Monsoon Dieses : డెంగ్యూ రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
05 August 2022, 11:14 IST
- Dengue Prevention Tips : సీజనల్ వ్యాధులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డెంగ్యూ గురించి. సరైన చికిత్స తీసుకోకపోతే డెంగ్యూ ప్రాణాలను సైతం హరిస్తుంది. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం పక్కన పెడితే.. రాకుండా నివారణ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం.
డెంగ్యూ నివారణులు
Dengue Prevention Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు బాగా పెరిగిపోతాయి. ఈ దోమకాటు వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డెంగ్యూ గురించే. డెంగ్యూ ప్రాణాంతకమైన వ్యాధి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వైరస్‌ను దోమలు వ్యాపింపచేస్తాయి. ఏడెస్ జాతికి చెందిన దోమలు మురికి నీటిలో సంతానోత్పత్తి చేసి.. డెంగ్యూను వ్యాప్తి చేస్తాయి.
అయితే వీటి వృద్ధిని అడ్డుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణకు వలలు, పురుగులు మందులతో పిచికారీలు, దోమల నివారణ మందులు ఉపయోగించడం వల్ల డెంగ్యూరాకుండా జాగ్రత్త పడవచ్చు.
దోమల నివారణ మందులు
* మార్కెట్‌లో దోమల వికర్షక లేపనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రీములను రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువ వాడకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
* క్రీమ్‌లు కాకుండా.. మీరు మీ దుస్తులకు వెనుక భాగంలో దోమల ప్యాచ్‌లను అతికించవచ్చు. అవి మూడు రోజుల వరకు ఉంటాయి.
* రిపెల్లెంట్ బ్యాండ్‌లు, దోమల తొడుగులు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బాగా ఉపయోగపడతాయి.
దోమల నివారణలను ఉపయోగించండి
* దోమల నివారణ పరిష్కారాలలో భాగంగా మీ ఇంటిని శుభ్రపరచడం అలవాటు చేసుకోండి.
* మీ పరిసరాలను శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో నిమ్మగడ్డి లేదా సిట్రోనెల్లా చుక్కను జోడించవచ్చు.
* కొన్ని ఎలక్ట్రానిక్ దోమల నిరోధకాలు కూడా ఉన్నాయి. వాటి ఆవిరి దోమలను దూరంగా ఉంచుతుంది.
* నారింజ, నిమ్మకాయలలో లవంగాలు పెట్టడం వల్ల కూడా ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి.
సంతానోత్పత్తి స్థలాల నాశనం
* డెంగ్యూ వ్యాప్తి చేసే దోమలు సాధారణంగా మురికి, తడిగా ఉన్న ప్రదేశాలలో నివసిస్తాయి.
* మీరు ప్రతిరోజూ శుభ్రం చేయని ఈత కొలను లేదా కూలర్‌ని కలిగి ఉంటే.. దానిని ఖాళీ చేయడం ఉత్తమం.
* మీ ఇంటిలో లేదా చుట్టుపక్కల మురికి, నీటి సేకరణ లేకుండా చూసుకోండి.
* మీ అక్వేరియం, పూల కుండీల నీటిని క్రమం తప్పకుండా మార్చండి.
* మీ పాత్రలు, నేలను కడగకుండా అపరిశుభ్రంగా ఉంచవద్దు.
చర్మాన్ని కప్పేయండి..
* దోమల కాలంలో సరైన దుస్తులు ధరించడం చాలా ముఖ్యం.
* పూర్తి ప్యాంటు, పొడవాటి చేతులు కలిగిన చొక్కాలతో శరీరాన్ని కవర్ చేసుకోవడం చాలా మంచిది. మీ చర్మాన్ని ఎంత తక్కువ బహిర్గతం చేస్తే అంత మంచిది.
* లేత రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి. అవి మీకు దోమల్ని దూరంగా ఉంచుతాయి.
* దోమతెరలతో కప్పబడిన గదులలో నిద్రించడం ఉత్తమం.
ఇంట్లోకి వెలుగు వస్తే బెటర్
* మీ ఇంటిని దోమల బెడద లేకుండా చేయాలంటే వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చూసుకోండి. చీకటి, చిన్న ప్రదేశాలలో దోమలు తమ సంతానాన్ని పెంచుతాయి.
* రోజంతా మీ ఇంటి కిటికీల ద్వారా సూర్యరశ్మిని ప్రసరింపజేసినట్లు నిర్ధారించుకోండి. సాయంత్రం చీకటి పడినప్పుడు వాటిని మూసివేయండి.
* మీకు ఇండోర్ మొక్కలు ఉంటే.. వాటిని దోమల కాలంలో బయట ఉంచండి.
* దోమల పెంపకంలో ఎక్కువ భాగం ఇంట్లోని మొక్కలద్వారనే వ్యాప్తి జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.