infused water: కూల్ డ్రింక్ బదులుగా.. ఈ ఫ్లేవర్డ్ నీళ్లు తాగండి..
17 May 2023, 15:37 IST
infused water: వేసవి తాపం నుంచి కాపాడుకోడానికి చాలా నీళ్లు తాగుతాం. ఆ నీళ్లనే ఇంకాస్త ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవచ్చో చూడండి. ఇన్ఫ్యూజ్‌డ్ వాటర్ రకాలు, తయారీ తెలుసుకోండి.
ఫ్లేవర్డ్ నీళ్లు
ఈ ఎండలతో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరట్లేదు. ఊరికే మామూలు నీళ్లు తాగకుండా కాస్త రుచి ఉన్న డ్రింక్ తాగాలనిపిస్తోందా? అలాకాకుండా నీళ్లే రుచిగా ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే ఆరోగ్యంతో పాటూ రుచినీ పెంచే వేసవిలో తాగదగ్గ ఇన్ఫ్యూస్‌డ్ వాటర్ ఎలా చేసుకోవాలో చూడండి. నీళ్లలో ఫ్లేవర్లను ఇనుమడింప చేయడమే ఈ పద్ధతి. మీకిష్టమైన రుచుల మేళవింపులను కూడా ప్రయత్నించొచ్చు. చేసుకోవడం సులభమే, ఎక్కువ ఫలితాల కోసం ఇంకేం మార్పులు చేయొచ్చో చూడండి.
ఇన్ఫ్యూజ్‌డ్ వాటర్ అంటే ఏంటి?
ఇష్టమైన పండ్లను, మూళికలను, ఆకులు, మూళికలను ముక్కలుగా చేసి నీళ్లలో కాసపు ఉంచాలి. వాటి రుచి నీళ్లకు వచ్చేస్తుంది. ఈ నీళ్లను రోజు మొత్తం తాగొచ్చు. ఆ నీళ్లను ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదా అలాగే ఉంచొచ్చు. అయితే మనం ఎంచుకున్న పదార్థాల సారం నీటిలోకి సులభంగా చేరాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఎలా చేయాలంటే..
నిమ్మ, ఆరెంజ్ , స్ట్రాబెర్రీలతో నీళ్లు చేయాలనుకంటే పండును సగం చేసి లేదా నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లలో వేసుకోవాలి.
కానీ యాపిల్ లాంటి గట్టిగా ఉండే పండ్లను వీలైనంత సన్నటి ముక్కలు చేసుకోవాలి. ఎందుకంటే వీటినుంచి ఫ్లేవర్లు బయటికి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
అల్లం , రోస్‌మెర్రీ, నిమ్మగడ్డి లాంటి వాటితో చేయాలనుకుంటే వాటిని కాస్త నలిపి వేసుకోవాలి. తులసి, పుదీనా లాంటి ఆకులైతే చేతులతో తెంపేసి వేసుకోవచ్చు.
ఎంతసేపుంచాలి?
- కీరదోస, నిమ్మజాతి పండ్లు, పుచ్చకాయ, పుదీనా లాంటివి వెంటనే ఫ్లేవర్లు విడుదల చేస్తాయి.
- యాపిల్స్, దాల్చిన చెక్క, తాజా అల్లం లాంటివి రాత్రి మొత్తం నీళ్లలో నానాలి.
- నిమ్మజాతి పండ్లను మూడు నాలుగు గంటల కన్నా ఎక్కువ నాననివ్వకూడదు. నాలుగ్గంటల తరువాత పండ్ల ముక్కలను నీళ్లలో నుంచి తీసేయాలి.
- రోజుమొత్త ఇవే నీళ్లు తాగాలనుకుంటే.. నీళ్లు అయిపోతుండగానే మామూలు నీళ్లు దాంట్లో కలుపుతూ ఉండండి. ముందులా ఎక్కువ గాఢతతో రుచి ఉండదు కానీ…కాస్త రుచి తెలుస్తుంది.
ఈ కాంబినేషన్లు ప్రయత్నించండి:
- కీరదోస+స్ట్రాబెర్రీ+ నిమ్మకాయ+ పుదీనా
- ఆరెంజ్+ అనాసపువ్వు
- పుచ్చకాయ + పుదీనా
- నిమ్మకాయ+అల్లం+పుదీనా
- నిమ్మ+ రోస్ మెర్రీ
- ఆరంజ్+బ్లూబెర్రీ+తులసి
- కీరదోస+ నిమ్మకాయ
ఐస్ క్యూబ్స్:
ఇన్ఫ్యూజ్ చేసిన నీళ్లను ఒకేసారి కాకుండా ఐస్ ట్రే లలో వేసుకుని పెట్టుకోవచ్చు. కావాల్సినపుడు నీళ్లల్లో వేసుకుంటే చాలు. లేదా ఐస్ ట్రేలలో పండ్ల ముక్కలు వేసుకుని నీళ్లు పోసుకోవాలి. ఇవి గడ్డకట్టాక నీళ్లల్లో వేసుకోవచ్చు.
టాపిక్