Millets Sarvapindi: రాగి, కొర్రల పిండితో సర్వపిండి చేసి చూడండి, మధుమేహులకు బెస్ట్ స్నాక్-how to make healthy snack millets sarvapindi for diabetes and weightloss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millets Sarvapindi: రాగి, కొర్రల పిండితో సర్వపిండి చేసి చూడండి, మధుమేహులకు బెస్ట్ స్నాక్

Millets Sarvapindi: రాగి, కొర్రల పిండితో సర్వపిండి చేసి చూడండి, మధుమేహులకు బెస్ట్ స్నాక్

Koutik Pranaya Sree HT Telugu
Sep 18, 2024 03:30 PM IST

Millets Sarvapindi: చిరుధాన్యాలతో చేసే సర్వపిండి రుచిగా ఉంటుంది. దీంట్లో బియ్యంపిండి అస్సలు వాడం. కేవలం రాగులు, కొర్రల్లాంటి చిరుధాన్యాల పిండి వాడి తయారు చేస్తాం. మిల్లెట్స్ సర్వపిండి రెసిపీ చూడండి.

మిల్లెట్స్ సర్వపిండి
మిల్లెట్స్ సర్వపిండి

తెలంగాణ వంటల్లో సర్వపిండి చాలా ఫేమస్. సాధారణంగా దీన్ని బియ్యంపిండిలో కొన్ని పదార్థాలు కలిపి తయారు చేస్తారు. దీని రుచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రుచితో పాటూ, మరింత ఆరోగ్యకరంగా దీన్ని చిరుధాన్యాలు వాడి చేసేయొచ్చు. డయాబెటిస్ పేషెంట్లకు, బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది హెల్తీ స్నాక్ అవుతుంది.

yearly horoscope entry point

చిరుధాన్యాలతో సర్వపిండికి కావాల్సిన పదార్థాలు:

2 కప్పులు ఏదైనా చిరుధాన్యాల పిండి (రాగులు, కొర్రలు, సజ్జలు ఏవైనా తీసుకోవచ్చు)

2 ఉల్లిపాయలు, ముక్కల తరుగు

గుప్పెడు కొత్తిమీర తరుగు

1 కరివేపాకు రెమ్మ

2 క్యారట్స్, తురుము

2 చెంచాల పచ్చి శనగపప్పు

2 చెంచాల వేయించిన పల్లీలు

1 చెంచా నువ్వులు

అరచెంచా ఉప్పు

1 చెంచా పచ్చిమిర్చి ముద్ద

అరచెంచా కారం

చిరుధాన్యాలతో సర్వపిండి తయారీ విధానం:

  1. ముందుగా శనగపప్పును కడుక్కుని నీళ్లలో ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టాలి.
  2. పల్లీలను చిన్న ముక్కలుగా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేయాలి.
  3. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో చిరుధాన్యాల పిండి, కరివేపాకు తరుగు, క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముద్ద, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు వేసుకుని పొడిపొడిగా అన్నీ కలిసేలా పిండి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి. చేత్తో పిండి తీసుకుంటే లడ్డూ కట్టేలాగా ఉండాలి పిండి. మరీ మెత్తగా ఉంటే సర్వపిండి చెయ్యలేరు.
  5. కలుపుకున్న పిండిని నాలుగైదు భాగాలుగా విడదీసుకోవాలి.
  6. దీనికోసం సర్వపిండి పాత్ర వాడొచ్చు. లేదంటే పెనం తీసుకుని దానికి నూనె రాసి ఈ ముద్దను అంతటా సమంగా అయ్యేలా ఒత్తుకోవాలి.
  7. మధ్యలో రంధ్రాలు చేసి అందులోనూ కాస్త నూనె చుక్కలు వేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి.
  8. మీడియం మంట మీద ఒక అయిదు నిమిషాలు ఉడికితే చాలు. సర్వపిండి రెడీ అవుతుంది. దీన్ని మరో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. అలాగే తినేయొచ్చు.
  9. మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలతో సర్వపిండి రెడీ అయినట్లే. పచ్చి ఉల్లిపాయ ముక్కలతో దీన్ని సర్వ్ చేసేయండి.

Whats_app_banner