవచ్చు. కొద్దిగా వేడినీటిని తీసుకుని అందులో రెండు మూడు టీస్పూన్ల ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. ఇప్పుడు పీచుతో ఈ నీటిలో ముంచి దానితో కిచెన్ టైల్స్ ను శుభ్రం చేసుకోవాలి. మురికి టైల్స్ మళ్లీ కొత్తవిగా ప్రకాశిస్తాయి.
గాజు పాత్రల శుభ్రత
వంటగదిలో ఉండే గాజు పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఉప్పును ఉపయోగించవచ్చు. గాజు పాత్రలను శుభ్రం చేయాలంటే కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణంలో డిష్ వాష్ లిక్విడ్ లేదా డిటర్జెంట్ కలపండి. ఇప్పుడు తయారుచేసిన ద్రవాన్ని ఉపయోగించి గాజు పాత్రలను శుభ్రం చేయండి. స్క్రబ్బర్ సహాయంతో గాజు పాత్రలను తోమితే అవి మెరుస్తాయి.
బకెట్లు, మగ్ లు కొన్ని రోజులకు తెల్లటి నీటి మచ్చలు ఏర్పడతాయి. వాటిని తొలగించడం చాలా కష్టం. ఉప్పును ఉపయోగించి ఈ మచ్చలను సులభంగా తొలగించవచ్చు. ఇందుకోసం ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణంలో స్పాంజ్ లేదా స్క్రబ్బర్ ను ముంచి, బకెట్, మగ్ పై మరకలను రుద్దాలి. తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇందులో మీరు కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వాడవచ్చు.